Visakha News: కోరిన బ్రాండ్ ఇవ్వలేదని వైన్ షాపునకు నిప్పు - విశాఖలో మందుబాబు వీరంగం
Andhrapradesh News: తాను అడిగిన మద్యం బ్రాండ్ ఇవ్వలేదనే కోపంతో ఓ మందుబాబు ఏకంగా వైన్ షాపునకే నిప్పు పెట్టాడు. విశాఖలో ఈ ఘటన జరిగింది.
Wineshope Set on Fire in Visakha: విశాఖ నగరంలో ఆదివారం ఓ మందుబాబు వీరంగం సృష్టించాడు. తాను కోరిన బ్రాండ్ ఇవ్వలేదని ఏకంగా వైన్ షాపునకే నిప్పు పెట్టాడు. కొమ్మాది జంక్షన్ లో గల వైన్ షాపునకు ఆదివారం, సాయిరాం కాలనీకి చెందిన గుమ్మడి మధు ఫుల్లుగా మద్యం తాగి వచ్చాడు. దుకాణంలో లేని బ్రాండ్ అడగ్గా, సిబ్బంది లేదని చెప్పారు. దీంతో ఆగ్రహించిన మధు లీటర్ బాటిల్‌లో పెట్రోల్ తెచ్చి, వైన్‌షాప్‌లో పోసి నిప్పంటించాడు. దీంతో సిబ్బంది భయంతో పరుగులు తీశారు. స్థానికులు వెంటనే అప్రమత్తమై నిందితున్ని పట్టుకున్నారు. మంటలు ఆర్పేందుకు యత్నించినా ఫలితం లేకపోయింది. ఈ ఘటనలో దాదాపు రూ.2 లక్షల విలువైన మద్యం బాటిళ్లు, కంప్యూటర్, ప్రింటర్, స్కానర్, ఫ్రిజ్ కాలిపోయాయి. సమాచారం అందుకున్న పీఎం పాలెం పోలీసులు అక్కడికి చేరుకుని నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వాలంటీర్ హత్య
అటు, కడపలోని ఎల్ఐసీ ప్రధాన కార్యాలయంలో వాలంటీర్ దారుణ హత్య జరిగింది. కడప ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలోని 14వ డివిజన్ వాలంటీర్‌గా భవానీశంకర్ (37) పని చేస్తున్నాడు. దీంతో పాటు కడపలోని ఎల్‌ఐసీ కార్యాలయంలో డిజిటలైజేషన్ విభాగంలోనూ విధులు నిర్వర్తిస్తున్నాడు. భవానీ శంకర్‌కు అక్కడే పనిచేస్తున్న మల్లికార్జున్ మంచి స్నేహితుడు. ఇటీవల వివాహేతర సంబంధం విషయంలో ఇద్దరికీ గొడవలయ్యాయి. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం 9 గంటలకు భవానీ శంకర్‌కు మల్లికార్జున్ ఫోన్ చేసి ఎల్‌ఐసీ కార్యాలయానికి రమ్మని పిలిచాడు. అక్కడికి భవానీ శంకర్ చేరుకోగానే.. అప్పటికే తన వెంట తెచ్చుకున్న కత్తితో మెడపై దాడి చేయడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కడప డీఎస్పీ షరీఫ్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో స్థానికంగా ఆందోళన నెలకొంది.