Chittoor News: ఫేస్ బుక్‌లో అమ్మాయిల పేరుతో వచ్చిన ఫ్రెండ్ రిక్వెస్ట్ ఓకే చేశాడు- చివరకు ఆత్మహత్యకు పాల్పడ్డాడు
Chittoor News: ఫేస్ బుక్ లో అమ్మాయి పేరిట వల వేసి చిక్కిన యువకుడికి చుక్కలు చూపించారు. బెదిరింపులకు పాల్పడుతూ.. డబ్బులు ఇవ్వాలని వేధించారు. డబ్బులు ఇవ్వలేని యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.
Chittoor News: సోషల్ మీడియా వేదికగా కొందరు అగంతకులు రెచ్చి పోతున్నారు. అందమైన అమ్మాయిల ముసుగులో యువకులకు వల వేసి, వీడియో కాల్స్ రికార్డు చేసి అక్రమంగా నగదు సంపాదిస్తున్నారు. అడిగినంత డబ్బులు ఇవ్వక పోతే తాము రికార్డు చేసిన వీడియోలను సోషల్ మీడియాలో పెడతామని బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఎవరో తెలియని అగంతకులు బెదిరింపులకు పాల్పడితే తాళలేని చాలా మంది యువకులు ఆత్మహత్యలకు పాల్పడి నిండు జీవితాలను చేతులారా నాశనం చేసుకుంటున్నారు. తాజాగ ఇలాంటి ఘటనే చిత్తూరు జిల్లా వికోట మండలంలో చోటు చేసుకుంది. బస్సాపురం వీధికి చెందిన మురళి(19) అనే యువకుడు ఫేస్బుక్ ద్వారా పరిచయమైన అమ్మాయితో ఏర్పడిన పరిచయం అతని మృతికి కారణమైంది.ఈ ఘటన స్ధానికంగా కలకలం రేపుతోంది.
వివరాల్లోకి వెళ్తే.. చిత్తూరు జిల్లా, వికోట మండల కేంద్రంలోని బస్సాపురం వీధికి చేందిన 19 ఏళ్ల మురళి అనే యువకుడు స్ధానికంగా కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే కొద్ది రోజుల క్రితం మురళికి ఓ అందమైన అమ్మాయిల ఫోటోలతో ఫ్రెండ్ రిక్వెస్ట్ రాగా, ఆ ఫోటోలను చూసి ఆకర్షితుడైన మురళి ఆమె ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేశాడు. దీంతో ఇద్దరు మెసేజ్ చేసుకునే వారు. అంతే కాకుండా ఇద్దరు కాల్స్ చేసుకుని మాట్లాడటం ప్రారంభించారు. ఆమెతో వీడియో కాల్ మాట్లాడగా దాన్ని రికార్డ్ చేసుకున్న సదరు యువతి దానిని మార్ఫింగ్ చేసి తన వద్ద ఉన్న వీడియోలను మురళికి పంపించింది. నీకు సంబంధించిన చాలా అశ్లీల వీడియోలు నా దగ్గర ఉన్నాయని చెప్పింది. అడిగినప్పుడల్లా ఇవ్వమన్నంత డబ్బు ఇవ్వకపోతే.. ఆ వీడియోలను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తామని బెదిరింపులకు పాల్పడింది. దీంతో వారు అడిగినంత డబ్బు తన వద్ద లేక ఉన్న వాటిల్లోనే కొంచెం కొంచెం పంపించడం చేశాడు.
అయినా ఆ అమ్మాయి తరచుగా డబ్బులు ఇవ్వాలని వేధించడం మొదలు పెట్టింది. దీంతో మురళీల పోలీసులకు తాను ఆత్మహత్య చేసుకోబతున్నట్లు.. అందుకు గల కారణాలను రికార్డు చేశాడు. ఈ క్రమంలోనే ఆదివారం రోజు పనికి వెళ్లిన మురళీకి తరచూ ఫోన్ రావడంతో అతను పని ఉందని చెప్పి ఇంటికి వచ్చాడు. తల్లికి, అక్కలకు తనను మన్నించాలని వాట్సాప్ ద్వారా మెసేజ్ చేశాడు. ఆపై ఇంట్లోని ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సాయంత్రం పనులు ముగించుకొని ఇంటికి వచ్చి తల్లి, అక్కలు మురళీ ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించడాన్ని చూసి షాక్ కు గురయ్యారు. గట్టిగా కేకలు వేస్తూ ఏడ్వడంతో స్థానికులు పరిగెట్టుకుంటూ వచ్చారు. బతికి ఉన్నాడనే ఆశతో అతడిని కిందికి దింపి.. వెంటనే వికోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
అప్పటికే మురళీ మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. దీంతో కుటుంబ సభ్యులంతా కన్నీరు మున్నీరవుతున్నారు. తమ బిడ్డ మృతికి గల కారణంపై కుటుంబ సభ్యులు, బంధువులు ఆరా తీశారు. సెల్ ఫోన్ పరిశీలించగా అందులో జరిగిన సంభాషణ చూసి వారంతా నిశ్చేష్టులు అయ్యారు. దీంతో చేసేదేం లేక యువకుడు మృతదేహాన్ని తరలించి అంత్యక్రియలు పూర్తి చేశారు. తమ బిడ్డకు టచ్ స్క్రీన్ మొబైల్ కొనివ్వడమే పొరపాటు అయిందని దానిని ఎలా వినియోగించాలో తెలియక తమ బిడ్డను కోల్పోవాల్సి వచ్చిందని తల్లిదండ్రులు విలపిస్తున్నారు. పరిచయం లేని వారితో మాట్లాడటం, వారి ఆకర్షణకు వీరు బలి కావడం వల్ల యువకులు వారి విలువైన ప్రాణాలను కోల్పోతున్నారు. అయితే యువకుడి మృతిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.