Guntur Crime : దుగ్గిరాల మహిళ మర్డర్ కేసు, వివాహేతర సంబంధమే హత్యకు కారణం : ఎస్పీ ఆరీఫ్ హఫీజ్
Guntur Crime : గుంటూరు జిల్లాలో మహిళ హత్య కేసు మరో మలుపుతిరిగింది. మహిళతో నిందితులకు సంబంధం ఉందని ఎస్పీ తెలిపారు. సామూహిక అత్యాచారం జరగలేదని స్పష్టం చేశారు.
Guntur Crime : గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం తుమ్మపూడిలో మహిళ హత్య ఘటనపై ఎస్పీ ఆరీఫ్ హఫీజ్ స్పందించారు. మహిళపై సామూహిక అత్యాచారం జరగలేదని తెలిపారు. అక్రమ సంబంధం నేపథ్యంలోనే హత్య జరిగిందని తేల్చారు. కొర్రపాటి సాయి సతీష్ తో మృతురాలికి వివాహేతర సంబంధం ఉందని విచారణలో తేలిందన్నారు. తరచుగా సాయి సతీష్ మృతురాలి ఇంటికి వచ్చి వెళ్తుంటాడని తెలిపారు. బుధవారం సతీష్ తో పాటు సాయిరాం ఆ మహిళ ఇంటికి వచ్చాడన్నారు. సతీష్ మహిళతో కలిసి బయటకు వచ్చాక సాయిరాం లోపలికి వెళ్లాడని, తనకు కూడా సహాకరించాలని సాయిరాం ఒత్తిడి చేశారన్నారు. మృతురాలు నిరాకరించడంతో చీరతో మెడకు బిగించి హత్య చేశాడు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరిని అరెస్ట్ చేశామని ఎస్పీ తెలిపారు. నిందితులకు ఎలాంటి రాజకీయ కోణం లేదన్నారు.
సామూహిక అత్యాచారం కాదు : ఎస్పీ
"ఈ మర్డర్ గ్యాంగ్ రేప్ వల్ల కాదు. వివాహేతర సంబంధం కారణంగా హత్య జరిగింది. కొన్ని ఛానల్స్ లో తప్పుగా చూపిస్తున్నారు. ఈ మహిళకు నిందితులకు సంబంధం ఉంది. వాళ్లు తరచూ మహిళ ఇంటికి వెళ్లేవారు. అలాగే నిన్న మధ్యాహ్నం నిందితులు మహిళ ఇంటికి వెళ్లాడు. సాయిరాం అనే యువకుడు మహిళను బలవంతం చేశాడు. అందుకు ఆమె ఒప్పుకోలేదు. దీంతో మహిళను చీరతో ఊపిరి ఆడకుండా చేసి హత్య చేశాడు. ఆ తర్వాత ఇద్దరు అక్కడి నుంచి పారిపోయారు. గ్యాంగ్ రేప్ జరిగిందని వార్తలు రావడంతో నిందితులు లొంగిపోయారు. మహిళ తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో మర్డర్ కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఎటువంటి పొలిటికల్ ఇన్వాల్వ్ మెంట్ లేదు. వీరంతా ఒకే గ్రామానికి చెందిన వాళ్లు. మహిళ భర్త దూరంగా ఉండడంతో ఈ ఇద్దరు యువకులతో సంబంధం ఏర్పడింది. కేసు దర్యాపులో ఉందని పూర్తి వివరాలు త్వరలో తెలియజేస్తాం" అని ఎస్పీ ఆరీఫ్ హఫీజ్ తెలిపారు.
తెనాలి ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత
మృతురాలి కుటుంబానికి న్యాయం చెయ్యాలని తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో బాధితురాలి కుటుంబసభ్యులతో కలిసి మహిళ సంఘాలు ఆందోళనకు దిగాయి. పోస్టుమార్టం చెయ్యటానికి ఆమె భర్త సంతకం చేసేందుకు నిరాకరించారు. ఉదయం నుంచి ప్రభుత్వ తరపున తన దగ్గరకు అధికారులు వస్తున్నారని వార్తలు వచ్చాయని, కానీ ఇంతవరకు ఒక్కరు కూడా రాలేదని ఆయన తెలిపారు. తమకు ప్రభుత్వం నుంచి సరైన హామీ ఇవ్వాలని భర్త డిమాండ్ చేస్తున్నారు. బాధితురాలి కుటుంబానికి న్యాయం చెయ్యాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తు్న్నాయి. నిందితులకు కఠిన శిక్ష వెయ్యాలని కోరాయి. గుంటూరు జిల్లా తెనాలి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు, టీడీపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది. మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆ సమయంలో వాసిరెడ్డి పద్మకు వ్యతిరేకంగా టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. అలాగే నారా లోకేశ్ బాధితురాలి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు రానున్నారు.
అసలేం జరిగింది?
గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం తుమ్మపూడిలో బుధవారం దారుణం జరిగింది. ఇద్దరు యువకులు మహిళను హత్య చేసి వివస్త్ర చేశారు. ఈ ఘటన సమాచారం అందుకున్న దుగ్గిరాల ఎస్ఐ శ్రీనివాసరెడ్డి ఘటనాస్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. వీరంకి తిరుపతమ్మ, శ్రీనివాసరావు దంపతులు పంట పొలాలకు నీళ్లు పెట్టే పైపులు అద్దెకిస్తూ జీవిస్తున్నారు. శ్రీనివాసరావు వేరే ఊరిలో ఉన్నారు. ఇంట్లో వివస్త్రగా పడి ఉన్న తిరుపతమ్మను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.