Eluru News: వైసీపీ వర్గీయుల దాడిలో మాజీ ఎమ్మెల్యే చింతమనేని పీఎ సహా మరో ఇద్దరికి గాయాలు!
Eluru News: వైసీపీ వర్గీయుల దాడిలో మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పీఏ శివబాబు సహా మరో ముగ్గురు టీడీపీ కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు.
Eluru News: ఏలూరు జిల్లాలో వైసీపీ వర్గీయులు టీడీపీ కార్యకర్తలపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పీఏ సహా మరో ముగ్గురు టీడీపీ నేతలు గాయపడ్డారు. జిల్లాలోని పెదవేగి మండలం కొప్పాక సమీపంలో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది.
అసలేం జరిగిందంటే..?
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ వ్యక్తిని కలిసేందుకు శివబాబు మరికొంత మందితో కలిసి జీపులో పెదకడిమి గ్రామంలోని రాజా తోటకు వెళ్తుండగా అలుగులగూడెం వెంతెన వద్ద వైసీపీ వర్గీయులు వీరి వాహనాన్ని ఆపారు. ఎక్కడికి వెళ్తున్నారని ప్రశ్నిస్తూనే, కర్రలు, రాడ్డులతో దాడికి దిగారు. ఈ ఘటనలో శివబాబు, మరో ముగ్గురికి గాయాలు అయ్యాయి. విషయం గుర్తించిన స్థానికులు వీరిని చికిత్స నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శివబాబు తలకు తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన చికిత్స కోసం నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. అయితే కొప్పాక సమీపంలోని పోలవరం కుడి కాలువ వద్ద వైసీపీకి చెందిన కొందరు జేసీబీలతో మట్టి తవ్విస్తున్నారని, అదే సమయంలో తాము అటుగా వెళ్లడంతో వారిని అడ్డుకునేందుకు వెళ్తున్నామనుకొని తమపై దాడి చేశారని శివబాబు తెలిపారు. తమపై దాడి చేసిన వారిలో వైసీపీకి చెందిన కొప్పాక రంగారావు, పచ్చిపులుసు శివ, మరికొంత మంది ఉన్నారని ఆరోపించారు.
దాడి జరిగిందని తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ భార్య రాధ బాధితులను పరామర్శించారు. అయితే ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో బాధితులు చికిత్స పొందుతున్న సమయంలోనే.. వీరిపై దాడి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రంగారావు, శివ మరికొందరు వైద్యం కోసం ఇక్కడే చేరారు. ఈ క్రమంలో రెండు వర్గాల వారు ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడడంతో ఆస్పత్రి ఎదుట ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు.
నిన్న రాత్రి చిత్తూరులో జనసేన నేత ఇంటిపై దాడి..
చిత్తూరు జిల్లా పుంగనూరులో పారిశ్రామికవేత్త రామచంద్ర యాదవ్ ఇంటిపై దాడి జరిగింది. గత ఎన్నికల్లో ఆయన జనసేన తరఫున పోటీ చేశారు. నియోజకవర్గంలో రైతు సమస్యలపై రైతు భేరీ కార్యక్రమాన్ని తలపెట్టారు. దీనికి అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. సభకు వెళ్లకుండా రాచంద్రయాదవ్‌ను అడ్డుకున్న పోలీసులు సాయంత్రం ఐదున్నర గంటలకు వదిలేశారు. తర్వాత తన అనుచరరులతో కలిసి స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్దకు వెళ్లి క్షీరాభిషేకం చేశారు. తర్వాత అనుచరులంతా ఎవరి ఇంటికి వాళ్లు వెళ్లిపోయారు. అనంతరం రామచంద్రయాదవ్ ఇంటిపై దాడి జరిగింది. ఇది చేసింది వైసీపీ కార్యకర్తలేనంటూ ఆయన వర్గీయులు ఆరోపిస్తున్నారు. రైతుల సమస్యలపై సభ తలపెట్టామని.. దీన్ని జీర్ణించుకోలేకే తమ ఇంటిపై దాడి చేశారని ఆయన అనుచరులు విమర్శించారు.
200 మంది దాడి చేశారని సమాచారం..
ఆదివారం రాత్రి పుంగనూరు పట్టణం కొత్తిండ్లు ఎల్‌ఐసీ కాలనీలో ఉన్న ఇంటికి వెళ్లి కొందరు యువకులు వీరంగం సృష్టించారు. కర్రలు, రాళ్లతో తలుపులు, అద్దాలు పగలకొట్టి లోపలకు వెళ్లి, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. పార్క్ చేసి ఉన్న కార్లు, బైక్‌లపై విరుచుకపడ్డారు. ఈ దుర్ఘటనలో ఆరు కార్లు, మరిన్ని వాహనాలు ధ్వంసం అయ్యాయి. అదే ఇంట్లో ఉన్న తను తన ఫ్యామిలీ ఓ గదిలో దాక్కొని ప్రాణాలతో బయట పడ్డామంటున్నారు రామచంద్రయాదవ్. తమ నాయకుడు సదుం వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు ఇంత దాడి జరిగినా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు ఆయన సన్నిహితులు. సుమారు 200 మంది వచ్చి దాడి చేశారని చెబుతున్నారు.