America News: అమెరికాలో కాల్పుల కలకలం - తల్లి, ఆరు నెలల పాప సహా ఆరుగురు మృతి
America News: కాలిఫోర్నియాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. ఈ ఘటనలో తల్లి, ఆరు నెలల పాప సహా ఆరుగురు మృతి చెందారు. అయితే కాల్పులకు పాల్పడ్డ నిందితుల కోసం పోలీసులు వెతుకుతున్నారు.
America News: అమెరికాలో కాల్పుల కలకలం సృష్టిస్తున్నాయి. గన్ కల్చర్ రోజురోజుకూ పెరిగిపోతోంది. తాజాగా కాలిఫోర్నియాలోని గోషెన్ పట్టణంలో జరిగిన మరో సామూహిక కాల్పుల్లో ఓ తల్లి, ఆరు నెలల పాపతో సహా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. దేశంలో తుపాకీ హింస కేసులు పెరుగుతున్నాయడానికి ఈ ఘటనే నిదర్శనం. అయితే కాల్పులకు పాల్పడ్డ ఇద్దరు నిందితుల కోసం పోలీసులు అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.
అసలేం జరిగిందంటే..?
సోమవారం వేకువజామున సెంట్రల్ కాలిఫోర్నియాలోని విసాలియా నగరంలోని ఓ ఇంట్లోకి చొరబడ్డ గుర్తు తెలియని వ్యక్తులు కుటుంబ సభ్యులపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆరు నెలల చిన్నారి, ఆమె తల్లి సహా ఆరుగురు మృత్యువాత పడ్డారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన రంగంలోకి దిగారు. ఇద్దరు వ్యక్తులు కాల్పులకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. వారిని పట్టుకునేందు అన్ని రకాల ప్రయత్నాలు కొనసాగుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లే సరికి ఇద్దరి మృతదేహాలు వీధిలో, మరొకరి శవం తలుపు వద్ద ఉన్నట్లు గుర్తించారు. మరో ముగ్గురు బాధితుల మృతదేహాలు ఇంట్లో ఉండగా.. ఓ వ్యక్తి ప్రాణాలతోనే ఉన్నట్లు గుర్తించారు. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే ఆ వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అతను మరణించినట్లు పోలీసులు వెల్లడించారు.
కుటుంబాన్ని టార్గెట్ చేసి పక్కా ప్రణాళికతోనే నిందితులు ఈ హత్యలకు పాల్పడినట్లు తాము భావిస్తున్నామని పోలీసులు వివరించారు. మాదక ద్రవ్యాలు నిల్వ ఉన్నాయన్న అనుమానంతో వారం రోజుల క్రితమే ఈ ఇంట్లో నార్కోటిక్స్ సంబంధిత తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాలు జరిగిన వారం రోజుల తర్వాత కాల్పులు జరగడం కలకలం సృష్టిస్తోంది.
పదిరోజుల క్రితమే టీచర్ పై కాల్పులు జరిపిన బాలుడు
పది రోజుల క్రితం వర్జీనియాలోని ఒక ప్రాథమిక పాఠశాలలో విద్యార్థి జరిపిన కాల్పుల్లో టీచర్‌కు గాయాలయ్యాయి. టీచర్‌ను వెంటనే ఆసుపత్రిలో చేర్చారు. వర్జీనియాలోని న్యూపోర్ట్ సిటీలోని ఎలిమెంటరీ స్కూల్లో ఈ సంఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ కాల్పుల్లో ఏ విద్యార్థి గాయపడలేదు.
ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఒక విద్యార్థిని అదుపులోకి తీసుకున్నట్లు వర్జీనియా మేయర్ ఫిలిప్ జోన్స్ మీడియాకు తెలిపారు. విద్యార్థి వయస్సు ఎంత అనేది అధికారులు చెప్పనప్పటికీ, మీడియా నివేదికలు విద్యార్థి వయస్సు 6 సంవత్సరాలు అని పేర్కొన్నాయి. మధ్యాహ్నం 2 గంటల సమయంలో కాల్పుల గురించి తమకు కాల్ వచ్చిందని న్యూపోర్ట్ పోలీస్ చీఫ్ స్టీవ్ డ్రూ తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే, తమ టీం అక్కడికి చేరుకుందన్నారు.