Badlapur: టాయిలెట్‌లో చిన్నారులను లైంగికంగా వేధించిన స్వీపర్, ఎవరూ లేని సమయంలో దారుణం - బాలల హక్కుల సంఘం విచారణ
Maharashtra: మహారాష్ట్రలోని బద్లాపూర్‌లో స్కూల్ టాయిలెట్‌లో ఇద్దరు చిన్నారులను స్వీపర్ లైంగికంగా వేధించాడు. ఈ ఘటనపై స్థానికంగా భారీ ఆందోళనలు జరుగుతున్నాయి.
Badlapur Assault Case: ఓ వైపు కోల్‌కతా ఘటనపై దేశమంతా భగ్గుమంటున్నా రోజూ ఈ దారుణాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. మహారాష్ట్రలోని బద్లాపూర్‌లో ఓ స్కూల్‌లో స్వీపర్ ఇద్దరి బాలికల్ని లైంగికంగా వేధించడం సంచలనం సృష్టించింది. మూడు, నాలుగేళ్ల చిన్నారులను వేధించడంపై స్థానికులు భగ్గుమన్నారు. పలు చోట్ల పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ ఘటనపై స్పందించిన నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (NCPCR) విచారణకు ఆదేశించింది. ప్రత్యేకంగా ఓ బృందాన్ని పంపించి విచారిస్తామని స్పష్టం చేసింది. అయితే...స్థానికంగా నిరసనలు వెల్లువెత్తడం వల్ల ప్రజా రవాణాకు అంతరాయం కలిగింది. నిరసనకారులు బద్లాపూర్ రైల్వే స్టేషన్‌ని ముట్టడించారు. రైల్‌రోకో చేశారు. ఫలితంగా దాదాపు 10 గంటల పాటు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. ఆగస్టు 13వ తేదీన స్కూల్ టాయిలెట్‌లో ఇద్దరు చిన్నారులను స్వీపర్ లైంగికంగా వేధించినట్టు విచారణలో తేలింది. ఆగస్టు 16న ఆ చిన్నారులు తమ తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పారు. అప్పుడు కానీ ఈ దారుణం వెలుగులోకి రాలేదు. నిందితుడు అక్షయ్ శిండేని పోలీసులు ఆగస్టు 17వ తేదీన అరెస్ట్ చేశారు.
#WATCH | Alleged sexual assault with a girl child at a school in Badlapur | A few people were seen pelting stones at the Police at Badlapur Railway Station after the personnel resorted to lathi-charge to disperse protestors gathered here in protest over the incident.
— ANI (@ANI) August 20, 2024
Visuals… pic.twitter.com/jVUcCr6wQ8
బద్లాపూర్ రైల్వే స్టేషన్ వద్ద ఆగస్టు 20వ తేదీన వేలాది మంది నిరసన వ్యక్తం చేశారు. ఈ కారణంగా దాదాపు 12 రైళ్లు దారి మళ్లించాల్సి వచ్చింది. 30 లోకల్ ట్రైన్స్ రద్దయ్యాయి. ఈ ఘటన జరిగిన స్కూల్‌పై రాళ్లతో దాడి చేసి ధ్వంసం చేశారు. స్కూల్ బస్‌నీ ధ్వంసం చేశారు. దాదాపు 9 గంటల పాటు ఇదే ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే...ఈ ఘటన జరిగిందని చెప్పాక 12 గంటల తరవాత పోలీసులు FIR నమోదు చేశారని బాధితుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అంతే కాదు. స్కూల్‌లోని సీసీ కెమెరా పని చేయకపోవడంపైనా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓ బాలిక ప్రైవేట్ పార్ట్‌కి గాయమైనట్టు వైద్యులు చెప్పడం వల్ల ఒక్కసారిగా ఆగ్రహం పెల్లుబికింది. అమ్మాయిల బాత్‌రూమ్‌లలో పురుషులు ఎందుకున్నారని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన ప్రభుత్వం ముగ్గురు పోలీస్ ఆఫీసర్‌లను సస్పెండ్ చేసింది.