Anantapur Crime: చికెన్ అడిగితే లేదన్నాడని వ్యక్తి దారుణ హత్య, అనంతపురంలో అమానుషం
Andhra Pradesh News: ఆదివారం రోజు కావడంతో ముక్క కచ్చితంగా కావాలనుకున్నాడు. తాను అడిగితే చికెన్ లేదన్నాడనే కోపంతో బండరాయితో కొట్టి హత్య చేసిన ఘటన అనంతపురంలో జరిగింది.
అనంతపురం: చికెన్ అడిగితే పెట్టలేదని ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశాడు యువకుడు. ఏంటి చికెన్ కోసం హత్య అనుకుంటున్నారా, అవును మీరు చదివింది, నిజమేనండి. అనంతపురం జిల్లా మురడి గ్రామంలో ఈ ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మురడి గ్రామంలోని ఆంజనేయస్వామి దేవాలయంలో గత 10 సంవత్సరాలుగా స్వీపర్ గా మురుడప్ప పనిచేస్తూ ఉండేవాడు. ఈరోజు ఆదివారం (జూన్ 16) అవడంతో దేవాలయంలో తన పని ముగించుకొని చికెన్ కొట్టుకు వెళ్లి చికెన్ తీసుకువచ్చాడు.
మురుడప్ప దేవాలయం పక్కన తన ఉంటున్న చోట చికెన్ వండటం మొదలుపెట్టాడు. అదే సమయంలో అదే గ్రామానికి చెందిన యేసు రాజు అనే యువకుడు మురుడప్ప దగ్గరకు వచ్చి తనకు కూడా చికెన్ పెట్టాలని అడగడంతో మొరిడప్ప లేదు అని చెప్పాడు. దీంతో ఆగ్రహించిన యేసు రాజు, మురుడప్పతో గొడవ పడ్డాడు. ఈ గొడవలో ఆంజనేయస్వామి దేవాలయంలో పనిచేస్తున్న మురిడప్ప తలపై ఏసు రాజు బండరాయితో కొట్టి, వెంటనే భయంతో అక్కడి నుంచి పరారయ్యాడు. అటుగా వెళుతున్న కొంతమంది మురుడప్ప కింద పడిపోవడం చూసి దగ్గరికి వచ్చి చూడగా.. అప్పటికే తీవ్ర రక్తస్రావం అయింది. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా.. అక్కడికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు విచారణ చేపట్టారు.