Anantapur Boy Kidnap: అప్పులు ఎక్కువయ్యానని బాలుడి కిడ్నాప్ కలకలం - 4 గంటల్లోనే ఛేదించిన పోలీసులకు హ్యాట్సాఫ్
Anantapur Boy Kidnap Case: బాలుడ్ని కిడ్నాప్ చేసిన నిందితుల ఆట కట్టించారు అనంతపురం పోలీసులు. కేవలం 4 గంటల వ్యవధిలో కిడ్నాపర్లను పట్టుకుని, బాలుడ్ని సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు.
మీ అబ్బాయిని కిడ్నాప్ చేశాం.. రూ. 50 లక్షలు ఇవ్వాలని కిడ్నాపర్ల డిమాండ్.. సీన్ కట్ చేస్తే 4 గంటల్లోనే పోలీసులు ఆ కిడ్నాప్ కేసును ఛేదించారు. హై అలెర్ట్ యాప్ ద్వారా జిల్లా వ్యాప్తంగా పోలీసులను ఎస్పీ అలర్ట్ చేశారు. తల్లిదండ్రులకు వారి కుమారుడ్ని సురక్షితంగా అప్పగించారు. ఈ కేసు వివరాలిలా ఉన్నాయి..
అనంతపురం జిల్లా కేంద్రం స్థానిక శారదానగర్ లో నివాసముంటున్న బట్టల దుకాణం యజమాని షేక్ బాబా వలి కొడుకు సూరజ్ (6) ను ఓ వ్యక్తి కిడ్నాప్ చేశాడు. బాలుడి తండ్రికి నిన్న సాయంత్రం 6:15 గంటల సమయంలో ఫోన్ కాల్ వచ్చింది. రూ. 50 లక్షలు ఇవ్వాలని లేకపోతే మీ కుమారుడ్ని చంపుతామని కిడ్నాపర్ ఫోన్ చేసి బెదిరించాడు. తాము డిమాండ్ చేసిన మొత్తం రూ. 50 లక్షలను ఒక్కడే టూవీలర్‌లో తీసుకురావాలని ఆ బాలుడి తండ్రికి మరోసారి ఫోన్ కాల్ చేసి వార్నింగ్ ఇచ్చారు. రాత్రి సుమారు 7 గంటల సమయంలో జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి ఐపీఎస్ దృష్టికి వెళ్లింది వెళ్లింది.
హై అలెర్ట్ యాప్ ద్వారా అలెర్ట్
6 ఏళ్ల బాలుడు సూరజ్ కిడ్నాప్ విషయం తెలియడంతో జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప కాగినెల్లి జిల్లాలోని పోలీసులను హై అలెర్ట్ యాప్ ద్వారా అలెర్ట్ చేసి వెహికల్ చెకింగ్ కు ఆదేశాలు జారీ చేశారు. అనంతపురం ఇంఛార్జ్, ట్రాఫిక్, తాడిపత్రి డీఎస్పీలు ఆర్ల శ్రీనివాసులు, ప్రసాదరెడ్డి, చైతన్యతో పాటు సీఐలు రవిశంకర్ రెడ్డి, కత్తి శ్రీనివాసులు, జాకీర్ హుస్సేన్... ఎస్సైలు కిరణ్ కుమార్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, వెంకటెశ్వర్లు ఆధ్వర్యంలో 10 ప్రత్యేక బృందాలు, 100 మంది సిబ్బంది తక్షణమే రంగంలోకి దిగి కిడ్నాప్ జాడ కోసం జల్లెడ పట్టారు
రాత్రి 11:30 గంటలకు దొరికేశారు
యాడికి పోలీసు స్టేషన్ పరిధిలోని ముప్పాల-వెంగన్నపల్లి మధ్యలోని పొలాల్లో ఉన్న కిడ్నాపర్లను నిన్న రాత్రి సుమారు 11:30 గంటల సమయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి చెరలో ఉన్న బాలుడిని సురక్షితంగా రక్షించారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. కిడ్నాపర్లను అనంతపురం నవోదవ కాలనీకి చెందిన షేక్ నభీరసూల్, లక్ష్మీకాంత్ గా గుర్తించారు. నిందితుల వద్ద నుంచి ఓ టూవీలర్, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
కిడ్నాపర్లుగా మారిన కార్మికులు
గ్రానైట్ బండలు పరిచే కార్మికులుగా పని చేస్తున్న షేక్ నభీరసూల్, లక్ష్మీకాంత్ అప్పులపాలయ్యారు. దాంతో కిడ్నాప్ చేసి అప్పులు తీర్చుకోవాలని భావించి మాస్టర్ ప్లాన్ వేశారు. కమలానగర్ లో స్టైల్ జెంట్స్ షో రూం నిర్వహిస్తున్న షేక్ బాబావలీతో నిందితుల్లో ఒకరైన లక్ష్మీకాంత్ గతంలో పని చేసేవాడు. ఈ క్రమంలో డబ్బు కోసం అతడి కుమారుడు సూరజ్‌ను కిడ్నాప్ చేసి షేక్ బాబావలీని డిమాండ్ చేయాలని కిడ్నాపర్లు భావించారు. స్నేహితులతో కలసి ఆడేందుకు వెళ్లిన సూరజ్‌ను పథకం ప్రకారం బైరవనగర్ లో కిడ్నాప్ చేసి టూవీలర్‌లో ఎత్తుకెళ్లి ముప్పాల- వెంగన్నపల్లి సమీప పొలాల్లో ఎట్టకేలకు నిందితులు పోలీసులకు చిక్కారు.
జిల్లా ఎస్పీ ఏమన్నారంటే..
బాలుడి కిడ్నాప్ కేసుపై జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి మాట్లాడుతూ.. కిడ్నాపర్ల చెర నుంచి బాలుడ్ని రక్షించేందుకు పోలీసులు తక్షణమే స్పందించి ఏకతాటిపైకి రావడంతో కిడ్నాప్ ఘటన సుఖాంతమయ్యింది. బాలుడ్ని కిడ్నాపర్ల చెర నుంచి రక్షించడంలో సహకరించిన పుప్పాల గ్రామస్తులను మరియు ప్రత్యేక బృందాలను, యాడికి పోలీసు సిబ్బంది భూపతిరాజు, రాము, రంగస్వామిలను ఎస్పీ అభినందించారు. తమ కుమారుడు సూరజ్‌ను సురక్షితంగా కాపాడి, తమకు అందజేసిన పోలీసులకు ఆ తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలియజేశారు.