Nagasadhu Aghori: అర్ధరాత్రి శ్మశానంలో కోడిని బలిచ్చిన అఘోరీ - కేసు నమోదు చేసిన వరంగల్ పోలీసులు
Telangana News: నాగసాధు అఘోరీ ఊహించని వివాదంలో చిక్కుకున్నారు. శ్మశానంలో బహిరంగంగా కోడిని బలిచ్చి రక్తార్పణం చేయడంపై లా విద్యార్థులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు.
![Nagasadhu Aghori: అర్ధరాత్రి శ్మశానంలో కోడిని బలిచ్చిన అఘోరీ - కేసు నమోదు చేసిన వరంగల్ పోలీసులు case filed against nagasadhu aghori while killed chicken in mamunuru police station Nagasadhu Aghori: అర్ధరాత్రి శ్మశానంలో కోడిని బలిచ్చిన అఘోరీ - కేసు నమోదు చేసిన వరంగల్ పోలీసులు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/11/25/acd2b2527c81e6fead011937bbbd0a2c1732532217822876_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Case Filed Against Nagasadhu Aghori In Telangana: నాగసాధు అఘోరీ (Nagasadhu Aghori).. ఈ పేరు ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో మార్మోగుతోంది. తన వికృత చేష్టలతో అటు మీడియా, ఇటు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేసింది. తాజాగా, అఘోరీ ఊహించని వివాదంలో చిక్కుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోడిని చంపినందుకు గానూ ఆమెపై కేసు నమోదైంది. ఈ నెల 19వ తేదీన వరంగల్ (Warangal) నగర శివారులోని బెస్తంచెరువు శ్మశాన వాటికలో పూజలు చేసిన అఘోరి వికృత చేష్టలకు పాల్పడింది. రెండు రోజులు శ్మశానంలో విడిది చేసి అక్కడ విచిత్ర పూజలు చేసి బహిరంగంగానే కోడిని బలిచ్చింది. ఇది చూసిన స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తాజాగా వైరల్ అయ్యింది.
శ్మశానంలో కోడిని బలివ్వడంపై కరీంనగర్ (Karimnagar) జిల్లాకు చెందిన జంతు ప్రేమికులు, లా విద్యార్థులు కసిరెడ్డి రోహన్ రెడ్డి, సౌమిత్ పటేల్‌లు వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లోని మామునూరు పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి వీడియోలను పోలీసులకు సమర్పించారు. బహిరంగంగా కోడిని బలిచ్చి రక్తార్పణ చేయడం నేరమని.. కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో అఘోరీపై సెక్షన్ 325 కింద కేసు నమోదు చేశారు.
'జైలు శిక్ష తప్పదా.?'
కాగా, పోలీసులు అఘోరికి ఎఫ్ఐఆర్ అందజేయడంతో పాటు స్టేషన్ బెయిల్ మంజూరు చేయరని పిటిషనర్ రోహన్ రెడ్డి తెలిపారు. రెండు నెలల్లోపు ఛార్జ్ షీట్ నమోదు చేస్తారని చెప్పారు. కేసు నిరూపణ అయితే ఒక్క రోజు నుంచి 5 ఏళ్ల వరకూ జైలు శిక్ష పడే ఛాన్స్ ఉంటుందని అన్నారు. ఏ మతం వారైనా దేవుళ్ల పేరుతో జంతుబలి ఇవ్వడం నేరమని పేర్కొన్నారు. ప్రస్తుతం అఘోరీ ఎక్కడ ఉందో పోలీసులు గుర్తించలేదు.
సంచలన వ్యాఖ్యలు
గత కొద్ది రోజులుగా ఏపీలో ఆలయాల వద్ద నాగసాధు అఘోరీ హల్చల్ చేసింది. కారులో ప్రయాణిస్తూ వివిధ ఆలయాలకు వెళ్లగా.. నగ్నంగా ఉండడంతో దర్శనానికి అనుమతించలేదు. అనంతరం ఆమె దుస్తులు ధరించి ఆలయాలను సందర్శించారు. ఇటీవలే మంగళగిరిలో నడిరోడ్డుపై హల్చల్ చేయగా పోలీసులు అఘోరీని అతి కష్టం మీద నిలువరించారు. మంగళగిరి హైవేపై బైఠాయించగా.. పోలీసులు అడ్డుకునేందుకు యత్నించారు. దీంతో ఆమె వారిపై దాడికి పాల్పడింది.
అనంతరం తెలంగాణకు చేరుకుంది. ఈ క్రమంలోనే సంచలన వ్యాఖ్యలు చేసింది. హిందూ ధర్మం రక్షణ కోసం పోరాడుతుంటే.. తనను అడ్డుకోవడం ఎంతవరకు సమంజసమని అఘోరీ మండిపడ్డారు. హిందూ దేవాలయాలు, ఆడపిల్లలపై అఘాయిత్యాలకు నిరసనగా తాను ఆత్మహత్య చేసుకుంటానని అన్నారు. తెలంగాణలో తనను ఆపే మగాడు ఇంకా పుట్టలేదని పేర్కొన్నారు. తెలంగాణలో ఆలయాలు ధ్వంసం అవుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుందని మండిపడ్డారు. సనాతన ధర్మాన్ని కాపాడే బాధ్యత మనందరిపై ఉందని తెలిపింది. స్త్రీలపై దాడులను ఆపే శక్తి మన దగ్గర ఉందని చెప్పుకొచ్చింది. గో హత్యలను నివారించేందుకు పోరాడదామని చెప్పుకొచ్చింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)