భార్య తల నరికి చేతిలో పట్టుకుని రోడ్డుపై తిరిగిన వ్యక్తి, బెంగాల్‌లో భయానక ఘటన
Bengal Crime: బెంగాల్‌లో ఓ వ్యక్తి భార్య తలనరికి చేతిలో పట్టుకుని రోడ్డుపై తిరిగిన ఘటన సంచలనం సృష్టించింది.
Bengal Crime News: పశ్చిమ బెంగాల్‌లో ఓ వ్యక్తి భార్యను దారుణంగా హత్య చేశాడు. అతి కిరాతకంగా నరికేసి భార్య తలను పట్టుకుని రోడ్డుపైన తిరగడం స్థానికంగా సంచలనం సృష్టించింది. నిందితుడుని చూసి చుట్టూ ఉన్న జనాలు భయపడుతుంటే కావాలనే ఆ తలను పైకెత్తి చూపిస్తూ అందరినీ ఇంకాస్త భయపెట్టాడు. పశ్చిమ బెంగాల్‌లోని పుర్బా మెదినిపూర్ జిల్లాలో ఈ దారుణం జరిగింది. ఫిబ్రవరి 14నే ఈ ఘటన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితుడు గౌతమ్ భార్యపై అనుమానంతోనే ఈ హత్య చేసినట్టు పోలీసులు ప్రాథమికంగా వెల్లడించారు. హత్య చేసిన తరవాత తలను వేరు చేసి సమీపంలోని బస్‌స్టాప్ దగ్గరికి వెళ్లి అందరికీ ప్రదర్శిస్తూ భయభ్రాంతులకు గురి చేశాడు. స్థానికులు ఇదంతా వీడియో తీశారు. పోలీసులు గంట తరవాత అక్కడికి చేరుకున్నారు. వెంటనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి తల్లిదండ్రుల్నీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తన కొడుకు మానసిక స్థితి సరిగ్గా లేదని వాళ్లు పోలీసులకు వెల్లడించారు. మూడేళ్ల క్రితం కోల్‌కత్తాలోని అలిపోర్ జూలో సింహ ఎన్‌క్లోజర్‌లోకి దూకాడు గౌతమ్. ఆ సమయంలో తీవ్రంగా గాయపడ్డాడు. 14 అడుగుల ఎత్తైన గోడను ఎక్కి రెండు ఫెన్సింగ్‌లు దాటుకుని మరీ ఎన్‌క్లోజర్‌లోకి దూకాడు. సింహాన్ని చూడడానికి పాక్కుంటూ లోపలికి వెళ్లాడు. సింహం చేసిన దాడిలో గాయపడ్డాడు. సిబ్బంది అప్రమత్తమై అతడిని కాపాడింది.