Hyderabad News: నగరంలో దారుణాలు - సాయం చేస్తామని నమ్మించి యువతిపై యువకుల అత్యాచారం, బాలికపై వృద్ధుడి అఘాయిత్యం
Telangana News: హైదరాబాద్ లో దారుణం జరిగింది. ఓ యువతికి సాయం చేస్తామని నమ్మించిన ఇద్దరు నిందితులు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.
Young Woman Abused by Two Accused: ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా మహిళలు, బాలికలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. తాజాగా, హైదరాబాద్ (Hyderabad) నగరంలో ఓ యువతిపై ఇద్దరు మృగాళ్లు అత్యాచారానికి పాల్పడ్డారు. సాయం చేస్తామని నమ్మించి ఆమెపై దారుణానికి పాల్పడ్డారు. ఈ ఘటన పాతబస్తీ బండ్లగూడ (Bandlaguda) పీఎస్ పరిధిలో శనివారం అర్ధరాత్రి తర్వాత చోటు చేసుకుంది. యువతి ఫిర్యాదుతో నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇన్ స్పెక్టర్ మహ్మద్ షాకీర్ వివరాలు వెల్లడించారు.
పూర్తి వివరాలివే
సూర్యాపేటకు చెందిన యువతి (21) తన తల్లి, సోదరునితో కలిసి ఇంట్లోనే ఉంటుంది. శనివారం తన సోదరునికి, ఆమెకు మధ్య ఏదో విషయమై గొడవ జరగ్గా, ఆమె కోపంతో బస్సు ఎక్కి హైదరాబాద్ వచ్చేసింది. శనివారం రాత్రి 10:40 గంటల ప్రాంతంలో ఎంజీబీఎస్ (MGBS)లో దిగింది. బయటకు వచ్చిన తర్వాత టీ తాగి అఫ్జల్ గంజ్ వైపు నడుచుకుంటూ వస్తుండగా, ఆమెను గౌస్ నగర్ కు చెందిన శ్రీకాంత్ (22), అఫ్జల్ గంజ్ కు చెందిన కాశీ విశ్వనాథ్ (32) బైక్ పై వెంబడించారు. యువతి దగ్గరకు వెళ్లి ఎక్కడకు వెళ్లాలని అడగ్గా, ఆమె పోలీస్ స్టేషన్ కు అని చెప్పింది. తాము అటే వెళ్తున్నామని నమ్మబలికి ఆమెను బైక్ ఎక్కించుకున్నారు. వారిని నమ్మి బైక్ ఎక్కిన యువతిని కొద్ది దూరం వెళ్లాక ఓ పార్లర్ వద్ద ఆపి ఐస్ క్రీం తినిపించి తమపై మరింత నమ్మకం కలిగేలా చేశారు. తర్వాత ఆమెను నేరుగా బండ్లగూడ పీఎస్ పరిధిలోని లేక్ వ్యూ హిల్స్ సమీపంలోని ఓ స్క్రాప్ గొడౌన్ లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. అక్కడి నుంచి మరో చోటుకి ఆమెను తరలించేందుకు యత్నిస్తుండగా.. బాధితురాలు కేకలు వేసింది. స్థానికులు గమనించడంతో నిందితులు ఆమెను వదిలి పరారయ్యారు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు బాధితురాలి నుంచి వివరాలు సేకరించారు. యువతిపై అఘాయిత్యం జరిగిన గొడౌన్ ను పరిశీలించారు. ఇది శ్రీకాంత్ ది అని స్థానికులు పోలీసులకు చెప్పగా.. వారు వెంటనే నిందితున్ని పట్టుకున్నారు. అతను ఇచ్చిన సమాచారంతో కాశీ విశ్వనాథ్ ను అదుపులోకి తీసుకున్నారు. ఇరువురిని విచారించగా నేరం చేసినట్లు అంగీకరించారని పోలీసులు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
ఉప్పల్ లో బాలికపై
అటు, ఉప్పల్ (Uppal) లో 16 ఏళ్ల బాలికపై ఓ వృద్ధుడు అత్యాచారానికి పాల్పడ్డ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 3న ఉప్పల్ బస్టాప్ వద్ద బస్ కోసం ఎదురుచూస్తున్న బాలికకు, సాదక్ అనే వృద్ధుడు మాయమాటలు చెప్పి తనతో తీసుకెళ్లాడు. అనంతరం ఓ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అఘాయిత్యానికి ఒడిగట్టాడు. అనంతరం బాలికను అక్కడే వదిలేసి పరారయ్యాడు. ఇంటికి చేరుకున్న బాలిక తల్లికి విషయం చెప్పగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా వృద్ధున్ని (60) నిందితుడిగా గుర్తించి అరెస్ట్ చేశారు. కాగా, పాతబస్తీకి చెందిన నిందితుడు ఉప్పల్ బస్టాండు ప్రాంతంలో పని చేస్తున్నాడు. నిందితున్ని రిమాండుకు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
Also Read: Kidnap Case: ప్రైవేట్ ఉద్యోగి కిడ్నాప్ - కిడ్నాపర్ల ముఠాతో కలిసి సోదరి స్కెచ్, నిందితుల అరెస్ట్