Mosh Pub: హైదరాబాద్ మోష్ పబ్ కేసులో ఎనిమిది మంది అరెస్ట్- కొత్త తరహా మోసం
Hyderabad Mosh Pub Case : అందాలను ఎరవేసి లక్షలు లక్షలు దోచుకుంటున్న మోష్ పబ్ నిర్వాహకుల మోసం బట్టబయలైంది.. ఇందుకు సంబంధించిన ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Mosh Pub: హైదరాబాద్ మహానగరంలో కొత్త తరహా మోసం వెలుగులోకి వచ్చింది. ఈ మధ్యకాలంలో చాలా మంది అబ్బాయిలు అమ్మాయిల వలలో పడి తమ మొబైల్ లలో డేటింగ్ యాప్ లను ఇన్ స్టాల్ చేసుకుంటున్నారు. దీనిని ఆసరాగా చేసుకుని కొందరు పబ్ యజమానులు అమ్మాయిలతో కొత్త తరహా మోసానికి పాల్పడుతున్నారు. వీటి బారిన పడి కొంత మంది భారీగా డబ్బులు పోగొట్టుకుంటున్నారు. కస్టమర్లను మోసం చేస్తున్న పబ్ లపై పోలీసులు దృష్టి సారించారు. ఇటీవల వెలుగులోకి వచ్చిన మోష్ పబ్ కేసును వారు సీరియస్ గా తీసుకున్నారు. ఢిల్లీ నుంచి అమ్మాయిలను తీసుకుని వచ్చి టిండర్, ఇతర డేటింగ్ యాప్ లతో వ్యాపారులకు, విద్యార్థులకు వలపు వల వేస్తూ తప్పించుకు తిరుగుతున్న పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. డబ్బున్న వాళ్లను పబ్‌కి వచ్చేలా చేసి ఖరీదైన మందు తాపించి లక్షల రూపాయలు కొల్లగొడుతున్నారు.
గుట్టు చప్పుడు కాకుండా అక్రమ దందా
రాజధానిలో ఈ అక్రమ దందా గత కొంతకాలంగా గుట్టుచప్పుడు కాకుండా జరుగుతుంది. ఇటీవల ఓ వ్యక్తి టిండర్ యాప్ లో రితిక అనే మహిళను డేటింగ్ యాప్‌లో కలిసి మోసపోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో హైదరాబాద్ పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో మోష్ పబ్ ప్రతినిధులతో పాటు మరో ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు.
అసలేమైందంటే
హైదరాబాద్ లోని మోష్ పబ్ నిర్వాహకులు అందమైన అమ్మాయిలను ఎరగా వేసి యువకులను ట్రాప్ చేస్తున్నారు. అనంతరం వారిని పబ్ లోకి తీసుకొచ్చి కొద్ది మొత్తం డ్రింక్‌కే వేల రూపాయల బిల్లు వేసి దోచుకుంటున్నారు. తీరా విషయం తెలిసే సరికి అమ్మాయిలు కనిపించకుండా పోతున్నారు. ఈ అంశంపై ఫిర్యాదులు రావడంతో మాదాపూర్ డీసీపీ వినీత్ విచారణ జరిపి గ్యాంగ్‌ను పట్టుకున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన ఆరుగురు వ్యక్తుల ముఠా గ్రూపుగా ఏర్పడి ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నారని గుర్తించారు.
బిల్ చూసి కంగుతిన్న వ్యాపారవేత్త
ఇటీవల వ్యాపారవేత్తకు టిండర్ యాప్‌లో రితిక అనే అమ్మాయి పరిచయం అయింది. తర్వాత రోజు కలుద్దామని హై టెక్ సిటీ మెట్రో స్టేషన్ వద్దకి రావాలని చెప్పింది. దీంతో అతడు రితిక పిలిచిన చోటుకు వెళ్లాడు. ఇద్దరు మెట్రో స్టేషన్ వద్ద కలుసుకున్నారు. కాసేపు అతడితో మాటలు కలిపిన రితిక స్టేషన్ పక్కనే ఉన్న మోష్ క్లబ్ కి వెళ్దామని కోరింది. ఆమె ప్లాన్ పసిగట్టలేకపోయిన వ్యాపారవేత్త తనతో కలిసి వెళ్లాడు. పబ్ లోకి వెళ్లి.. తన తియ్యని మాటలతో అతడిని డ్యాన్స్ లో దింపింది. ఆ తరువాత గంట లోపల ఖరీదైన మద్యం ఆర్డర్ చేసి రితిక తాగింది. తర్వాత వెంటనే అక్కడి నుంచి జారుకుంది. రితిక ఎంతకు కనిపించకుండా పోవడంతో కంగుతిన్నాడు. ఆమెను వెతుకుతున్న క్రమంలో వ్యాపారవేత్త దగ్గరకు సర్వర్ వచ్చి రూ. 40505 బిల్ ను చేతిలో పెట్టాడు. ఆ బిల్లును చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఇంత బిల్లు నేను కట్టలేనని వాదించినా తనను బెదిరించి వ్యాపారవేత్తతో డబ్బులు కట్టించుకుని పబ్ యాజమాన్యం బయటకు పంపించారు. అలా బయటకు వచ్చి అనుమానంతో పబ్ గూగుల్ రివ్యూస్ చూడగా మోసం బట్టబయలైంది. పబ్ వాళ్లే అమ్మాయిలతో కలిసి ఇలాంటి మోసం చేస్తున్నారని గుర్తించారు. తనకు జరిగిన మోసం గురించి సోషల్ మీడియాలో ఆధారాలతో సహా బయటపెట్టాడు. ఈ విధంగా ఆ పబ్ చేస్తున్న మోసం బయటకు వచ్చింది.