(Source: ECI/ABP News/ABP Majha)
Hanamkonda News : ప్రభుత్వ ఆసుపత్రిలో మహిళా సిబ్బంది మందు పార్టీ, వీడియో వైరల్!
Hanamkonda News : పుట్టిన రోజు వేడుకల పేరుతో ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో మందు పార్టీ పెట్టారు వైద్య ఆరోగ్య సిబ్బంది. మహిళా సిబ్బంది బీర్లు కొడుతూ చిల్ అవుతున్న ఓ వీడియో వైరల్ అవుతోంది.
Hanmakonda News : హన్మకొండలోని ఓ ప్రభుత్వ దవాఖానలో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది మద్యం సేవించిన ఘటన కలకలం రేపుతోంది. ఈ ఆసుపత్రికి వరంగల్ ఉమ్మడి జిల్లా నుంచే కాక మహారాష్ట్రలోని సరిహద్దు ప్రాంతాల మహిళలు చికిత్స కోసం వస్తుంటారు. ఈ ఆసుపత్రిలో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ప్రసూతి ఆస్పత్రిలో మహిళా సిబ్బంది మందు పార్టీ చర్చనీయాంశం అయింది. స్టాఫ్‌రూమ్‌లో మహిళా సిబ్బంది బీర్లు తాగుతూ హల్ చల్ చేశారు. రోగులను గాలికి వదిలేసి బీర్లు తాగుతూ సిబ్బంది హంగామా చేశారు. మద్యం పార్టీలో ఆరోగ్య శ్రీ ఉద్యోగి, ఒక స్టాప్ నర్స్, జీఎన్‌ఎమ్ ఉన్నారు. వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది వ్యవహారంపై చికిత్స కోసం వచ్చిన మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హాస్పిటల్‌ను బార్‌గా మార్చిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
పుట్టిన రోజు వేడుకలు పేరిట మందు పార్టీ
హన్మకొండ ప్రసూతి ఆసుపత్రి ఆరోగ్యశ్రీ విభాగంలో పనిచేస్తున్న ఇద్దరు మహిళా సిబ్బంది బయట నుంచి మరో ఇద్దరు మహిళలను పిలిచి ఆసుపత్రిలో బీర్ పార్టీ చేసుకున్నారు. బుధవారం రాత్రి పుట్టినరోజు వేడుకల పేరిట ఓ గదిలో వైద్య ఆరోగ్య సిబ్బంది మందు పార్టీ చేసుకున్నారు. మందు పార్టీ దృశ్యాలను ఆసుపత్రిలోని రోగుల బంధువులు వీడియో తీశారు. అప్రమత్తంగా ఉండాల్సిన సిబ్బంది ఇలా బాధ్యత రహితంగా వ్యవహరించడంపై కఠిన చర్యలు తీసుకోవాలని రోగుల బంధువులు డిమాండ్ చేస్తున్నారు. హన్మకొండ, వరంగల్ ఉన్నతాధికారుల కార్యాలయాలకు సమీపంలో ఈ ప్రభుత్వ ప్రసూతి దవాఖాన ఉంది. కానీ ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం ఈ ఘటనతో చాలా స్పష్టంగా కనిపిస్తోంది. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నా అధికారులు ఏం చేస్తున్నట్టు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
మద్యం మత్తులో ఎస్సై వీరంగం
మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఓ ఏస్సై వీరంగం సృష్టించాడు. మద్యం మత్తులో కరీంనగర్ పోలీసు కమిసనరేట్ పరిధిలోని బెజ్జంకి పోలీస్ స్టేషన్ ఎస్సై తిరుపతి తన అనుచరులు, స్నేహితులతో కలిసి అర్ధరాత్రి రోడ్లపై తిరుగుతూ నానా హంగామా చేశారు. పట్టణంలోని ఐబీ ప్రాంతంలోని రోడ్లపై మంగళవారం అర్ధరాత్రి పోలీసులు హల్ చల్ చేశారు. అప్పటికే పూటుగా తాగి ఉన్న పోలీసులు.. నానా రబస చేశారు. మద్యం సేవిస్తున్న వారిలో కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ ఎస్సై, అతడి స్నేహితులు ఉన్నారు. ఇబ్బందులకు గురైన వాహనదారులు 100 డయల్ కు ఫిర్యాదు చేయగా సంఘటనా స్థలానికి బ్లూకోర్టు పోలీసులు చేరుకొని వారిని అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు.
కానిస్టేబుళ్లపై దాడి
పోలీసులు విచారణ చేపట్టే సమయంలో ఇద్దరు కానిస్టేబుల్స్, ఒక హోంగార్డులపై సైతం ఎస్సై తిరుపతి అతడి స్నేహితులు దాడికి పాల్పడ్డారు. దాడికి సంబంధించిన ఘటనను వీడియో తీస్తుంటే పరుష దూషిస్తూ, పోలీసుల వద్ద ఉన్న ట్యాబ్ లను లాగేసుకుని ధ్వంసం చేశారు. ఇద్దరు కానిస్టేబుళ్లు, హోంగార్డులకు తీవ్ర గాయాలు కావడంతో వారిని మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరంగం సృష్టించిన బెజ్జంకి ఎస్సై కారును స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై మంచిర్యాల జిల్లా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
Also Read : Visakha News: కడుపులో కత్తులు దించినా కాళీలా దొంగలను ఎదురించిన మహిళ!