Crime New: మగ బిడ్డ కోసం రెండో పెళ్లి చేసుకున్నాడు- బిడ్డ పుట్టాక ఫ్యామిలీ ఒకరు తగ్గిపోయారు
మగ బిడ్డ కోసం రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆస్తి కూడా రాసిస్తా అన్నాడు. మగ బిడ్డ పుట్టాక మైండ్ మార్చుకున్నాడు. అంతే ఫ్యామిలీలో ఒకరు తగ్గిపోయారు.
రంగారెడ్డి జిల్లా కొత్తూరులో జరిగిందీ సంఘటన. లోక్యాతండాకు చెందిన కెతావత్ శ్రీనివాస్ మంజులకు ముగ్గురు ఆడపిల్లలు. మగ సంతానం లేరని ఇకపై కలగబోరని శ్రీనివాస్ రెండ పెళ్లి చేసుకున్నాడు. చింతగట్టు తండాకు చెందిన సాలీ అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు. మూడేళ్లు కాపురం బాగానే నడిచింది. ఈ దంపతులకు ఓ బాబు పుట్టాడు.
బుధవారం సాలీ తండ్రి తన కుమార్తెను చూసేందుకు శ్రీనివాస్ ఇంటికి వెళ్లాడు. అక్కడ ఎవరూ లేకపోయేసరికి తిరిగి వస్తుండగా... ఊరి చివర జనాన్ని చూశాడు. ఏదో జరిగిందని గ్రహించి అక్కడికి వెళ్లి చూస్తే షాక్ తిన్నాడు. తన అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమార్తె డెడ్‌బాడీ చూసి షాక్ అయ్యాడు.
ఎకరా భూమి సాలీ పేరును రాసిస్తానని పెళ్లి టైంలో చెప్పాడు శ్రీనివాస్. ఈ విషయంలో తరచూ గొడవలు జరుగుతుండేవీ. ఈ మధ్య ఆ వివాదం ఇంకాస్త ముదిరింది. దీనిపై భర్తతో గొడవ పెట్టుకున్న భార్య సాలీ.. పుట్టింటికి వెళ్లిపోయింది. అలిగి పుట్టింటికి వెళ్లిపోయిన భార్యను బతిమిలాడి ఇంటికి తీసుకొచ్చాడు భర్త శ్రీనివాస్.
ఒక రోజు గడిచిన తర్వాత మళ్లీ గొడవ జరిగింది. దీంతో సాలీ వల్ల ఫ్యామిలీలో ప్రశాంతత లేదని భావించారు శ్రీనివాస్, మొదటి భార్య మంజుల. ఆమె అడ్డు తొలగిస్తే అంతా సర్దుకుంటుందని ప్లాన్ చేశారు. 19 వ తేదీ వీళ్లిద్దరూ కలిసి సాలీ ప్రాణం తీశారు. గొంతు నులిమి హత్య చేశారు. అనంతరం డెడ్‌బాడీని చెరువులో పడేశారు.
హత్య చేసిన తర్వాత పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయారు. ఈ హత్య విషయం తెలుసుకున్న సాలి బంధువులు ఆగ్రహంతో ఊగిపోయారు. తమ బిడ్డ ప్రాణాలు తీసిన వాళ్ల ప్రాణాలు తీస్తామని శపథం చేశారు. శ్రీనివాస్ ఇంటిపై దాడి చేశారు. న్యాయం జరిగే వరకు డెడ్‌బాడీ తీసేందుకు వీల్లేదని డిమాండ్ చేశారు.
వివాదం మరింత ముదురుతుండటంతో నిందితులను కొత్తూరు నుంచి శంషాబాద్ తీసుకెళ్లి అక్కడి పెద్దల సమక్షంలో ఆస్తి పంపకాలు జరిగినట్టు తెలుస్తోంది. దీంతో డెడ్‌బాడీ తీసేందుకు బంధువులు అంగీకరించారని గ్రామస్థులు చెబుతున్నారు.
ఈ విషయం తెలిసిన గ్రామస్థులు ఒక్కసారిగా షాక్ తిన్నారు. ఓ తల్లి మృతి చెందడం... మరో తల్లీ తండ్రీ హంతకులుగా మిగలడంతో నలుగురు పిల్లలు అనాథులుగా మిగిలారు. వాళ్ల పరిస్థితి చూసిన బంధువులు తీవ్ర విషాధంలో కూరుకుపోయారు.
కేసులో దర్యాప్తు సాగుతుందని పోలీసులు చెబుతున్నారు. ఇంకా మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు.