Rythu Runa Mafi: తెలంగాణ రైతులకు బిగ్ అలర్ట్ - ఆ లింక్స్ ఓపెన్ చేశారో ఇక అంతే!
Telangana News: తెలంగాణలో రైతు రుణమాఫీ డబ్బులు జమ అవుతున్న వేళ సైబర్ నేరగాళ్లు వాట్సాప్ ఏపీకే లింక్స్ ద్వారా మోసాలకు తెరలేపారు. దీనిపై రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో అప్రమత్తం చేసింది.

Rythu Runa Mafi in TG: తెలంగాణలో రైతుల ఖాతాలకు రుణమాఫీ సొమ్ము జమ చేస్తోన్న వేళ సైబర్ నేరగాళ్లు మరో కొత్త ఎత్తుగడతో మోసాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో వాట్సాప్ ద్వారా అన్నదాతలకు ఏపీకే లింక్స్ పంపిస్తూ నగదు దోచేస్తున్నారు. గత కొద్ది రోజులుగా ఏపీకే లింక్స్ పంపిస్తోన్న మోసగాళ్లు.. ఫోన్లు హ్యాక్ చేస్తూ బ్యాంకు ఖాతాల్లో నగదు కొట్టేస్తున్నారు. తాజాగా, నిజామాబాద్ జిల్లా డొంకేశ్వర్ మండలం గంగ సముద్రంలో ఓ రైతు ఇలానే మోసపోయారు. గ్రామానికి చెందిన ముత్యం రెడ్డి అనే రైతు ఫోన్‌కు లింక్ పంపిన నేరగాళ్లు అతని ఖాతా నుంచి రూ.4.16 లక్షలు కాజేశారు. దీనిపై బాధిత రైతు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అన్నదాతలకు అలర్ట్
ఈ క్రమంలో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో రైతుల్ని అప్రమత్తం చేసింది. ఫోన్లకు వాట్సాప్ ద్వారా వచ్చే ఫేక్ లింక్స్, ఏపీకే ఫైల్స్, అనుమానాస్పద లింక్స్ క్లిక్ చెయ్యొద్దని తెలిపింది. రైతులే లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు ఏపీకే లింక్స్‌తో మోసాలకు పాల్పడుతున్నట్లు వెల్లడించింది. ఒకవేళ, పొరపాటున అలాంటి లింక్స్ క్లిక్ చేసి ఎవరైనా డబ్బులు పోగొట్టుకుంటే 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించింది.
కాగా, తెలంగాణలో రైతు రుణమాఫీకి ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్రంలో దాదాపు 11.42 లక్షల మంది లబ్ధిదారులకు రైతు రుణమాఫీ కింద సుమారు రూ.7 వేల కోట్లు వారి వారి ఖాతాల్లో జమ చేయనుంది. తొలి విడతలో లక్షలోపు రెండో విడతలో లక్ష యాభై వేలు వరకు, మూడో విడతలో 2 లక్షల వరకు రుణాలు మాఫీ చేయనుంది. మొత్తంగా రుణమాఫీ పరిధిలోకి వచ్చే రైతు కుటుంబాలు 40 లక్షలు ఉన్నట్లు లెక్క తేలింది.
Also Read: Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్ల పథకంపై మరో న్యూస్ లీక్- అలాంటి వారు ఈ స్కీమ్‌కు అనర్హులట!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

