YS Viveka Murder Case : వివేకా హత్య కేసులో అన్ని వేళ్లూ వైఎస్ అవినాష్ రెడ్డి వైపే ! ఈ సారి సంచలనం సృష్టిస్తున్న వాంగ్మూలం ఎవరిదో తెలుసా ?
వివేకా హత్య కేసులో అన్ని వేళ్లూ వైఎస్ అవినాష్ రెడ్డి వైపే చూపిస్తున్నాయి. మరో వైఎస్ సోదరుడు ఇచ్చిన వాంగ్మూలంలోనూ అదే చెప్పారు.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ తీసుకున్న వాంగ్మూలాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరో సోదరుడు వైఎస్ ప్రతాప్ రెడ్డి గత ఏడాది ఆగస్టులో సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలం వెలుగులోకి వచ్చింది. ఇందులో కీలక అంశాలున్నాయి. వైఎస్ వివేకా హత్య జరిగిన రోజు ఉదయం ఆరున్నర సమయంలో సోదరుడు వైఎస్ మనోహర్‌రెడ్డి ఫోన్ చేసి వివేకానందరెడ్డి గుండెపోటు, రక్తపు వాంతులతో మరణించాడని చెప్పారని.. వెంటనే తాను ఇంటికి వెళ్లానన్నారు. తాను వెళ్లే సరికి ఇంటి దగ్గర వైఎస్ మనోహర్‌రెడ్, బయట గార్డెన్‌లో వైఎస్ అవినాశ్‌రెడ్డి బెడ్ రూమ్‌లో కృష్ణారెడ్డి, డి.శంకర్‌రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి, ఇనయతుల్లా ఉన్నారని తెలిపారు.
రూమ్‌లో రక్తం ఉందని.. బాత్‌రూమ్‌లో వివేకానందరెడ్డి మృతదేహం ఉందని సీబీఐకి తెలిపారు. వివేకా మృతదేహంపై గాయాలు ఉండటంతో అనుమానం వచ్చిందని..కానీ అప్పటికే వైఎస్ అవినాశ్‌రెడ్డి, వైఎస్ మనోహర్‌రెడ్డి, వైఎస్ భాస్కర్‌రెడ్డి, డి.శంకర్‌రెడ్డి అందరికీ గుండెపోటుతోనే చనిపోయినట్లుర చెప్పేశారన్నారు. ఈ కారణంగా తన అభిప్రాయం అక్కడ ఎవరికీ చెప్పలేదని వైఎస్ ప్రతాప్ రెడ్డి సీబీఐ అధికారులకు తెలిపారు. పనిమనిషి బెడ్‌రూమ్ శుభ్రం చేస్తుండగా త్వరగా పని పూర్తి చేయాలని డి.శంకర్ రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి బలవంతం చేయడం చూశానన్నారు. సీఐ శంకరయ్య బెడ్‌రూంలోకి వచ్చిన సమయంలో సాక్ష్యాధారాలను తుడిపివేయవద్దని చెప్పినా వినిపించుకోలేదని వాంగ్మూలంలో తెలిపారు.
వైఎస్ భాస్కర్‌రెడ్డి, వైఎస్ మనోహర్‌రెడ్డిలు బెడ్‌రూమ్‌లో తిరుగుతుండగా చూశాను. నా కళ్ల ముందే ఆధారాలు చెరిపేస్తుంటే అక్కడ ఉండలేక మా ఇంటికి వెళ్లిపోయానని ప్రతాప్ రెడ్డి తెలిపారు. హత్య జరగడానికి వారం ముందు తన ఆఫీసుకు వచ్చారని.. కడప ఎంపీ టికెట్ షర్మిలకు లేదా ఆమె తల్లి విజయమ్మకు ఇవ్వాలని అనుకున్నట్లు ఆయన మాటలను బట్టి అర్థమైందని సీబీఐకి తెలిపారు. అవినాశ్ రెడ్డి తండ్రి ఎప్పుడూ వివేకానంద రెడ్డికి వ్యతిరేకంగానే ఉండేవారని ప్రతాప్ రెడ్డి స్పష్టం చేశారు. 2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాస్కర్ రెడ్డి, అవినాశ్ రెడ్డి, డి.శంకర్ రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి వల్లే ఓడిపోయానని వివేకానంద రెడ్డికి తెలిసిందని కూడా ప్రతాప్ రెడ్డి వివరించారు.
కేసు దర్యాప్తు ప్రారంభించినప్పటి నుండి సీబీఐ తీసుకున్న వాంగ్మూలాల్లో అత్యధిక వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డినే నిందితులుగా చూపిస్తున్నారు. ఈ వాంగ్మూలాలకు తోడు దస్తగిరి అప్రూవర్‌గా మారడంతో వైఎస్ అవినాష్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగుసుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. త్వరలో ఈ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది.