Chittoor Crime: పేరెంట్స్‌తో కలిసి యువతులను ట్రాప్ చేస్తున్న నిత్య పెళ్లికొడుకు, మొదటి భార్య నిఘా పెట్టడంతో షాకింగ్ ట్విస్ట్ !
Wife Complaint Against Chittoor Man: కుటుంబసభ్యుల సహకారంతో మొదటి భార్యకు తెలియకుండా రెండో పెళ్లి చేసుకున్నాడు. కట్నం వస్తుందని మూడో పెళ్లి చేసుకున్న వ్యక్తిపై భార్యలు కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Chittoor Man Marries 3 Women: దాంపత్య జీవితం అంటే ప్రేమానురాగాలతో కూడిన పవిత్ర బంధం. ఎలా పెళ్లి చేసుకున్నా, జీవితాంతం ఒకరిపై మరొకరు నమ్మకం కలిగి ఉంటేనే జీవితంలో ఎన్ని ఒడిదుడుగులు వచ్చినా వివాహ బంధం సాఫీగా సాగుతుంది. ప్రస్తుతం పెళ్లి అంటేనే కష్టతరమైన పనిగా మారింది. అలాంటిది ఓ వ్యక్తి మాత్రం నిత్య పెళ్లికొడుకుగా మారిపోయాడు. ఒకరికి తెలియకుండా మరోకరిని పెళ్లిచేసుకుంటూ మోసాలకు పాల్పడుతున్నాడు. బాధితులంతా కలిసి పోలీసులను ఆశ్రయించడంతో నిత్య పెళ్ళి కొడుకు లీలలు ఒక్కోటిగా వెలుగు చూస్తున్నాయి.
పోలీసుల కథనం ప్రకారం.. చిత్తూరు జిల్లా పెద్దతిప్ప సముద్రం మండలం నవాబుకోటకు చేందిన మంజునాధ్ ఓ ప్యాపారి. బిజినెస్ పనుల కోసం పొరుగు రాష్ట్రాలకు తిరిగుతూ ఉంటాడు. దీంతో బిజీబిజీగా ఉండే మంజునాథ్ రెండు, మూడు వారాలకు ఓసారి సొంత గ్రామం నవాబుకోటకు వచ్చే వాడు. మంజునాథ్ తల్లిదండ్రులు చూసిన సంబంధం మదనపల్లె మండలం అంగళ్లుకు చెందిన రజినీని వివాహం చేసుకున్నాడు. కొన్నేళ్లపాటు రజనీతో కలిసి హాయిగా జీవనం సాగించిన మంజునాథ్ బుద్ధి ఒక్కసారిగా మారింది.
పెళ్లిళ్లు చేసుకుంటే తనకు వరకట్నం వస్తుందని, దాంతో ఎంచక్కా వ్యాపారాన్ని మరింత విస్తరించాలని భావించాడు. తాను రెండో పెళ్లి చేసుకునేందుకు తల్లిదండ్రులను ఒప్పుంచాడు. మొదటి భార్యకు తెలియకుండా గుట్టు చప్పుడు కాకుండా మ్యారేజ్ బ్యూరో ద్వారా ఆరేళ్ల కిందట చిక్‌బల్లాపూర్‌కు చెందిన ఆశను సైతం పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు. మొదటి భార్యకు తెలియకుండా, రెండోవ భార్య వద్దకు వెళ్లడం.. రెండో భార్యకు తెలియకుండా మొదటి భార్యతో గడుపుతున్నాడు.
వ్యాపార నిమిత్తం బెంగుళూరుకి వెళ్ళే సమయంలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న దావణగిరి ప్రియాంకతో మంజునాధ్ కి పరిచయం ఏర్పడింది. తనకు పెళ్లి కాలేదని చెప్పి నమ్మించి, ప్రియాంకతో మూడో పెళ్లికి సిద్ధమయ్యాడు. కట్నం డబ్బులు మీకు కూడా ఇస్తున్నాను సహకరించాలని కోరగా అతడి తల్లిదండ్రులు, సోదరి ఒప్పుకున్నారు. గత ఏడాది బెంగళూరులో ప్రియాంకను సైతం వివాహం చేసుకున్నాడు. కొన్నిరోజుల నుంచి భర్త ప్రవర్తనలో మార్పు రావడంతో మంజునాథ్ ఎక్కడి వెళ్తున్నాడని మొదటి భార్య రజిని ఫోకస్ చేసింది. భర్త మరో ఇద్దరిని వివాహం చేసుకుని తనతో పాటు వాళ్లను కూడా మోసం చేసినట్లు తెలుసుకుంది.
భర్తకు బుద్ది చెప్పాలని భావించిన రజిని.. రెండో, మూడో భార్య ఆశ, ప్రియాంకలను కలిసి విషయం చెప్పింది. భార్యలకు తాను మోసం చేస్తున్న విషయం తెలిసిందని మంజునాథ్ పరారయ్యాడు. ముగ్గురు భార్యలు అత్తమామలు ఉంటున్న నవాబుకోటకు వెళ్లి నిలదీయగా పొంతన లేని సమాధానాలు చెప్పడంతో పెద్దతిప్పసముద్రం పోలీసులను ఆశ్రయించారు. దీంతో నిత్యపెళ్లికొడుకు మంజునాథ్ మోసాలు వెలుగుచూశాయి. ఐపీసీ 495, 498ఏ, 420, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. ముగ్గురినే వివాహం చేసుకున్నాడా, లేక ఇంకా యువతులు, మహిళల్ని మోసం చేశాడా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. మంజునాథ్ కుటుంబసభ్యుల సహకారంతోనే తమను మోసం చేశాడని అతడి భార్యలు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.