Konaseema Knife Attack : కోనసీమలో దారుణం- అత్తపై కత్తితో దాడి చేసిన అల్లుడు, అడ్డుపడిన భార్యకు తీవ్రగాయాలు
Konaseema Knife Attack : కోనసీమ జిల్లాలో దారుణం జరిగింది. కుటుంబ కలహాలతో భార్య, అత్తపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు.
Konaseema Knife Attack : డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి భార్య, అత్తపై కత్తితో దాడి చేశాడు. ఐ.పోలవరం మండలం గుత్తెనదీవి గ్రామంలో కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య, అత్తను కొబ్బరి కాయల కత్తితో నరికిన ఘటన కలకలం రేపింది. కొబ్బరి కాయల దింపు తీసే నిచ్చెనకోళ్ల రామకృష్ణకు మండపేటకు చెందిన మౌనికతో వివాహం జరిగింది. పెళ్లైన తరువాత అత్తవారింట కాపురం పెట్టిన రామకృష్ణకు అత్త మేరీరత్నానికి మధ్య మనస్పర్ధలు రావడంతో తరచుగా గొడవ పడుతుండేవారు. ఈ నేపథ్యంలో ఆరునెలల క్రితం అతని దగ్గర బంధువు కోరిక మేరకు గుత్తెనదీవి తన భార్యను తీసుకుని కాపురం వచ్చాడు. నిన్న తన ఇంటిలో శుభకార్యం కోసం అత్త మేరీరత్నం రావడంతో మళ్లీ వారి మధ్య గొడవ జరిగింది. తమ కాపురంలో అత్త వలనే గొడవలు జరుతున్నాయని కోపంతో అత్తను కత్తితో నరికేందుకు రామకృష్ణ ప్రయత్నించగా భార్య అడ్డురావడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. తీవ్ర గాయాలైన భార్య మౌనిక పరిస్థితి విషమంగా ఉండగా, గాయాలపాలైన అత్తను కాకినాడ ఆసుపత్రి తరలించారు. క్షణికావేశంలో భార్య, అత్తలపై దాడి చేసిన అనంతరం రామకృష్ణ చీమలమందు తాగడంతో అతనిని యానం ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
తాడేపల్లిగూడెంలో మరో ఘటన దారుణం
పశ్చిమగోదావరి జిల్లాలో మరో దారుణ ఘటన జరిగింది. ఓ వ్యక్తి భార్య పిల్లల పట్ల సైకోలా మారాడు. ఇటీవల వరకు కన్నబిడ్డలకు నరకం చూపించిన ఈ క్రూరుడు, ఇప్పుడు ఏకంగా కట్టుకున్న భార్యను నరికి చంపిన ఘటన తాడేపల్లిగూడెంలో కలకలం రేపుతోంది. భార్య గంజి నిర్మలతో గురువారం అర్ధరాత్రి గొడవకు దిగిన ఆమె భర్త గంజి దావీదు, కత్తితో భార్య గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు. నిర్మలపై కత్తితో దాడిచేసి అనంతరం విచక్షణారహితంగా పొడిచాడు. నిర్మల మెడ, చేతులపై కత్తితో నరకడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఇల్లు గడవడం కష్టమైందని భావించిన నిర్మల పిల్లలను భర్త దగ్గర వదిలి దుబాయి వెళ్లింది. దుబాయిలో ఉన్న భార్యను వేధించేందుకు దావీదు దుర్మార్గంగా ప్రవర్తించాడు. అమాయకమైన పిల్లలపై ప్రతాపం చూపిస్తూ... వీడియో తీసి భార్యకి పంపించేవాడు. ఇటీవల దేశానికి తిరిగి వచ్చిన ఆమె... కూతుళ్లతో ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. తాను మారిపోయానంటూ ఇంటికి వచ్చిన దావీదు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.
విశాఖ ఆర్కే బీచ్ లో మహిళ మృతదేహం
విశాఖ ఆర్కే బీచ్ లో కలకలం రేగింది. అర్థనగ్నంగా బయటపడిన మృతదేహాన్ని చూసిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా కూడా చర్చనీయాంశమైంది. ఆ మృతదేహంపై బట్టలు లేకపోవడంతో తీవ్ర అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. స్థానికుల ద్వారా మృతదేహం విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలు పెద గంట్యాడకు చెందిన శ్వేతగా పోలీసులు గుర్తించారు. శ్వేత మంగళవారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వచ్చిందని.. రాత్రి అయినా తిరిగి ఇంటికి రాకపోవడంతో కంగారుపడ్డ కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తుండగానే అర్థరాత్రి ఓ యువతి మృతదేహం కనిపించినట్లు స్థానికులు ఫోన్ చేశారు. ఈ క్రమంలోనే అక్కడకు వెళ్లిన పోలీసులు అది శ్వేత మృతదేహంగా గుర్తించారు. అయితే ఆమె పడి ఉన్న తీరు చూస్తే.. అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నట్లు తెలుస్తోంది. ఒంటిపై దుస్తులు లేకపోవడం, ఇసుకలో సగం మృతదేహం కప్పేసినట్లుగా ఉంది. అయితే ఇది ఎవరో కావాలని చంపేసి, తమ ఆనవాళ్లు దొరక్కుండా ఇసుకలో పాతి పెట్టినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే మృతురాలికి పెళ్లి జరిగి రెండేళ్లు అవుతోంది. ప్రస్తుతం ఆమె ఐదు నెలల గర్భవతి అని తెలుస్తోంది. శ్వేత అదృశ్యం కాకముందు భర్తతో ఫోన్ లో మాట్లాడినట్లు సమాచారం. ఈ కేసును చాలా సీరియస్ గా తీసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో ఆరా తీస్తున్నారు.