Guntur Crime: లిఫ్ట్ ఇస్తానని మాయమాటలు చెప్పి మహిళపై లైంగిక దాడికి యత్నం!
లిఫ్ట్ ఇస్తానని మహిళకు మాయమాటలు చెప్పి మార్గమధ్యలో ఆమెపై లైంగిక దాడితి యత్నించాడో వ్యక్తి. స్థానికుల సాయంతో తప్పించుకున్న ఆమె పోలీసులను ఆశ్రయించింది.
టెంపర్ మూవీ క్లైమాక్స్ కోర్టు సీన్ లో హీరో ఎన్టీఆర్ 'ఈ దేశమంటే నాకు చాలా ఇష్టం సార్. ఎందుకంటే ఇక్కడున్నంత స్వేచ్ఛ ఏ దేశంలోనూ లేదు. మహిళల పట్ల అసభ్యంగా అతిక్రూరంగా ప్రవర్తించినా చట్టాల్లో లొసుగులు వెతికి తప్పించుకోవచ్చు. ఒకవేళ ఉరిశిక్ష వేసిన అది అమలు అయ్యేటప్పటికీ ఏళ్లకు ఏళ్లు గడిచిపోతాయి. కేసుల విచారణ కూడా ఐదేళ్లకో పదేళ్లకో పూర్తవుతాయి. అత్యాచారాలు చేస్తే ఒక్క రోజులో శిక్షించే అధికారం మీకు ఉందా' అంటూ న్యాయస్థానాన్ని అడుగుతారు. ప్రస్తుత సమాజంలో రోజురోజుకీ మహిళ పట్ల దురాగతాలు పెరిగిపోతున్నాయి. వీటికి అడ్డుకట్టవేయాలంటే రోజుల వ్యవధిలో శిక్షించే చట్టాలు రావాల్సిందే అంటున్నారు బాధితులు. గుంటూరు జిల్లాలో లిఫ్ట్ ఇస్తామని మహిళకు మాయమాటలు చెప్పి ఆమెపై లైంగికదాడికి పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. బాధిత మహిళ, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
లిఫ్ట్ ఇచ్చి మహిళపై లైంగికదాడి
గుంటూరు జిల్లా పెదకూరపాడు–పాటిబండ్ల రోడ్డులో సోమవారం సాయంత్రం ఓ మహిళ బంధువు దశదిన కర్మకు హాజరై ఇంటికి వెళ్లేందుకు వేచిచూస్తుంది. సుమారు 6 గంటల సమయంలో పాటిబండ్ల ఆటో స్టాండ్ వద్దకు వచ్చిన మహిళ.. చాలాసేపు వేచిచూసింది. ఎంతసేపటికీ ఆటోలు రాకపోవడంతో తిరిగి బంధువుల ఇంటికి వెళ్లేందుకు సిద్ధమైంది. ఓ గుర్తు తెలియని వ్యక్తి బైక్ పై వచ్చి తాను పెదకూరపాడు వెళ్తున్నానని కావాలంటే అక్కడి వరకు లిఫ్ట్ ఇస్తానని మహిళకు మాయమాటలు చెప్పాడు. ఆ వ్యక్తి మాటలు నమ్మిన మహిళ బైక్ ఎక్కింది. పెదకూరపాడు వెళ్లేందుకు రెండు రూట్ లు ఉండటంతో సామాజిక ఆరోగ్య కేంద్రం రోడ్డుపై తీసుకెళ్తానని మహిళతో చెప్పాడు. కానీ వేరే రూట్ లో తీసుకెళ్తుంటే అనుమానంతో ఆమె ప్రశ్నించగా, ఇటు వెళితే దగ్గర అన్ని చెప్పి మహిళను నమ్మించాడు. మార్గమధ్యలో ఆమెతో అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. భయంతో ఆమె బైక్ పై నుంచి దూకేసి పాటిబండ్ల వైపు పరుగులు పెట్టింది. మహిళను వెంబడించిన దుండగుడు ఆమెను పట్టుకుని పొదల్లోకి లాకెళ్లి లైంగికదాడికి యత్నించాడు. మహిళ పెద్దగా కేకలు వేయడంతో అటుగా వెళ్తున్న స్థానికులు ఆగారు. దీంతో మహిళ వెంటనే వారిని ఆశ్రయించింది.
బైక్ నెంబర్ ఆధారంగా దర్యాప్తు
స్థానికులు మహిళకు రక్షణ కల్పించి ఆ వ్యక్తిని వెంబడించారు. అతడు పొలాల్లో నుంచి పెదకూరపాడు–గుంటూరు వైపు పరారయ్యాడు. ఈ విషయాన్ని స్థానికులు పెదకూరపాడు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే స్పందించిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మహిళను విషయం అడిగి తెలుసుకున్నారు. నిందితుడు బైక్ ను అక్కడే వదిలిపరారవ్వడంతో ఆ బైక్ నెంబర్ ఆధారంగా నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ద్విచక్రవాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మహిళను వివరాలు సేకరించి ఆమెను బంధువులకు అప్పగించారు. బైక్ నెంబర్ ప్రకారం కన్కం సాంబశివరావు పేరుపై రిజిస్ట్రేషన్ అయినట్లు సీఐ పేర్కొన్నారు. పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.