Zerodha: బ్యాంక్ ప్రారంభించబోతున్న జీరోధ - కామత్ సోదరుల ప్లాన్ ఇంకా ఉంది
Zerodha Bank License: బ్యాంకు లైసెన్స్ కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు నితిన్ కామత్ చెప్పారు. దీంతోపాటు, పబ్లిక్ ఇన్వెస్ట్‌మెంట్, ఇన్సూరెన్స్ రంగంలోనూ ఈ కంపెనీ అవకాశాలను అన్వేషిస్తోంది.
Nikhil Kamath and Nithin Kamath: ఆన్‌లైన్ షేర్ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్ జీరోధ (Zerodha), మరో కొత్త ప్లాన్‌లో ఉంది. జీరోధను బ్యాంక్‌గా మార్చడానికి కామత్ సోదరులు కష్టపడుతున్నారు. ఈ విషయాన్ని నితిన్ కామత్ స్వయంగా వెల్లడించారు.
ఆన్‌లైన్ షేర్ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్ జీరోధ, తన అరంగేట్రంతోనే సంచలనం సృష్టించింది. డీమ్యాట్ ఖాతాలు తెరవడం, ట్రేడింగ్ చేయడం వంటి పనుల్లో అప్పటి వరకు ఉన్న అతి పెద్ద తలనొప్పులను పటాపంచలు చేసింది. ఆన్‌లైన్‌లో, నిమిషాల వ్యవధిలోనే డీమ్యాట్ ఖాతా ఓపెన్ చేసే ఫెసిలిటీతో ఆకట్టుకుంది. తన ఫ్లాట్‌ఫామ్ ద్వారా ఉచితంగా ట్రేడింగ్, ఇన్వెస్ట్‌మెంట్ చేసేందుకు ఖాతాదార్లను అనుమతించి (జీరో ఫీజ్), సంప్రదాయ బ్రోకర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది. కస్టమర్ ఫ్రెండ్లీ యాప్ ద్వారా కోట్లాది మంది ఖాతాదార్లను సంపాదించుకుని, దేశంలోని లీడింగ్ యాప్స్‌లో ఒకటిగా నిలిచింది. జీరోధ వ్యవస్థాపకులు నిఖిల్ కామత్ (Nikhil Kamath), నితిన్ కామత్ (Nithin Kamath) సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. వాళ్ల యాక్టివ్‌నెస్ వల్ల కూడా సంవత్సరాలుగా ఈ కంపెనీ పాపులారిటీ స్థిరంగా పెరుగుతూనే ఉంది. ఇప్పుడు, ఈ కంపెనీ తదుపరి లక్ష్యం దిశగా అడుగులు వేస్తోంది. కామత్ బ్రదర్స్ జీరోధాను బ్యాంక్‌గా మార్చే ఆలోచనలో ఉన్నారు.
బ్యాంకు లైసెన్స్ కోసం ఎన్నో ఏళ్లుగా ప్రయత్నం
స్టాక్ బ్రోకింగ్ కంపెనీ 'గ్రో' (Groww) తర్వాత, స్టాక్ బ్రోకింగ్ మార్కెట్‌లో, భారత్‌లో రెండో అతి పెద్ద కంపెనీ జీరోధ. 'గ్రో' కంపెనీకి 25.1 శాతం మార్కెట్ వాటా ఉంటే, జీరోధకు 17 శాతం మార్కెట్ వాటా (Zerodha market share) ఉంది. జీరోధను బ్యాంక్‌గా మార్చేందుకు సీరియస్‌గా ప్రయత్నాలు చేస్తున్నట్లు నిఖిల్ కామత్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. వాస్తవానికి, జీరోధను బ్యాంక్‌గా మార్చాలన్నది ఇప్పటి ప్లాన్ కాదు, ఏళ్ల తరబడి ప్రయత్నిస్తున్నారు. అయితే, ఆ విషయంలో ఇప్పటికీ విజయం సాధించలేకపోయారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా జీరోధకు రిజర్వ్ బ్యాంక్ (RBI) నుంచి బ్యాంకు లైసెన్స్ పొందలేకపోయింది.
2023-24 ఆర్థిక సంవత్సరంలో (FY24) జీరోధ నికరలాభం 62 శాతం పెరిగి రూ.4700 కోట్లకు చేరుకోగా, ఆదాయం 21 శాతం పెరిగి రూ.8320 కోట్లకు చేరుకుంది. ఇంత డబ్బు ఏం చేసుకుంటామంటూ నిఖిల్ కామత్ CNBC TV 18కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. చేసింది చాలని చెప్పి తాము కూర్చుని విశ్రాంతి తీసుకోవాలనుకోవడం లేదని, బ్యాంక్‌గా మారాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. అయితే, ఆ లక్ష్యాన్ని చేరడంలో సంవత్సరాలుగా విజయం సాధించలేకపోతున్నామని అన్నారు. తమ ప్రయత్నాన్ని "డేవిడ్ వర్సెస్ గోలియత్" కథతో నిఖిల్ కామత్ పోల్చారు. తాము శరవేగంగా పురోగమిస్తున్నామని, అయితే ఆర్థిక రంగంలో పెద్ద కంపెనీలతో పోటీ పడాల్సి ఉందన్నారు. ఆ కంపెనీల దగ్గర చాలా డబ్బు, వనరులు ఉన్నాయని, అదే సమయంలో తాము ఒక చిన్న జట్టుతో ముందుకు సాగుతున్నట్లు వెల్లడించారు.
పబ్లిక్ మార్కెట్‌లో పెట్టుబడులు - బీమా రంగంలో అవకాశాలు
నిరంతరం మారుతున్న సెబీ (SEBI) నిబంధనలే తమకు మరో పెద్ద సమస్య జెరోధా సీఈవో చెప్పారు. F&O (ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్)కి సంబంధించి సెబీ కొత్త నిబంధనలు నవంబర్‌లో అమల్లోకి రానున్నాయి. ఇవి కంపెనీ మొత్తం వ్యాపారంపై 30 శాతం, F&O వ్యాపారంపై 60 శాతం ప్రభావం చూపుతాయి. అయినప్పటికీ రెగ్యులేటరీ నిబంధనలకు కట్టుబడి ఉన్నామని నితిన్ కామత్ చెప్పారు. తమ వ్యాపారాన్ని వివిధ రంగాలకు విస్తరించాలనుంకుటున్నామని, బ్యాంకింగ్ లైసెన్స్ పొందడానికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నట్లు వివరించారు. ఇది మాత్రమే కాకుండా, పబ్లిక్ మార్కెట్‌లో పెట్టుబడులు, బీమా రంగంలోనూ అవకాశాలను అన్వేషిస్తున్నట్లు కామత్ చెప్పారు.
మరో ఆసక్తికర కథనం: టాప్ కంపెనీల్లోకి యవతకు రెడ్ కార్పెట్ - పీఎం ఇంటర్న్‌షిప్ స్కీమ్‌లో 90 వేలకు పైగా అవకాశాలు