Annamayya Gurukul School Incident: చంపేస్తే బడికి సెలవు ఇస్తారని.. అర్ధరాత్రి రూమ్‌మేట్ గొంతు నులిమారు - ఈ పిల్లలు ఇలా తయారయ్యారేంటి? .. ఎక్కడో కాదు ఏపీలోనే!
Roommate Attack: అన్నమయ్య జిల్లా గ్యారంపల్లె గురుకులంలో దారుణం. బడికి సెలవు ఇస్తారని రూమ్‌మేట్‌ను చంపేందుకు యత్నించిన ఇద్దరు 8వ తరగతి విద్యార్థులు దొరికిపోయారు.

Gyarampalle School Student Murder Attempt: పాఠశాలకు సెలవు ఇస్తారనే చిన్న ఆశతో, తోటి విద్యార్థి ప్రాణాలనే తీసేందుకు ఇద్దరు మైనర్లు ఒడిగట్టిన నమ్మలేని దారుణ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. కేవలం బడికి సెలవు వస్తుందనే పిచ్చి ఆలోచనతో ఎనిమిదో తరగతి చదువుతున్న ఇద్దరు బాలురు.. తమతోనే ఒకే గదిలో ఉంటున్న రూమ్‌మేట్‌ను హత్య చేసేందుకు తెగబడ్డారు. గ్యారంపల్లెలోని ప్రభుత్వ గురుకుల పాఠశాల హాస్టల్‌లో అర్ధరాత్రి వేళ చోటుచేసుకున్న ఈ ఉదంతం విద్యాశాఖ అధికారులను, విద్యార్థుల తల్లిదండ్రులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
బాధితుడు, నిందితులు ముగ్గురూ గ్యారంపల్లె గురుకులంలో 8వ తరగతి చదువుతూ ఒకే రూమ్‌లో నివాసముంటున్నారు. పాఠశాలకు వెళ్లడం ఇష్టం లేని ఇద్దరు విద్యార్థులు, హాస్టల్‌లో ఎవరైనా విద్యార్థి చనిపోతే బడికి వారం రోజుల పాటు సెలవులు ప్రకటిస్తారనే తీవ్రమైన అపోహ పెంచుకున్నారు. ఈ ఆలోచనతోనే తమ రూమ్‌మేట్‌ను టార్గెట్ చేసుకుని, అతడు నిద్రిస్తున్న సమయంలో హత్య చేసి యాక్సిడెంట్‌గా లేదా సహజ మరణంగా చిత్రీకరించాలని పక్కా ప్లాన్ వేశారు.
అనుకున్న పథకం ప్రకారం అర్ధరాత్రి వేళ రూమ్‌మేట్ గాఢ నిద్రలో ఉండగా, ఇద్దరూ కలిసి అతని ముఖంపై దిండు గట్టిగా నొక్కి పట్టుకుని, గొంతు పిసికి చంపడానికి తీవ్రంగా ప్రయత్నించారు. అయితే ఊపిరాడక విలవిలలాడిన బాధితుడు సమయస్ఫూర్తితో, సర్వశక్తులూ ఒడ్డి వారి పిడికిలి నుంచి తప్పించుకుని గట్టిగా కేకలు వేశాడు. దీంతో భయాందోళనకు గురైన నిందితులు వెనక్కి తగ్గగా, బాధితుడు వెంటనే పరుగులు తీసి హాస్టల్ నిర్వాహకులకు, తోటి విద్యార్థులకు విషయం తెలిపాడు.
ఉదయాన్నే బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన గురుకుల పాఠశాల అధికారులు, ఉపాధ్యాయులు తీవ్ర స్థాయిలో విచారణ చేపట్టారు. విచారణలో ఆ ఇద్దరు బాలురు చెప్పిన కారణాలు విని అధికారులు షాక్‌కు గురయ్యారు. బడికి సెలవులు వస్తాయనే ఉద్దేశంతోనే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు నిందితులు ఒప్పుకోవడంతో.. వారిపై కఠిన చర్యలు తీసుకున్నారు. తోటి విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని, ఆ ఇద్దరు విద్యార్థులకు తక్షణమే ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ ఇచ్చి పాఠశాల నుంచి పంపించివేశారు.
ఈ ఘటనతో గురుకుల పాఠశాలల్లో మైనర్ల మానసిక స్థితి, వారి ప్రవర్తనపై తీవ్రమైన ఆందోళన వ్యక్తమవుతోంది. బడికి సెలవు కోసం తోటి ప్రాణాన్ని తీసే స్థాయికి చిన్నారి మనస్సులు విషపూరితం కావడంపై విద్యావేత్తలు, సైకాలజిస్టులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలల్లో కేవలం చదువు మాత్రమే కాకుండా.. మానసిక పరిపక్వత, మంచి-చెడుల స్పృహ పెంచేలా కౌన్సెలింగ్ సెషన్లు నిర్వహించాల్సిన అవసరం ఉందనడానికి ఈ ఉదంతం ఒక హెచ్చరికగా నిలిచింది.
ట్రెండింగ్ వార్తలు






















