Sexual Assault: కదులుతున్న ట్రైన్‌లో బాలికపై రైల్వే ఉద్యోగి దారుణం! చావగొట్టిన ప్రయాణికులు
Kanpur: రైల్వే ఉద్యోగి, కోచ్ అటెండెంట్ ప్రశాంత్ కుమార్ బుధవారం రాత్రి మార్గమధ్యంలో కుటుంబం వద్దకు వచ్చాడు. అదే సమయంలో బాధితురాలి తల్లి వాష్ రూమ్‌కు వెళ్లింది.
Assault in Train: బీహార్‌లో దారుణం చోటు చేసుకుంది. కదులుతున్న ఎక్స్‌ప్రెస్ రైలులో 11 ఏళ్ల బాలికపై రైల్వే ఉద్యోగి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. బాధితురాలి తల్లి వాష్‌రూమ్‌కు వెళ్లగా.. చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న ప్రయాణికులు అతడిని చితకబాదడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. నిందితుడిని అదే రాష్ట్రానికి చెందిన ప్రశాంత్ కుమార్‌గా రైల్వే పోలీసులు గుర్తించారు.
చచ్చేలా కొట్టిన ప్రయాణికులు
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. బీహార్‌కు చెందిన ఓ కుటుంబం ఢిల్లీ వెళ్లేందుకు హమ్‌సఫర్ రైలు ఎక్కింది. జనరల్ టిక్కెట్లు తీసుకున్న వారు టీటీఈ నుంచి అనుమతి తీసుకుని ఏసీ కోచ్-డీలో కూర్చున్నారు. అయితే రైల్వే ఉద్యోగి, కోచ్ అటెండెంట్ ప్రశాంత్ కుమార్ బుధవారం రాత్రి మార్గమధ్యంలో కుటుంబం వద్దకు వచ్చాడు. అదే సమయంలో బాధితురాలి తల్లి వాష్ రూమ్‌కు వెళ్లింది. దీంతో ఆ సమయాన్ని అదునుగా తీసుకున్న ప్రశాంత్ కుమార్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. వాష్ రూమ్ కు వెళ్లి తల్లి వచ్చే సరికి బాలిక ఏడుస్తూ కనిపించింది. దీంతో ఏం జరిగిందని అడగగా జరిగిన విషయాన్ని ఏడుస్తూ చెప్పింది. బాధితురాలి తల్లి అదే రైలులో ఉన్న తన భర్తకు జరిగిన సంఘటనను చెప్పడం తోటి ప్రయాణికులు విన్నారు. ఆవేశంతో నిందితుడిని తీవ్రంగా కొట్టారు. గురువారం ఉదయం రైలు కాన్పూర్ సెంట్రల్ స్టేషన్‌కు చేరుకోగానే జీఆర్పీ సిబ్బందికి సమాచారం అందించారు.
కేసు నమోదు
వెంటనే కాన్పూర్ జీఆర్పీ సిబ్బంది ప్రశాంత్ కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. అప్పటికే ప్రయాణికులు చేతిలో దెబ్బతిని తీవ్రంగా గాయపడిన అతడిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రైల్వే ఉద్యోగి చనిపోయాడు. అయితే బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు పోక్సో, వేధింపుల కింద కేసులు నమోదు చేశారు. సకాలంలో చికిత్స అందితే నిందితుడి ప్రాణం దక్కేదని.. చికిత్స పొందుతూ ప్రశాంత్ కుమార్ మృతి చెందినట్లు కాన్పూర్ సెంట్రల్ జీఆర్పీ ఇన్‌ఛార్జ్ ఓం నారాయణ్ సింగ్ తెలిపారు.
మధ్యప్రదేశ్ లో మరో ఘటన
మరోవైపు మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో తమ ప్రియురాళ్లతో బయటకు వెళ్లిన ఆర్మీ అధికారులపై కొందరు దుండగులు దాడి చేశారు. అనంతరం వారి స్నేహితురాళ్లపై సామూహిక అత్యాచారం చేశారు. ముందుగా వారి వద్ద ఉన్న నగదు, నగలను ఎత్తుకెళ్లిన దుండగులు ఆ తర్వాత ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారు. వారి నుంచి తప్పించుకున్న ఓ సైనికుడు పోలీసులకు సమాచారం అందించాడు. బాధితురాలికి వైద్యపరీక్షలు నిర్వహించగా అత్యాచారం జరిగినట్లు నిర్ధారించారు. నిందితుల్లో ముగ్గురిని అరెస్టు చేశారు.