Adilabad Crime : డీజే సౌండ్ తగ్గించమనడమే తప్పైంది - పెళ్లి కొడుకు స్నేహితులు ఎంత పనిచేశారంటే?
Adilabad Crime : పెళ్లి బరాత్ డీజే సౌండ్ తగ్గించమన్నందుకు ఓ యువకుడి కొట్టి అతడి మృతికి కారణమయ్యారు పెళ్లి కొడుకు స్నేహితులు. ఈ ఘటనకు పాత కక్షలు కూడా కారణమంటున్నారు పోలీసులు.
Adilabad Crime : పెళ్లి బరాత్ డీజే సౌండ్(DJ Sound) తగ్గించమన్నందుకు ఓ వ్యక్తిని తీవ్రంగా కొట్టారు పెళ్లి కొడుకు స్నేహితులు. పాత కక్షలే ఈ గొడవకు కారణమని తెలుస్తోంది. తీవ్రంగా గాయపడ్డ వ్యక్తి మృతి చెందడంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. ఆదిలాబాద్ జిల్లా(Adilabad District) దిలావర్ పూర్ మండలం కాల్వ తండా గ్రామంలో బుధవారం సాయి అనే యువకుడి వివాహం జరిగింది. ఈ గ్రామానికే చెందిన నవీన్ కు సాయితో మనస్పర్థలు ఉన్నాయి. సాయి పెళ్లి బరాత్ నిర్వహించిన అతడి స్నేహితులు నవీన్ ఇంటి ముందుకు రాగానే డీజే సౌండ్ పెంచారు. దీంతో డీజే సౌండ్ తగ్గించాలని నవీన్ కోరారు. ఈ విషయంలో నవీన్ తో సాయి స్నేహితులు గొడవపడ్డారు. నవీన్ ను తీవ్రంగా కొట్టారు. తీవ్రంగా గాయపడిన నవీన్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనతో కాల్వ తండా గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
పాత కక్షలే కారణమా?
పెళ్లి కొడుకు సాయికి, నవీన్ కు పాత కక్షలు ఉన్నాయి. గతంలో వీరివురు పలుమార్లు గొడవ పడినట్లు గ్రామస్థులు తెలిపారు. బరాత్ లో డీజే సౌండ్ తగ్గించాలని నవీన్ కోరడంతో గొడవ మొదలైంది. పాత కక్షలను దృష్టిలో పెట్టుకున్న సాయి స్నేహితులు నవీన్ ను తీవ్రంగా కొట్టారు. ఈ దెబ్బలతో నవీన్ అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటన సమాచారం అందుకున్న పోలీసులు(Police) గ్రామంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నవీన్ మృతదేహాన్ని నిర్మల్ జిల్లా(Nirmal Distict) ఆస్పత్రికి తరలించారు. నవీన్ మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న బంధువులు విషాదంలో మునిగిపోయారు. నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతున్నారు.
బైక్ కొనివ్వలేదని తల్లినే హత్య చేసిన కొడుకు
బైక్ కోసం కొడుకు తల్లిని హత్య చేసిన ఘటన మెదక్ జిల్లా నిజాంపేట మండలం నార్లాపూర్ లో మంగళవారం జరిగింది. నిజాంపేట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నార్లాపూర్ గ్రామానికి చెందిన మిర్దొడ్డి పోచవ్వను చిన్న కుమారుడు కుమార్ బైక్ కొనుక్కోడానికి బంగారం, కమ్మలు ఇవ్వాలని అడిగాడు. అందుకు తల్లి తిరస్కరించడంతో ఆమె గొంతు నులిమి హత్య చేశాడు కుమారుడు. దర్యాప్తులో ఈ విషయం తేలిందని ఏఎస్ఐ తెలిపారు. మృతురాలి పెద్ద కుమారుడు నర్సింహులు ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనా స్థలానికి తుఫ్రాన్ పేట సీఐ శ్రీధర్, రామాయంపేట ఎస్సై రాజేష్ , క్లూస్ టీం పరిశీలించాయి. కేసుకు సంబంధించిన వివరాలు సేకరించాయి.