Adilabad News: ఫోన్ పే ద్వారా నగదు తీసుకుంటున్నారా!- ఇలా మీరు కూడా మోసపోవచ్చు జాగ్రత్త
Telangana Crime: పెట్రోల్ కొట్టించుకుంటారు ఫోన్ పే చేస్తారు. నగదు అవసరం ఉందని చెప్పి ఎక్కువ కమిషన్ ఇచ్చి డబ్బులు తీసుకుంటారు. మళ్లీ ఫోన్ పే చేసినట్టు చూపిస్తారు. ఇక్కడే అసలు కిటుకును ఉపయోగిస్తారు.
Telangana News: పెట్రోల్ కొట్టించుకుంటారు ఫోన్ పే చేస్తారు. నగదు అవసరం ఉందని చెప్పి ఎక్కువ కమిషన్ ఇచ్చి డబ్బులు తీసుకుంటారు. మళ్లీ ఫోన్ పే చేసినట్టు చూపిస్తారు. ఇక్కడే అసలు మోసం దాగి ఉంది. ఏకంగా రెండేళ్ల నుంచి ఇలాంటి చీటింగ్ చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు.
నకిలీ ఫోన్ పే యాప్‌తో డబ్బులు చెల్లించినట్లు చూపించి పెట్రోలు బంకుల్లో మోసం చేస్తున్న ముఠాను నిర్మల్ జిల్లా పోలీసులు పట్టుకున్నారు. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కూనేపల్లికి చెందిన జమొల్ల భారత్, కిషన్ తాండకు చెందిన ధరంసోత్ సాయికిరణ్, రాథోడ్ అరుణ్, రాథోడ్ జీవన్ ముఠాగా ఏర్పడి మోసాలకు పాల్పడుతున్నారు. కొరియర్ బాయ్‌గా భారత్ పని చేస్తుండగా మిగతా ముగ్గురు కూలీ పనులు చేసేవారు.
సులభమైన మార్గాల్లో డబ్బులు సంపాధించాలన్న ఆలోచనో నకిలీ ఫోన్ పే యాప్ గురించి తెలుసుకున్నారు. దీని సాయంతో తొలుత వర్ని ప్రాంతంలో రెండు బంకుల్లో సులభంగా మోసగించారు. తర్వాత వేర్వేరు చోట్ల తిరుగుతూ బురిడీ కొట్టించడం మొదలెట్టారు. దాదాపు రెండేళ్లపాటు ఈ మోసాలను కొనసాగించారు.
ఈ ఏడాది జూన్ 2న నిర్మల్ పట్టణంలోని పోలీస్ పెట్రోల్ బంకులో పెట్రోలు పోయించుకున్నారు. తొలుత రూ.200 సాధారణ పోన్ పేతో డబ్బులు పంపించి అక్కడున్నవారిని నమ్మించారు. తర్వాత నగదు అవసరముందని చెప్పి అక్కడి బంకు సిబ్బందికి నకిలీ ఫోన్ పే యాప్ సాయంతో రూ.8 వేలు పంపించినట్లు నమ్మించి అతడి నుంచి నగదు తీసుకుని వెళ్లిపోయారు. జూన్ 28న నిర్మల్‌లోని కావేరి పెట్రోల్ బంకులో ఇదే తరహాలో రూ.8 వేలు తీసుకున్నారు. అనంతరం వీటిని పంచుకునేవారు.
ఇలా మోసపోయిన బాధితులిద్దరూ నిర్మల్ పట్టణ పోలీసులకు సమాచారం అందించారు. గురువారం పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా ఈ నలుగురు అనుమానాస్పదంగా కనిపించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. నిజామాబాద్, కామారెడ్డి, రామాయంపేట్ ప్రాంతాల్లోనూ ఈ తరహా మోసాలకు పాల్పడినట్లు ఒప్పుకున్నారు. వీరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుల వద్ద ఒక ద్విచక్రవాహనం, నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
ప్రజలు గుర్తు తెలియని వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలని, ఫోన్ పే యాప్‌తో నగదు ఇచ్చి పుచ్చుకునే సమయంలో చూసుకోవాలని, ఎవరైనా ఇలాంటి మోసాలకు పాల్పడితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు.