Karnataka: స్నేహితుడ్ని ఆస్పత్రికి తీసుకెళ్తే ఖర్చవుతాయని బావిలో పడేసి చంపేశారు - ఇలాంటి ఫ్రెండ్స్ కూడా ఉంటారా?
Friends kill injured Friend: వాళ్లు ఫ్రెండ్స్ కానీ గొడవపడ్డారు. ఒకరికి గాయాలయ్యాయి. ఆస్పత్రికి తీసుకెళ్తే ఖర్చులవుతాయని అతడని సజీవంగానే బావిలోకి తోసేసి వెళ్లిపోయారు.

Friends kill injured youth to avoid medical costs: కర్ణాటక రాజధాని బెంగళూరులో మానవత్వం మంటగలిసేలా జరిగిన ఒక దారుణ హత్యోదంతం వెలుగులోకి వచ్చింది. గాయపడిన స్నేహితుడిని ప్రాణాలతో కాపాడాల్సిన వారే, ఆసుపత్రి వైద్య ఖర్చులకు భయపడి అతడిని దారుణంగా అంతమొందించిన తీరు పోలీసులను సైతం విస్మయానికి గురిచేసింది.
మృతుడు సునీల్, అతని స్నేహితులు కలిసి ఒక సాయంత్రం మద్యం సేవించారు. ఈ క్రమంలో వారి మధ్య మొదలైన చిన్నపాటి వివాదం పెరిగి పెద్దదై గొడవకి దారితీసింది. నిందితులు సునీల్‌పై తీవ్రంగా దాడి చేయడంతో అతను కిందపడిపోయాడు. ఈ ప్రమాదంలో సునీల్ తలకు , కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. అతడు స్పృహ కోల్పోవడంతో నిందితులు మొదట భయపడి, అతడిని ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లే క్రమంలో, అతడికి అయ్యే వైద్య ఖర్చులు వేలల్లో ఉంటాయని, పైగా ఇది పోలీసు కేసు అవుతుందని భయపడ్డారు.
తీవ్ర రక్తస్రావంతో ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతున్న సునీల్‌ను ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తే తమ జేబులకు చిల్లు పడుతుందని నిందితులు భావించారు. ఈ క్రమంలోనే ఒక అత్యంత క్రూరమైన ఆలోచన చేశారు. చికిత్స చేయించి వేల రూపాయలు ఖర్చు పెట్టడం కంటే, అతడిని పూర్తిగా వదిలించుకుంటే ఏ గొడవ ఉండదు అని నిర్ణయించుకున్నారు. గాయాలతో ఉన్న సునీల్‌ను కారులో ఎక్కించుకుని బెంగళూరు శివార్లలోని ఒక నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ ఉన్న ఒక పాత బావిలో అతడిని సజీవంగానే పడేసి, ఎవరికీ అనుమానం రాకుండా అక్కడి నుంచి పరారయ్యారు.
కొన్ని రోజుల తర్వాత ఆ బావి నుంచి తీవ్రమైన దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మృతదేహాన్ని వెలికి తీసి పోస్ట్‌మార్టంకు పంపగా, బావిలో పడే సమయానికి సునీల్ ప్రాణాలతోనే ఉన్నాడని, గాయాల వల్ల కలిగిన నొప్పితో పాటు ఊపిరాడక చనిపోయాడని తేలింది. సునీల్ కాల్ డేటా ,మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులకు అతని స్నేహితులపై అనుమానం వచ్చింది. వారిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా, అసలు నిజాన్ని ఒప్పుకున్నారు. కేవలం మెడికల్ బిల్లులు కట్టలేకే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు నిందితులు విచారణలో తెలపడం గమనార్హం.
ఈ ఘటనపై బెంగళూరు పోలీసులు హత్య కేసు నమోదు చేసి ముగ్గురు నిందితులను జైలుకు పంపారు. అత్యంత సన్నిహితంగా ఉండే స్నేహితులే ఇలాంటి అమానుషానికి ఒడిగట్టడం సమాజంలో మారుతున్న విలువల పట్ల ఆందోళన కలిగిస్తోంది. పోలీసులు ఈ కేసును త్వరితగతిన విచారణ జరిపి నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తామని హామీ ఇచ్చారు.





















