RTC Driver, Conductor Attacked: అడిగిన చోట బస్సు ఆపనందుకు గురజాలలో ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్‌పై దాడి
పల్నాడు జిల్లా గుజరాలలో బస్సు నిలిపే విషయంలో వివాదం తలనెత్తి, ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్‌పై ఒక మహిళ ఆమె కుటుంబసభ్యులతో కలిసి దాడికి పాల్పడటంతో ఉద్రిక్తత నెలకొంది.

గురజాల: పల్నాడు జిల్లా గురజాల మండల పరిధిలోని మాడుగుల అడ్డరోడ్డు వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. రోడ్డుపై వెళ్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) బస్సును అడ్డగించి, డ్రైవర్, కండక్టర్‌పై ఒక మహిళ ఆమె కుటుంబ సభ్యులతో కలిసి భౌతిక దాడికి పాల్పడ్డారు. బస్సును నిలిపే విషయంలో ప్రయాణికురాలికి, ఆర్టీసీ సిబ్బందికి మధ్య తలనెత్తిన వివాదమే ఈ దాడికి కారణమని సమాచారం.
మాచర్ల వైపు వెళ్తున్న బస్సును మాడుగుల క్రాస్ రోడ్డు వద్ద ఆపాలని మహిళా ప్రయాణికురాలు కోరింది. అయితే డ్రైవర్ కొంచెం ముందుకు తీసుకెళ్లి ఆర్టీసీ బస్సును ఆపాడు. ఆమె బస్సు దిగి వెళ్లిపోయింది. తరువాత బస్సు మాచర్ల వెళ్లి వస్తుండగా తిరుగు ప్రయాణంలో ఆ మహిళా ప్రయాణికురాలు తన కుటుంబసభ్యులతో కలిసి బైకులను అడ్డగించి బస్సును నిలిపివేశారు. అనంతరం ఆర్టీసీ సిబ్బందిపై దాడి చేశారు. కోడిగుడ్లతో డ్రైవర్, కండక్టర్ పై దాడి చేయడంతో పాటు దూషించారు. తమపై జరిగిన దాడిని ఆర్టీసీ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. డ్యూటీలో ఉన్న తమపై మహిళా ప్రయాణికురాలు, ఆమె కుటుంబసభ్యులు దాడి చేశారని కండక్టర్ సోమయ్య గురజాల పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. బస్సుపై దాడి చేసి డ్యామేజ్ చేసేందుకు ప్రయత్నించారని సైతం ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.
ట్రెండింగ్ వార్తలు























