Pushpa 2: పుష్ప 2 థియేటర్‌లో పెప్పర్ స్ప్రే కలకలం - అస్వస్థతకు గురైన ప్రేక్షకులు, ముంబయిలో అనూహ్య ఘటన
Mumbai News: ముంబయిలోని బాంద్రా థియేటర్‌లో గురువారం రాత్రి ఊహించని ఘటన ఎదురైంది. పుష్ప 2 ప్రదర్శితమవుతోన్న థియేటర్‌లో ఓ గుర్తు తెలియని వ్యక్తి పెప్పర్ స్ప్రే కొట్టాడు.
Pepper Sprayed In Pushpa 2 Theater In Mumbai: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కిన చిత్రం పుష్ప 2 (Pushpa 2). గురువారం ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. తాజాగా, ఈ చిత్రం ప్రదర్శితమవుతోన్న ఓ థియేటర్‌లో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తి పెప్పర్ స్ప్రే కొట్టడంతో కొందరు ప్రేక్షకులు అస్వస్థతకు గురయ్యారు. పోలీసులు, ప్రేక్షకులు తెలిపిన వివరాల ప్రకారం.. ముంబయి బాంద్రాలోని ఓ థియేటర్‌లో గురువారం రాత్రి సెకండ్ షో ప్రదర్శితమవుతోన్న సమయంలో ఓ దుండగుడు ఘాటైన పెప్పర్ స్ప్రే కొట్టాడు. దీంతో ప్రేక్షకులు దగ్గు, వాంతులతో ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలో గందరగోళం నెలకొనగా థియేటర్ యాజమాన్యం షో నిలిపేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
అక్కడికి చేరుకున్న పోలీసులు ప్రతీ ఒక్కరినీ తనిఖీలు చేశారు. ఇంటర్వెల్ సమయంలో బయటకు వెళ్లి తిరిగి లోపలికి వచ్చిన తర్వాత అందరికీ దగ్గు వచ్చినట్లు ప్రేక్షకులు తెలిపారు. కొందరికి వాంతులు వచ్చినట్లు చెప్పారు. ఘాటైన స్ప్రే కొట్టడంతోనే ఇలా జరిగినట్లు పేర్కొన్నారు. పోలీస్ తనిఖీల అనంతరం 20 నిమిషాలకు తిరిగి షో ప్రారంభమైంది. పోలీసులు దీనిపై విచారిస్తున్నారు.
సంధ్య థియేటర్ ఘటనపై NHRCకి ఫిర్యాదు
అటు, బుధవారం పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్‌లో సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు (NHRC) న్యాయవాది రవికుమార్ ఫిర్యాదు చేశారు. పోలీస్ యాక్ట్ కింద ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా బెనిఫిట్ షో ఏర్పాటు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కంప్లైంట్‌ను ఎన్‌హెచ్ఆర్‌సీ స్వీకరించింది. 'సంధ్య థియేటర్ యాజమాన్యం భద్రతా ఏర్పాట్లు పాటించకపోవడంతో పాటు రద్దీని నియంత్రించలేకపోయింది. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. తగిన ముందు జాగ్రత్తలు తీసుకోనందునే మహిళ మృతి చెందింది. నటుడు అల్లు అర్జున్‌తో పాటు సంబంధిత ప్రభుత్వాధికారులపైనా చర్యలు తీసుకోవాలి.' అని పేర్కొన్నారు.
అల్లు అర్జున్‌పై కేసు నమోదు
మరోవైపు, సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై అల్లు అర్జున్‌పై కేసు నమోదైంది. థియేటర్ యాజమాన్యం, సెక్యూరిటీ మేనేజర్‌పైనా కేసు నమోదు చేసినట్లు సెంట్రల్ జోన్ డీసీపీ అక్షాంశ్ యాదవ్ తెలిపారు. సెక్షన్ 105, 118 BNS యాక్ట్ ప్రకారం చిక్కడపల్లి పీఎస్‌లో కేసు నమోదు చేశారు. ప్రీమియర్ షో సందర్భంగా అల్లు అర్జున్ థియేటర్‌కు వస్తోన్న నేపథ్యంలో భద్రత విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు థియేటర్ యాజమాన్యంపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ వస్తున్నారన్న సమాచారాన్ని సరైన సమయంలో చెప్పకుండా బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించారని ఆయన టీంపై కూడా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అటు, తొక్కిసలాట ఘటనపై చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ విచారం వ్యక్తం చేసింది. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని స్పష్టం చేసింది.