Eluru News: ఎస్ఈబీ అధికారులమంటూ దందాలు, ముఠా గుట్టు రట్టు చేసిన పోలీసులు
Eluru News: ఏలూరు జిల్లా కొయ్యలగూడెంలో ఎస్ఈబీ అధికారులమంటూ దర్జాగా దందాలు చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. బియ్యం వ్యాపారులను బెదిరించి లక్ష రూపాయలు కాజేసిన కేటుగాళ్లను అరెస్ట్ చేశారు.
Eluru News: ఎస్ఈబి అధికారులమంటూ దర్జాగా దందాలకు పాల్పడుతున్న ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. ఏలూరు జిల్లా కొయ్యలగూడెం పరిసర ప్రాంతాల్లో ఎస్ఈబీ అధికారులమంటూ గత సంవత్సరం కాలంగా కొంత మంది వ్యక్తులు ఓ ముఠాగా ఏర్పడి దర్జాగా దందాలకు పాల్పడుతున్నారు. కొయ్యలగూడెం ఏజెన్సీ పరిసర ప్రాంతాల్లో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం వాహనాలను లక్ష్యంగా చేసుకొని బెదిరింపులకు పాల్పడుతున్నారు. ముందుగా పట్టుకున్న వాహనాలను నిర్మానుష్య ప్రదేశాల్లోకి తీసుకు వెళ్లి ఎస్ఈబీ అధికారులం, కేసు నమోదు చేసి వాహనాన్ని సీజ్ చేస్తామంటూ బియ్యం వ్యాపారులను భయపెడ్తారు. లంచంగా ఏమైనా ఇస్తే మీరు వెళ్లిపోవచ్చని చెప్తారు. అలా వారి వద్ద నుంచి అందిన కాడికి దండుకొని వదిలేస్తుంటారు.
ఇలా దాదాపు సంవత్సరం కాలంగా బియ్యం వ్యాపారులను బెదిరిస్తూ.. లక్షల రూపాయల సొమ్మును దోచేశారు. ఇలాగే మోసపోయిన గంధి శ్రీనివాస్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ముఠాపై కన్నేశారు. ఈ క్రమంలోనే పక్కా సమాచారంతో ముఠాను పట్టుకున్నారు. ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి 5500 రూపాయల నగదు, మూడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కాకినాడలో ప్రేమించలేదని యువతి గొంతు కోశాడు..
కాకినాడ కూరాడలో దారుణ ఘటన చోటుచేసుకుంది. యువతిపై ప్రేమోన్మాది దాడి చేశాడు. ప్రేమించలేదని యువతి గొంతు కోసి హత్య చేశాడు సూర్యనారాయణ అనే యువకుడు. ప్రేమ పేరిట యువతిని కొంతకాలంగా సూర్యనారాయణ వేధిస్తున్నాడు. శనివారం స్కూటీపై వెళ్తోన్న యువతిని వెంబడించిన సూర్యనారాయణ యువతిని హత్యచేశాడు.
అసలేం జరిగింది?
తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బాలారం గ్రామానికి చెందిన గుబ్బల వెంకట సూర్యనారాయణ(25) కొంతకాలంగా బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం కె.గంగవరం గ్రామానికి చెందిన దేవిక(22)ను ప్రేమ పేరిట వేధిస్తున్నాడు. వీరు కూరాడలోని వారి బంధువుల ఇంటి వద్ద ఉండేవారు. ప్రేమిస్తున్నానంటూ సూర్యనారాయణ వేధిస్తున్నాడని యువతి బంధువులు పెద్దల దృష్టికి తీసుకెళ్లి పంచాయితీ పెట్టారు. దీంతో పెద్దల సూచనతో యువకుడి బంధువులు సూర్యనారాయణను అతడి సొంతూరు బాలారం పంపించేశారు. దీంతో పగపెంచుకున్న యువకుడు శనివారం ప్లాన్ ప్రకారం బైక్ పై కూరాడ వెళ్తోన్న దేవికను...కూరాడ-కాండ్రేగుల గ్రామాల మధ్య రోడ్డుపై అడ్డగించాడు.
యాసిడ్ సీసా కూడా
తనను ప్రేమించాలని దేవికను సూర్యనారాయణ ఒత్తిడి చేశాడు. అందుకు ఆమె నిరాకరించడంతో తన వెంట తెచ్చుకున్న కత్తితో యువతిపై దాడి చేశాడు. రోడ్డుపై రక్తపు మడుగులో పడిఉన్న యువతిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. దాడికి పాల్పడిన యువకుడిని పట్టుకున్న స్థానికులు చెట్టుకు కట్టేసి చితకబాదారు. యువతిని కాకినాడ జీజీహెచ్‌కు తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటన సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. యువకుడిని పెదపూడి పోలీసు స్టేషన్‌కు తరలించారు. యువకుడు తన వెంట యాసిడ్ సీసా కూడా తెచ్చుకున్నాడని పోలీసులు తెలిపారు.