(Source: ECI/ABP News/ABP Majha)
Eluru Crime: పండుగపూటే విషాదం - ఆటోపై విరిగిపడిన తాటిచెట్టు, రెండేళ్ల పాప దుర్మరణం
Eluru Crie News: పండుగపూటే ఏలూరు జిల్లాలో విషాధం చోటు చేసుకుంది. తల్లితో కలిసి ఆటోలో వెళ్తుండగా.. అనుకోకుండా ఓ తాటి చెట్టు ఆటోపై పడింది. ఈ క్రమంలోనే రెండేళ్ల బాలిక అక్కడికక్కడే చనిపోయింది.
Eluru Crie News: ఏలూరు జిల్లాలో పండుగ పూటే విషాదం చోటు చేసుకుంది. మహాలక్ష్మిలా బుడిబుడి అడుగులు వేస్తూ అల్లరి చేయాల్సిన పాప అనంత వాయువుల్లో కలిసిపోయింది. తల్లితో కలిసి ఆటోలో వెళ్తుండగా.. ఒక్కసారిగా బలమైన ఈదురు గాలులు వచ్చాయి. ఈ క్రమంలోనే ఓ తాటిచెట్టు విరిగిపోయి ఆటో మీద పడిపోయింది. ఈ ప్రమాదంలో బాలిక అక్కడికక్కడే చనిపోగా.. మరో మహిళ పరిస్థితి విషమంగా ఉంది. మరో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. అయితే ప్రమాద సమయంలో ఆటోలో మొత్తం ఐదుగురు మహిళలు ఉన్నారు.
అసలేం జరిగిందంటే..?
నూజివీడు మండలం మర్రిబంధం గ్రామం నుంచో ఓ ఆటో వెళ్తుంది. అయితే ఆ ఆటోలో ఐదుగురు మహిళలతో పాటు ఓ రెండేళ్ల చిన్నారి ఉన్నారు. ఒక్కసారిగా ఈదురు గాలులు, భారీ వర్షం కురవడంతో.. తాటి చెట్టు విరిగి రోడ్డుపై వెళ్తున్న ఆటోపై పడింది. దీంతో ఆటోలో ఉన్న మహిళలకు తీవ్ర గాయాలు అయ్యాయి. విషయం గుర్తించిన స్థానికులు వచ్చి చెట్టును పక్కకి జరిపి.. ఆటోలో ఉన్న వాళ్లను బయటకు తీశారు. ఈ క్రమంలోనే రెండేళ్ల వయసు ఉన్న చిన్నారి మృతి చెందినట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అలాగే అంబులెన్స్ ద్వారా క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
నాలుగు రోజుల క్రితం భార్య పనిచేసే బస్సు కింద పడి భర్త మృతి
ఆమె ఏపీఎస్ఆర్టీసీ కండక్టర్. ఆమె భర్త ప్రైవేట్ ఉద్యోగి. రోజూ ఆమెను బైక్ పై బస్ డిపో వద్ద వదిలిపెట్టి వెళ్తాడు, డ్యూటీ అయిపోయిన తర్వాత తిరిగి తీసుకెళ్తాడు. రోజూలాగే ఈరోజు కూడా భార్యని బైక్ పై గ్యారేజ్ కి తీసుకొచ్చాడు. ఆమెను లోపలికి పంపించి బైక్ పై బయటకు వచ్చాడు. ఇంతలో ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు అతడిని ఢీకొట్టింది. చక్రాలకింద నలిగిపోయి భర్త ప్రాణాలు వదిలాడు. భర్త శవంపై పడి భార్య రోదిస్తున్న ఘటన అందరినీ కంటతడి పెట్టించింది.
నెల్లూరు జిల్లా కావలికి చెందిన సుభాషిణి, సుబ్బారాయుడు దంపతులు. సుభాషిణి కావలి డిపోలో ఆర్టీసీ కండక్టర్ గా పనిచేస్తున్నారు. ప్రతి రోజూ సుభాషిణిని తీసుకొచ్చి డిపో వద్ద వదిలిపెట్టి వెళ్తుంటాడు సుబ్బారాయుడు. ఈరోజు ఉదయం డ్యూటీ కావడంతో గ్యారేజ్ కి తీసుకొచ్చాడు. గ్యారేజ్ నుంచి అన్ని బస్సులు బయలుదేరే సమయం అది. సుభాషిణి కూడా డ్యూటీకోసం గ్యారేజీలోకి వెళ్లింది. ఆమెను వదిలిపెట్టిన అనంతరం సుబ్బారాయుడు తిరిగి బైక్ పై ఇంటికి బయలుదేరాడు. ఎంతో సమయం పట్టలేదు. కేవలం సెకన్ల వ్యవధిలోనే అతను బస్సుకింద పడి చనిపోయాడు. డ్యూటీకి వెళ్లేందుకు లోపలికి వెళ్తున్న సుభాషిణి.. బయట జరిగిన హడావిడి చూసి పరుగు పరుగున వచ్చింది. బయట రక్తపు మడుగులో పడిన భర్తని చూసి షాక్ అయింది. అయితే అప్పటికే సుబ్బారాయుడు ప్రాణాలు వదిలాడు. ఆస్పత్రికి తీసుకెళ్లే అవకాశం కూడా లేకుండా పోయింది. బస్సు చక్రాలకింద బైక్ తో సహా నలిగిపోయి ప్రాణాలు వదిలాడు సుబ్బారాయుడు.
డ్రైవర్ పరారీ..
సుబ్బారాయుడి బైక్ ని ఢీకొన్నది హైర్ బస్సుగా తెలుస్తోంది. కావలి-ఒంగోలు మధ్య షటిల్ సర్వీస్ చేసే హైర్ బస్సు అది. డ్రైవర్ కూడా ప్రైవేటు వ్యక్తి. సుబ్బారాయుడు చనిపోయిన వెంటనే డ్రైవర్ అక్కడినుంచి పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.