Anantapuram Crime News: పద్మావతి ఎక్స్ ప్రెస్‌లో సీట్ కోసం గొడవ, వ్యక్తిని బయటకి తోసిన ప్రయాణికులు
Anantapuram Crime News: అనంతపురం గుత్తి రైల్వే జంక్షన్ లో దారుణం చోటు చేసుకుంది. పద్మావతి ఎక్స్ ప్రెస్ లో సీట్ కోసం జరిగిన గొడవలో ఓ వ్యక్తిని ప్రయాణికులు బయటకు తోసేశారు.
Anantapuram Crime News: రైలు, బస్సు వంటి వాటిల్లో సీట్ల కోసం గొడవలు జరుగుతుండడం మనం తరచూ చూస్తూనే ఉంటాం. కానీ అలా జరిగిన ఓ గొడవ వల్ల.. రైల్లో ఉండాల్సిన ప్రయాణికుడిని బయటకు తోసేశారు దుండగులు. అలా అని అతడు ఎవరితోనూ గొడవ పడలేదు. సీట్ కోసం గొడవ పడుతున్న వారిని ఆపేందుకు వెళ్లగా.. కోపోద్రిక్తులైన వాళ్లు అతడిని బయటకు తోసేశారు.
అసలేం జరిగిందంటే..?
అనంతపురం జిల్లా గుత్తి రైల్వే జంక్షన్ లో దారుణం చోటు చేసుుకుంది. రైల్లో సీట్ కోసం ఓ ఇద్దరు ప్రయాణికులు గొడవ పడ్డారు. అయితే సీట్ కోసం అంత గొడవ ఎందుకంటూ వారిని ఆపేందుకు వెళ్లాడో వ్యక్తి. అదే అతను చేసిన తప్పు అయింది. గొడవ ఆపేందుకు వెళ్తే.. కోపోద్రిక్తులైన వాళ్లు.. ఇతడిని నడుస్తున్న రైలు నుంచి తోసేశారు.
పద్మావతి ఎక్స్ ప్రెస్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు హటాహుటిన బాధితుడిని గుర్తించారు. అతడి వద్దకు వెళ్లి ఏమైందని ప్రశ్నించగా.. తనను మద్యం మత్తులో ఉన్న దుండగులు తోసేసినట్లు బాధితుడు చెప్పాడు.
గుత్తి ఆసుపత్రిలో చికిత్స అనంతరం మెరుగైన వైద్య చికిత్సల కోసం కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి బాధితుడిని తరలించారు వైద్యులు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాధితుడిని రైలు నుంచి బయటకు తోసేసిన వాళ్లను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.