రూ.350 కోసం హత్య, కత్తితో మెడపై 60 సార్లు పొడిచి చంపిన నిందితుడు - డెడ్‌బాడీ పక్కనే డ్యాన్స్
Delhi Crime: ఢిల్లీలో ఓ మైనర్ ఓ యువకుడిని 60 సార్లు కత్తితో పొడిచి హత్య చేశాడు.
Delhi Murder:
దారుణ హత్య...
ఢిల్లీలో దారుణమైన ఘటన (Delhi Crime) జరిగింది. 18 ఏళ్ల యువకుడిని ఓ మైనర్ కత్తితో పొడిచి చంపాడు. అక్కడి సీసీ కెమెరాలో ఈ విజువల్స్ రికార్డ్ అయ్యాయి. కత్తితో పదేపదే పొడిచి హత్య చేశాడు. చంపిన తరవాత డ్యాన్స్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనమవుతోంది. రూ.350 కోసం జరిగిన గొడవ ఇలా హత్యకు దారి తీసింది. నిందితుడు ఆ యువకుడిని 60 సార్లు పొడిచినట్టు పోలీసులు వెల్లడించారు. దొంగతనం చేసే క్రమంలోనే ఈ హత్య చేసినట్టు ప్రాథమిక నిర్ధరణకు వచ్చారు. నిందితుడు ముందుగా ఆ యువకుడి గొంతు నులిమాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన తరవాత కత్తితో పదేపదే పొడిచాడు. వీళ్లిద్దరికీ ఎలాంటి పరిచయమూ లేదని, దొంగతనం చేస్తుంటే అడ్డుకున్నాడన్న కోపంతోనే హత్య చేసినట్టు పోలీసులు తెలిపారు. CC కెమెరాలో రికార్డ్ అయిన ఈ వీడియో చూసి పోలీసులే షాక్ అయ్యారు. బాధితుడి మెడపై 60 సార్లు పొడిచాడని, చనిపోయాడని కన్‌ఫమ్ చేసుకునేంత వరకూ అలా పొడుస్తూనే ఉన్నాడని వివరించారు. అక్కడితో ఆగకుండా తలపై కాలితో తన్నాడు. చనిపోయాడని తెలుసుకున్నాక డ్యాన్స్ చేశాడు. అర్ధరాత్రి పోలీసులకు ఈ సమాచారం అందింది. ఘటనా స్థలానికి చేరుకుని బాధితుడిని హాస్పిటల్‌కి తరలించారు. అప్పటికే చనిపోయినట్టు వైద్యులు నిర్ధరించారు. వెంటనే గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. మృతుడి నుంచి రూ.350 దొంగిలించాడు.