Chittoor News : మేయర్ దంపతుల హత్య కేసులో మరో ట్విస్ట్, విచారణ నుంచి తప్పుకున్న ఏపీపీ
Chittoor News : చిత్తూరు జిల్లాలో మేయర్ దంపతుల హత్య కేసు జులై 14వ తేదీకి వాయిదా పడింది. ఈ కేసు షెడ్యూల్ ప్రకారం ఇవాళ విచారణ జరగాల్సి ఉంది. అయితే ఏపీపీ కేసు నుంచి తప్పుకోవడంతో న్యాయమూర్తి కేనును వాయిదా వేశారు.
Chittoor News : చిత్తూరు జిల్లా కోర్టులో నెలకొన్న తీవ్ర ఉత్కంఠకు తెరపడింది. దివంగత మేయర్ హత్య కేసు తుది విచారణ ఇవాళ ప్రారంభమవుతుందన్న ప్రకటనతో చిత్తూరులో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సాక్షుల బెదిరింపు వ్యవహారంతో దివంగత మేయర్ హత్య కేసు చాలా ప్రాధాన్యత సంచరించుకుంది. సాక్షులను కొందరు ప్రభావితం చేసే అవకాశం ఉన్నట్టుగా జోరుగా ప్రచారం సాగడం, మాజీ మేయర్ హేమలత వ్యాఖ్యలతో అందరి దృష్టి హత్య కేసుపైకి మళ్లింది. ఇవాళ చిత్తూరులో ఏదో జరుగబోతుందన్నా ఉత్కంఠతో కేసుకు సంబంధం లేని వ్యక్తులు సైతం కోర్టులో దర్శనమిచ్చారు. మరో పక్క కేసులో ప్రధాన సాక్షి అయిన సతీష్‌ను పోలీసులు ఓ కేసులో అరెస్టు చేస్తారన్న ప్రచారంతో కోర్టులో హైటెన్షన్ వాతావరణం నెలకొంది.
ఏపీపీని మార్చాలని కోరడంతో
ఇక కేసులో ప్రధాన నిందితుడు చింటూ అలియాస్ చంద్రశేఖర్‌తో పాటు, ఇతర నిందితులు కోర్టుకు హజరయ్యారు. అలాగే హత్య కేసులో రివాల్వర్ అందజేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కొందరు కోర్టుకు హజరయ్యారు. ఇక కేసు ఇవాళ ట్రయల్స్ ప్రారంభమవుతుందనుకుని భావిస్తున్న తరుణంలో ప్రభుత్వ ఏపీపీ ఈ కేసు నుండి వైదొలుగుతున్నట్లు ఇందుకు అనుమతి ఇవ్వాలని చిత్తూరు ఆరో అదనపు న్యాయమూర్తిని కోరారు. అయితే ముందు న్యాయమూర్తి నిరాకరించారు. ప్రభుత్వ పీపీని కొందరు ప్రభావితం చేశారని మాజీ మేయర్ కుటుంబ సభ్యులు ఆరోపణలు చేశారు. అలాగే హత్య కేసులో సాక్షి అయిన ఓ వ్యక్తి ఏపీపీని మార్చాలని పిటిషన్ దాఖలు చేసినట్టు విశ్వసనీయ సమాచారం.
జులై 14కు వాయిదా
ఇలా నాటకీయ పరిణామాల నడుమ ప్రారంభమైన హత్య కేసు షెడ్యూల్ విచారణ ప్రారంభం కాకుండానే, జులై 14వ తేదీకి కేసు వాయిదా పడింది. ఇక హైకోర్టు డైరెక్షన్ లో ఏపీపీ నియామకం జరిగిన అనంతరం మేయర్ దంపతుల హత్య కేసులో పూర్తి స్థాయిలో విచారణ కొనసాగనుంది. మేయర్ దంపతుల హత్య కేసు విచారణ నేపథ్యంలో కోర్టులో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
మేయర్ దంపతుల హత్య
చిత్తూరులో టీడీపీలో కీలక నేతగా ఎదిగిన కఠారి మోహన్ 2013లో జరిగిన నగర పాలక సంస్థ ఎన్నికల్లో విజయం సాధించారు. ఈ క్రమంలో మోహన్ భార్య అనురాధ చిత్తూరు మేయర్‌గా ఎన్నికయ్యారు. అయితే అప్పటికే పలువురితో వర్గవిభేదాల కారణంగా మోహన్‌పై దాడికి పక్కా ప్లాన్ వేసిన ప్రత్యర్థులు మోహన్‌తో పాటు అనురాధను మేయర్ ఛాంబర్‌లోనే హత్య చేశారు. ఈ హత్యలో కఠారి మోహన్ అల్లుడు చింటూ రాయల్ ప్రత్యక్షంగా పాలుపంచుకోవడం గమనార్హం.