Karimnagar: ఇంటి కింద 4 కోట్లు! వాటి కోసం క్షద్రపూజలు, తెలివిగా నమ్మించి బురిడీ కొట్టించిన దొంగ బాబాలు
క్షుద్రపూజల పేరుతో మచర్ల రాజు అనే వ్యక్తి వద్ద ఏడు లక్షల రూపాయలు వసూలు చేసి మోసం చేసిన మాతం చందు, ఎర్నాల సంజీవ్ అనే ఇద్దరు పాత నేరస్థులను భువనగిరి ఎస్ఓటి పోలీసులతో కలిసి అరెస్టు చేశారు.
వాళ్లిద్దరూ డబ్బు సంపాదనకై అడ్డదారి తొక్కారు.. ఈ జాబులు, వ్యాపారాలు ఎందుకు అనుకున్నారో ఏమో..! ఏకంగా నకిలీ బాబాలుగా అవతారం ఎత్తారు. మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ పీఎస్ పరిధి ఎదులాబాద్ గ్రామంలో ఈ వ్యవహారం వెలుగు చూసింది. క్షుద్రపూజల పేరుతో మచర్ల రాజు అనే వ్యక్తి వద్ద ఏడు లక్షల రూపాయలు వసూలు చేసి మోసం చేసిన మాతం చందు, ఎర్నాల సంజీవ్ అనే ఇద్దరు పాత నేరస్థులను భువనగిరి ఎస్ఓటి పోలీసులతో కలిసి అరెస్టు చేశారు. గత నెల 11న ఎదులాబాద్ లోని రాజు అనే వ్యక్తికి తాము సాధనా శూరులం అని పరిచయం చేసుకుని, ఇంట్లో దెయ్యాలు ఉన్నాయని, రాబోయే పౌర్ణమి లోపు ప్రత్యేక పూజలు చేయకపోతే చనిపోతావని బెదిరించారు. అప్పటికే తమ ఇంట్లో ఓ మరణం సంభవించిన కారణంగా పరిహారం చేసుకోవాలని నిర్ణయించుకొని వారినే అతను పరిష్కారం అడిగాడు.
ఆ పూజలు అలా అయ్యాయో లేదో ఇంటి కింద నాలుగు కోట్ల రూపాయల విలువ చేసే నిధులు ఉన్నాయని, వాటిని బయటికి తీస్తామని వివిధ రూపాలలో దాదాపు ఏడు లక్షల రూపాయలు వసూలు చేసుకొని పరారు అయ్యారు. దిక్కుతోచని స్థితిలో పోలీసులను ఆశ్రయించిన బాధితుడు కేసు పెట్టగా పోలీసులు విచారణ మొదలుపెట్టారు. గతంలో రాచకొండ పరిధి రామన్నపేట పీఎస్ పరిధిలో ఇలా మోసం చేసి రేప్ కేసులో కూడా ఇన్వాల్వ్ అయిన కరీంనగర్ జిల్లాకు చెందిన మాతం చందు అతని బంధువు సంజీవ్ గా గుర్తించి అరెస్టు చేసిన భువనగిరి ఎస్ఓటి పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుండి రూ.15 వేల నగదు, రెండు సెల్ ఫోన్లు, ఒక ఆల్టో కారు, పూజా సామాగ్రిని స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్‌కు పంపారు.
Also Read: TSRTC Offer: పదో తరగతి విద్యార్థులకు ఆర్టీసీ గుడ్ న్యూస్! వీరికి ఫ్రీ రైడ్ - రోజుకు ఎన్నిసార్లంటే
ముక్కు ముఖం తెలియని వ్యక్తులను నమ్మవద్దని అది కూడా పూజల పేరుతో ఎవరైనా ఇంట్లోకి వచ్చే ప్రయత్నం చేస్తే మొదట్లోనే నిలువరించాలని పోలీసులు ఎన్నోమార్లు బహిరంగ విజ్ఞప్తులు చేస్తున్నారు. కానీ నమ్మేవారి బలహీనతనే ఆధారంగా చేసుకుని కొందరు కేటుగాళ్లు మంత్రాలు, తంత్రాలు, పూజల పేరుతో నిలువునా దోచేస్తున్నారు. మోసం చేసే వాడికి నమ్మేవాడు లోకువ అన్నట్టుగా వారికి మాయమాటలు చెప్పి మరీ డబ్బు, బంగారం కొట్టేస్తున్నారు.