Love Tragedy: ప్రేమ జంట పరారీ - అబ్బాయి అన్న వదినల కిడ్నాప్, ఎక్కడంటే?
Tirupati News: ఓ ప్రేమ జంట పరారీ కావడంతో అబ్బాయి అన్న వదినలను.. అమ్మాయి తరఫు బంధువులు బలవంతంగా ఎత్తుకెళ్లిన ఘటన తిరుపతి జిల్లాలో జరిగింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Couple Kidnapped By Lovers Relatives: ఓ ప్రేమ జంట ఆచూకీ కోసం అమ్మాయి తరఫు వారు దారుణంగా ప్రవర్తించారు. అబ్బాయి అన్న వదినలను బలవంతంగా ఎత్తుకెళ్లారు. ఈ ఘటన తిరుపతి జిల్లాలో (Tirupati District) చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వెంకటగిరిలోని బాలాయపల్లి మండలం కడగుంట గ్రామానికి చెందిన పెంచలయ్య, త్రివేణిల మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోంది. ఈ క్రమంలో గత 3 నెలల క్రితం వీరు ఇంట్లో నుంచి పారిపోయారు. అమ్మాయి సోదరుడు మహేష్ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఇరువురూ మేజర్లు కావడంతో వారికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపారు. కొద్ది రోజుల తర్వాత ఈ ప్రేమ జంట మళ్లీ పారిపోయారు. దీంతో వీరి ఆచూకీ కోసం అమ్మాయి తరఫు వారు అబ్బాయి అన్న, వదినలను కిడ్నాప్ చేశారు.
అమ్మాయి ఆచూకీ కోసం ఆమె సోదరుడు, మేనమామలే అబ్బాయి అన్న, వదినలను బలవంతంగా ఎత్తుకెళ్లారనే ఆరోపణలు వస్తున్నాయి. వీరు నాయుడుపేట ప్రాంతంలో ఉన్నట్లు అక్కడి పోలీసులకు సమాచారం అందించారు. దీనిపై వెంకటగిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కిడ్నాప్‌నకు పాల్పడిన నిందితులను త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు.