Drugs Supplier Edwin Arrest: డ్రగ్స్ సరఫరా కేసు, కీలక సూత్రధారి ఎడ్విన్ గోవాలో అరెస్ట్
Drugs Supplier Edwin Arrest: గత మూడు నెలల నుంచి తప్పించుకు తిరుగుతున్న డ్రగ్ సప్లయర్ ఎడ్విన్‌ను నార్కోటిక్ విభాగం పోలీసులు గోవాలో పట్టుకున్నారు.
Drugs Supplier Edwin Arrested in Goa: మాదకద్రవ్యాల సరఫరా కేసులో కీలక సూత్రధారి ఎడ్విన్ అరెస్టయ్యాడు. గత మూడు నెలల నుంచి తప్పించుకు తిరుగుతున్న డ్రగ్ సప్లయర్ ఎడ్విన్‌ను నార్కోటిక్ విభాగం పోలీసులు గోవాలో పట్టుకున్నారు. గోవా నుంచి తెలంగాణలో హైదరాబాద్ సహా పలు ప్రాంతాలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని ఎడ్విన్‌పై ఆరోపణలున్నాయి. మాదకద్రవ్యాల కేసు దర్యాప్తులో భాగంగా నార్కోటిక్స్ పోలీసులు ఎడ్విన్ ను గోవాలో అరెస్ట్ చేశారు.
తెలుగు రాష్ట్రాలకు డ్రగ్స్ సరఫరా.. !
గోవా నుంచి తెలంగాణకు డ్రగ్స్ సరఫరా అవుతున్నట్లు నార్కోటిక్ విభాగం పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో విచారణ చేపట్టిన పోలీసులు మూడు నెలల కిందట నారాయణ బోర్కర్ ను అరెస్ట్ చేశారు. అతడు ఇచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు కొన్ని రోజులపాటు నిఘా ఉంచి మాదకద్రవ్యాల సరఫరా కేసులో కీలక సూత్రధారి అయిన ఎడ్విన్ ను గోవాలో అరెస్ట్ చేశారు. దాదాపు రెండు నుంచి నాలుగు వారాలుగా నార్కోటిక్ విభాగం పోలీసులు గోవాలో ఎడ్విన్ కోసం వెతుకుతున్నారు. శనివారం నాడు నార్కోటిక్ విభాగం పోలీసులు ఎడ్విన్ ను అరెస్ట్ చేసి హైదరాబాద్‌కు తీసుకొస్తున్నారు. నేటి రాత్రి ఎడ్విన్ ను హైదరాబాద్‌కు తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
గోవా కేంద్రంగా డ్రగ్స్ సరఫరా..
ఎడ్విన్ గోవా కేంద్రంగా మాదక ద్రవ్యాల సరఫరా చేస్తున్నాడు. దేశ వ్యాప్తంగా గోవా నుంచే డ్రగ్స్ నార్కోటిక్స్, పోలీసుల కళ్లుగప్పి అక్రమంగా రవాణా చేసేవాడు. గోవాలోని అంజునా బీచ్ కేంద్రంగా ఏపీ, తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లో డ్రగ్స్ దందా చేస్తున్నాడు ఎడ్విన్. డ్రగ్స్ సరఫరా చేసే నారాయణ బోర్కర్ ను హైదరాబాద్ నార్కోటిక్స్ పోలీసులు ఆగస్టు 17న అరెస్ట్ చేశారు. విచారణలో భాగంగా బోర్కర్ ఇచ్చిన సమాచారం ఆదారంగా పోలీసులు గోవాలో పాగా వేసి డ్రగ్స్ కేసులో కీలక సూత్రధారి ఎడ్విన్‌ను అరెస్ట్ చేసి హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. బీజేపీ మహిళా నాయకురాలు సోనాలీ ఫోగాట్ హత్య కేసుతోనూ ఎడ్విన్ కు సంబంధాలు ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇందుకు సంబంధించి కొన్ని ఆధారాలను పోలీసులు సంపాదించారు.
మరికొందరు అరెస్ట్..
సోనాలి ఫోగాట్ చనిపోయిన కేసుతో సంబంధం ఉన్న మరికొందర్ని పోలీసులు గోవాలోని ఓ బీచ్ లో అదుపులోకి తీసుకున్నారు. బెయిల్ మీద తిరుగుతున్న కర్లీస్ రెస్టారెంట్ సహ యజమాని ఎడ్విన్ తో పాటు మరో ఇద్దరు డ్రగ్ సరఫరా చేసే వ్యక్తులు అరెస్ట్ అయినట్లు సమాచారం. వీరిపై ఇదివరకే సెక్షన్ 22(బీ), 29, సెక్షన్ 25 నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రొఫిక్ సబ్‌స్టాన్సెస్ యాక్ట్ కింద కేసులు నమోదయ్యాయి. పోలీసులు త్వరలోనే అరెస్టులకు సంబంధించిన వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.
అసలేం జరిగిందంటే..
ఈ ఏడాది ఆగస్టు చివరి వారంలో గోవా పర్యటనకు వెళ్లిన సోనాలీ ఫోగాట్ అనుమానాస్పద రీతిలో మరణించారు. ఆమె మొదట గుండెపోటుతో మరణించినట్లు వార్తలు వచ్చాయి. అయితే పోస్టుమార్టం నివేదికలో మాత్రం ఆమె శరీరంపై పలు చోట్ల గాయాలు ఉన్నట్టు తేలింది. దీంతో పోలీసులు విచారణ చేపట్టారు. సంచలనం సృష్టించిన ఈ కేసును తీవ్ర ఒత్తిళ్ల నడుమ సీబీఐ దర్యాప్తునకు అప్పగించాలని నిర్ణయించినట్లు గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ సెప్టెంబర్ నెలలోనే ప్రకటించారు.