Visakha News: కడుపులో కత్తులు దించినా కాళీలా దొంగలను ఎదురించిన మహిళ!
Visakha News: అర్ధరాత్రి ఇంట్లోకి దొంగలు వచ్చారు. అది గమనించిన మహిళ వాళ్లను అడ్డుకునే ప్రయత్నం చేసింది. వారు కత్తులతో పొడిచినా, రక్తం కారుతున్నా పట్టించుకోకుండా కాళీలా వారిని తరిమికొట్టింది.
Visakha News: మగవాళ్లు లేకుండా అర్ధరాత్రిళ్లు ఇంట్లో ఉండటం అంటే ఇప్పటికీ చాలా మంది ఆడవాళ్లు భయపడుతుంటారు. ఎవరైనా వచ్చి ఏమైనా చేస్తారని భయం భయంగా గడుపుతుంటారు. కానీ విశాఖలో ఓ మహిళ మాత్రం తన ధైర్య సాహసాలను చూపించింది. అర్ధరాత్రి ఇంట్లో చొరబడ్డ దొంగలను అడ్డుకుంది. వారు కత్తులతో పొడిచినా కాళీలా తిరగబడింది. కడుపులోంచి రక్తం ధారగా కారుతున్నా ఏమాత్రం వణకకుండా దుండుగల గుండెల్లో దడ పుట్టించింది. ఇంట్లో నుంచి వారిని వెళ్లగొట్టేవరకు ఎదురొడ్డుతూనే ఉంది.
కిటికీ స్క్రూలు విప్పి లోపలికి చొరబడ్డ దొంగలు..
విశాఖపట్నంలో జిల్లాలోని చీమలాపల్లికి చెందిన ఆళ్ల అప్పారావు, లలిత కుమారి దంపతులు. వీరికి ఇద్దరు కుమారులు(వినయ్ కుమార్, అవినాష్). అయితే చిన్న కుమారుడు అవినాష్ కు పెళ్లి జరగడంతో వీరితోపాటే కోడలు లావణ్య కూడా అదే ఇంట్లో ఉంటోంది. అవినాష్ నగరంలోని ఓ ప్రైవేటు కంపెనీలో సూపర్ వైజర్ గా పని చేస్తున్నాడు. మంగళవారం రాత్రి అతను నైట్ డ్యూటీకి వెళ్లాడు. ఇంట్లో ఓ గదిలో లావణ్య(25) నిద్రిస్తుండగా మరో గదిలో అప్పారావు, లిలత కుమారి, వినయ్ కుమార్ పడుకున్నారు. ఆర్ధరాత్రి సమయంలో ఇద్దరు దొంగలు ఆ ఇంటికి వచ్చారు. చడీ చప్పుడు లేకుండా హాల్లోని కిటికీ స్క్రూలు విప్పి లోపలికి చొరబడ్డారు. వెంటనే అప్పారావు, లలిత కుమారి, వినయ్ కుమార్ పడుకుని ఉన్న గది తలుపుకు బయట గడియపెట్టారు.
బీరువా ముట్టనీయకుండా దొంగలతో లావణ్య ఫైట్..
లావణ్య పడుకుని ఉన్న గది తలుపును గట్టిగా తన్నడంతో బోల్డు ఊడి వచ్చింది. తలుపు తెరుచుకుంది. వెంటనే దుండగులు లోపలికి వెళ్లారు. అయితే చప్పుడుతో మెళకువ వచ్చిన లావణ్యకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. అయితే ఆమె తేరుకునే లోపే గదిలో ఉన్న బీరువాను తెరిచేందుకు ప్రయత్నించారు దొంగలు. ఈ క్రమంలోనే లావణ్య వారిని గట్టిగా పట్టుకొని కేకలు వేసింది. ఆమె అరుపులకు ఏం జరిగిందో అని పక్క గదిలో ఉన్న ఉన్న అత్త, మామ, బావలు నిద్ర లేచారు. బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తే గది బయట గొళ్లెం పెట్టి ఉండటంతో వాళ్లు బయటకు రాలేకపోయారు. అయితే లావణ్య మాత్రం ఓ వైపు కేకలు వేస్తూనే మరోవైపు వారిని ప్రతిఘటిస్తోంది.
కత్తులతో లావణ్యపై దొంగల దాడి..
ఈమెతోపాటు అత్తా, మామ, బావ కూడా గట్టిగా కేకలు వేయడంతో భయపడ్డ దొంగలు.. వెంటనే వెంట తెచ్చుకున్న కత్తితో లావణ్యపై దాడి చేశారు. కడుపు, కాళ్లపై కత్తితో పొడిచారు. అనంతరం వారు అక్కడి నుంచి పారిపోయారు. రక్తం కారుతున్నా పట్టించుకోకుండా అత్తా, మామలు ఉన్న గది తలుపులు తెరిచింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు.. ఆధారాలు సేకరించారు. క్లూస్ టీం ఆధారంగా వేలి ముద్రలను సేకరించారు. అయితే మొత్తం నలుగురు దొంగలు దొంగతనానికి రాగా.. ఇద్దరు మాత్రమే లోపలకు చొరబడ్డారని, మిగతా ఇద్దరూ బయటే ఉన్నారని తెలిపారు.
బయట ఆరేసి ఉన్న బట్టలను కట్ చేసి మొహానికి చుట్టుకున్నారని.. తెలుస్తోంది. అయితే దొంగలు పారిపోయేటప్పుడు ఆ ముక్కలను ఇంటి బయటే పడేసి వెళ్లిపోారు. అలాగే దొంగతనానికి వచ్చింది చెడ్డీ గ్యాంగ్ అనే ప్రచారం కూడా సాగుతోంది.