Kolkata: కోల్‌కతా హాస్పిటల్ పేరు తప్పుగా పలికిన చీఫ్ జస్టిస్, వెంటనే తప్పు సరిదిద్దుకుని క్షమాపణలు
Kolkata Case: కోల్‌కతా హాస్పిటల్ పేరుని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ తప్పుగా పలికారు. ఓ జస్టిస్ చెప్పడం వల్ల వెంటనే ఆ తప్పు సరిదిద్దుకున్నారు.
Supreme Court: కోల్‌కతా హత్యాచార కేసుని విచారిస్తున్న సమయంలో సుప్రీంకోర్టులో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. హాస్పిటల్ పేరుని చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ తప్పుగా పలికారంటూ జస్టిస్ రిషికేశ్ రాయ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. హాస్పిటల్ పేరు ఆర్‌జీ కార్ హాస్పిటల్ కాదని ఆర్‌జీ కర్ హాస్పిటల్ అని సరిదిద్దారు. వెంటనే స్పందించిన చీఫ్ జస్టిస్ ఆ తప్పు సరిదిద్దుకున్నారు. ఈ కేసు విచారణ సమయంలో ఓ అడ్వకేట్ మాట్లాడుతూ ఆర్‌జీ కార్ హాస్పిటల్ అని పలికారు. వెంటనే చీఫ్ జస్టిస్ అడ్డగించారు. "చెప్పడం మరిచిపోయాను. ఆర్‌జీ కర్ హాస్పిటల్ అని పలకండి. నేనూ తప్పుగా పలికాను. జస్టిస్ రిశికేష్ నా తప్పు సరిదిద్దారు. అలా తప్పుగా పలికినందుకు క్షమించండి" అని చెప్పారు. ఆ తరవాత విచారణ కొనసాగించారు. ఈ సందర్భంగా కోల్‌కతా ప్రభుత్వం, పోలీసుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. 30 ఏళ్లలో ఎప్పుడూ ఇలాంటి కేసు చూడలేదని అన్నారు. FIR నమోదులో ఎందుకింత గందరగోళం జరిగిందో అర్థం కావడం లేదని చెప్పారు.
1886లో అప్పటి ఫిజీషియన్ రాధా గోవింద్ కర్ RG Kar Medical College ని స్థాపించారు. అప్పటికి ఈ కాలేజ్‌తో అనుబంధంగా ఏ హాస్పిటల్ కానీ క్యాంపస్ కానీ లేదు. 1902లో ప్రత్యేకంగా బిల్డింగ్ ఏర్పాటు చేశారు. 1916లో ఈ కాలేజ్ పేరుని బెల్గాచియా మెడికల్ కాలేజ్‌గా మార్చారు. స్వాతంత్య్రం వచ్చిన తరవాత వ్యవస్థాపకుడైన డాక్టర్ రాధా గోవింద్ కర్ పేరునే ఖరారు చేశారు. ఆ సమయంలోనే పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం హాస్పిటల్ నిర్వహణ బాధ్యతల్ని తీసుకుంది. అప్పటి నుంచి ఈ కాలేజ్ ప్రభుత్వ పరిధిలోకి వెళ్లిపోయింది. ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా ఈ హాస్పిటల్ పేరు మారుమోగుతోంది. ఇప్పటికే ఈ ఘటనపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. పలు రాష్ట్రాల్లో వైద్యులు న్యాయం జరగాలంటూ నినదిస్తున్నారు.
Also Read: Kolkata: పాపం నా బిడ్డ ఎంత విలవిలాడిపోయిందో, నన్ను తలుచుకుని ఏడ్చిందేమో - బాధితురాలి తల్లి ఆవేదన