Software Engineer Died: అమెరికాలో గుంటూరు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మృతి, ఔటింగ్‌కు వెళ్లడంతో తీవ్ర విషాదం
Software Engineer Died: గుంటూరుకు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ శ్రీనాథ్ అమెరికాలో మృతి చెందారు. అయితే భార్యాభర్తలిద్దరూ ట్రెక్కింగ్ కోసం వెళ్లగా ప్రమాదవశాత్తు 200 అడుగుల ఎత్తు నుంచి పడి చనిపోయాడు.
Software Engineer Died: గుంటూరుకు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఒకరు అమెరికాలో మృతి చెందారు. గంగూరు శ్రీనాథ్(32 ) అమెరికాలో ఉంటున్నాడు. గుంటూరు వికాస్ నగర్ కు చెందిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సుఖవాసి శ్రీనివాస రావు, రాజ శ్రీ దంపతుల కుమర్తె సాయి చరణి, రాజేంద్రనగర్ కు చెందిన శ్రీనాథ్ కు అయిదేళ్ల కిందట వివాహం జరిగింది. దంపతులు ఇద్దరూ అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్లుగా పని చేస్తున్నారు. గతంలో వీరు ఫ్లోరిడాలో ఉండేవారు. ఆరు నెలల కిందట శ్రీనాథ్, సాయి చరణి అట్లాంటాకు మారారు. ఆదివారం సెలవు కావడంతో ఔటింగ్ కు వెళ్లారు. దంపతులు ఇద్దరూ కలిసి అట్లాంటాలో ట్రెక్కింగ్ కు వెళ్లారు. క్లీవ్ లెన్స్ మౌంటెన్ హిల్స్ లో ఎత్తయిన ప్రదేశానికి చేరుకోగా.. అక్కడి నుండి శ్రీనాథ్ పట్టుతప్పి 200 అడుగుల లోతు ఉన్న లోయలో పడి పోయాడు.
తీవ్ర గాయాలతో మృతి
ఈ ప్రమాదంలో శ్రీనాథ్ కు తీవ్రగాయాలు అయి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. భర్త చనిపోయిన విషయాన్ని సాయి చరణి, అత్తా మామలకు చెప్పడంతో వారు గుండెలు పగిలేలా రోదించారు. అయితే శ్రీనాథ్ మృతదేహాన్ని అమెరికా నుండి గుంటూరుకు తీసుకువచ్చేందుకు దాదాపు వారం రోజుల సమయం పట్టే అవకాశం ఉందని శ్రీనాథ్ మామ సుఖవాసి శ్రీనివాస రావు తెలిపారు. అమెరికాలో ఉంటున్న గుంటూరు మిర్చి యార్డు మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు, తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి, గుంటూరుకు చెందిన ప్రవాసాంధ్రులు మల్లిక్ మేదరమెట్ల, అశోక్ కొల్లా, సరేష్ కాకర్ల బాధిత కుటుంబానికి సాయం అందిస్తున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
శ్రీనాథ్, సాయి చరణి దంపతులకు ఐదేళ్ల క్రితం వివాహం కాగా.. వారికి మూడేళ్ల కూతురు కూడా ఉంది. శ్రీనాథ్.. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్ లో మాస్టర్స్ చేశాడు. అతను మిన్నెసోటాలోని ఒక ఫైనాన్షియల్ కంపెనీతో సాఫ్ట్ వేర్ డెవలపర్ గా తన వృత్తిని ప్రారంభించాడు. అల్లుడి మరణంతో విషాదంలో ఉన్న టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సుఖవాసి శ్రీనివాస రావును టీడీపీ నేతలు పరామర్శించారు. అల్లుడి మరణంపై సంతాపాన్ని తెలియజేశారు.
వారం క్రితం అమెరికాలో ఓ తెలుగు యువకుడు మృతి చెందాడు. విహార యాత్రలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా విహార యాత్రకు వెళ్లిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ నెక్కలపు హరీష్ చౌదరిఘ(35) ప్రమాదవశాత్తు మృతిచెందాడు. విజయవాడ పోరంకి వసంత్ నగర్ కాలనీకి చెందిన నెక్కలపు హరీష్ చౌదరి కెనడానలో టూల్ మేకర్ గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో హరీష్ కుటుంబసభ్యులతో కలిసి కలిసి న్యూయార్క్ విహార యాత్రకు వెళ్లారు. అయితే ప్రమాదవశాత్తు ఇతాకా జలపాతంలో జారిపడ్డాడు. ఈ దుర్ఘనటలో హరీష్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
ఆహ్లాదంగా సాగాల్సిన విహార యాత్ర విషాదాంతం కావాలంటే జాగ్రత్తలు పాటించాల్సిందే. విహార యాత్రలు విషాదాంతం కావడం వారం రోజుల్లో రెండు ఘటనలు జరిగాయి. విహారయాత్రలకు వెళ్లిన సమయంలో జాగ్రత్తగా మెలగడం చాలా ముఖ్యం. సేఫ్టీ గేర్ లేనిదే విహార యాత్రలకు వెళ్లవద్దని సూచిస్తుంటారు నిపుణులు.