Hyderabad Student: తీవ్ర విషాదం - అమెరికాలో అదృశ్యమైన హైదరాబాద్ విద్యార్థి మృతి
Hyderabad News: అమెరికాలో మరో భారతీయ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. హైదరాబాద్ కు చెందిన అబ్దుల్ అక్కడ చనిపోయినట్లు దౌత్య కార్యాలయం తెలిపింది.
Hyderabad Student Death In Us: అమెరికాలో భారతీయ విద్యార్థుల మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. కొన్ని వారాల క్రితం క్లేవ్ ల్యాండ్ లో అదృశ్యమైన హైదరాబాద్ విద్యార్థి (Hyderabad Student) మహమ్మద్ అబ్దుల్ అర్ఫాత్ (25) (Mohammad Abdul Arfat) మృతి చెందాడు. న్యూయార్క్ లోని భారత దౌత్య కార్యాలయం ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా తెలియజేసింది. 'మేము గత కొంతకాలంగా వెతుకుతున్న మహమ్మద్ అబ్దుల్ అర్ఫాత్.. ఓహైయోలోని క్లేవ్ ల్యాండ్ లో మృతి చెందాడు. అతని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసేందుకు స్థానిక పోలీసులతో సంప్రదింపులు జరుపుతున్నాం. మృతదేహాన్ని తరలించేందుకు సహాయం చేస్తాం' అని పేర్కొంది.
ఇదీ జరిగింది
హైదరాబాద్ కు చెందిన అబ్దుల్ క్లేవ్ ల్యాండ్ విశ్వ విద్యాలయంలో ఐటీ మాస్టర్స్ డిగ్రీ చేస్తున్నాడు. మార్చి 7న అబ్దుల్ అదృశ్యం అయ్యాడు. తమకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు ఫోన్ కాల్ వచ్చిందని అతని తండ్రి మహమ్మద్ సలీం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. 'కిడ్నాపర్లు 12 వేల డాలర్లు డిమాండ్ చేశారు. ఇవ్వని పక్షంలో తమ కుమారుడి కిడ్నీ విక్రయిస్తామని ఫోన్ లో బెదిరించారు. మేము డబ్బులు ఇచ్చేందుకు అంగీకరించి.. అబ్దుల్ వాళ్ల ఆధీనంలోనే ఉన్నట్లు ఆధారాలు చూపాలని అడిగాం. దీనికి కిడ్నాపర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి ఫోన్ పెట్టేశారు. మళ్లీ వారి నుంచి ఎలాంటి కాల్ లేదు.' అని అప్పట్లో సలీం వెల్లడించారు. కాకపోతే.. కిడ్నాపర్ మాట్లాడడానికి ముందు ఫోన్ ఎవరిదో ఏడుపు వినిపించిందని చెప్పారు. ఆ నెంబర్ ను అమెరికాలోని తమ బంధువులకు పంపి.. క్లేవ్ ల్యాండ్ లో పోలీసులకు అందజేయాలని చెప్పినట్లు పేర్కొన్నారు. గడిచిన కొద్ది రోజులుగా అబ్దుల్ కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. మార్చి 18న చికాగోలోనే ఇండియన్ కౌన్సిల్ సహాయాన్ని కోరారు.
మరోవైపు, అబ్దుల్ మార్చి 7న అదృశ్యం కాగా.. అతని బంధువులు మార్చి 8వ తేదీనే క్లేవ్ ల్యాండ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. అతని ఆచూకీ కోసం ప్రత్యేక బృందం తీవ్రంగా గాలించింది. ఎట్టకేలకు క్లేవ్ ల్యాండ్ లోని ఓహియోలో అతని మృతదేహాన్ని అక్కడి పోలీసులు గుర్తించారు. అబ్దుల్ పార్థివ దేహాన్ని హైదరాబాద్ నాచారం తరలించేందుకు ఇండియన్ ఎంబసీ, అమెరికా పోలీసులు చర్యలు చేపట్టారు. కాగా, 2024 ప్రారంభం నుంచి ఇప్పటి వరకూ 11 మంది భారతీయ విద్యార్థులు అమెరికాలో ప్రాణాలు కోల్పోయారు.
Also Read: Telangana News: తెలంగాణ సీనియర్ అధికారి రాజీవ్ రతన్ హఠాన్మరణం- సంతాపం తెలిపిన సీఎం