Share Buyback: ₹12,000 కోట్లతో విప్రో షేర్ల బైబ్యాక్, ఒక్కో షేరుకు ₹71 లాభం
పెట్టుబడిదార్లు బైబ్యాక్‌లో తమ షేర్లను సరెండర్ చేయడం ద్వారా ఒక్కో షేరుకు 18 శాతం లేదా రూ. 70.5 లాభం పొందుతారు.
Wipro Q4 Results: 2022-23 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక ఫలితాల ప్రకటనతో పాటు, షేర్ల బైబ్యాక్‌కు విప్రో డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది. రూ. 12,000 కోట్ల విలువకు సమానమైన షేర్లను ఈ ఐటీ మేజర్ బైబ్యాక్ చేస్తుంది. ఒక్కో షేరును రూ. 445 ధర వద్ద తిరిగి కొనుగోలు చేయనున్నట్లు కంపెనీ వెల్లడించింది.
నిన్న (గురువారం, 28 ఏప్రిల్ 2023), BSEలో, రూ. 374.50 వద్ద విప్రో షేర్ ముగిసింది. ఈ స్థాయితో పోలిస్తే, పెట్టుబడిదార్లు బైబ్యాక్‌లో తమ షేర్లను సరెండర్ చేయడం ద్వారా ఒక్కో షేరుకు 18 శాతం లేదా రూ. 70.5 లాభం పొందుతారు.
27 కోట్ల షేర్లు బైబ్యాక్
దాదాపు 27 కోట్ల (26,96,62,921) షేర్లను మార్కెట్ నుంచి తిరిగి కొనుగోలు చేయాలని బోర్డు సమావేశంలో డైరెక్టర్లు నిర్ణయించారు. ఇది, కంపెనీ పెయిడప్ ఈక్విటీ షేర్లలో 4.91 శాతానికి సమానం.
టెండర్ రూట్‌లో షేర్ బైబ్యాక్
బైబ్యాక్‌ను టెండర్ మార్గంలో నిర్వహించాలని కంపెనీ నిర్ణయించింది. అంటే, విప్రో షేర్‌హోల్డర్లు తమ వాటాలను కంపెనీకి ఆఫర్ చేయాలి. ఇలా, టెండర్ రూట్‌లో వచ్చిన మొత్తం షేర్లను బట్టి, ఒక్కో షేర్‌హోల్డర్ నుంచి ఎంత శాతం షేర్లు కొనుగోలు చేయాలో కంపెనీ నిర్ణయిస్తుంది. బైబ్యాక్ ప్రక్రియ, రికార్డ్ తేదీ, టైమ్‌లైన్ సహా ఇతర వివరాలను విప్రో త్వరలోనే ప్రకటిస్తుంది.
విప్రో కంపెనీ ప్రమోటర్లు కూడా బైబ్యాక్‌లో పాల్గొనేందుకు సుముఖత వ్యక్తం చేశారు. అయితే, పోస్టల్ బ్యాలెట్ ద్వారా జరిగే వాటాదారుల ఆమోదంపై ఇది ఆధారపడి ఉంటుంది. కంపెనీ ప్రమోటర్లకు ప్రస్తుతం 72.92 శాతం వాటా ఉంది. కంపెనీలు విదేశీ ఇన్వెస్టర్లు (FIIలు) 6.42 శాతం, మ్యూచువల్ ఫండ్ మేనేజర్లు (DIIలు) 2.74 శాతం కలిగి ఉన్నారు.
విప్రో స్టాక్ చాలా కాలంగా స్వల్ప పరిధిలోనే ట్రేడవుతోంది. ఈ షేరు గత ఒక ఏడాది కాలంలో 28 శాతం, రెండేళ్లలో 21 శాతం పడిపోయింది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు (YTD) దాదాపు 5 శాతం నష్టపోయింది. విప్రో స్టాక్‌పై ఇన్వెస్టర్లు చాలాకాలంగా ఉదాసీనత ప్రదర్శిస్తున్నారు. దీంతో, సెంటిమెంట్‌ను మెరుగుపరచడానికి, ఇన్వెస్టర్లలో ఉత్సాహం నింపడానికి షేర్లను తిరిగి కొనుగోలు చేయాలని ఈ ఐటీ కంపెనీ నిర్ణయించింది.
చివరిసారిగా, 2020 నవంబర్‌లో షేర్ బైబ్యాక్ స్కీమ్‌తో ముందుకు వచ్చింది విప్రో. అప్పుడు, రూ. 400 ధర వద్ద రూ. 9,156 కోట్ల విలువైన 22.89 కోట్ల షేర్లను కొనుగోలు చేసింది. అంతకుముందు, 2019లో, ఒక్కో షేరుకు రూ. 325 చొప్పున రూ. 10,500 కోట్ల విలువైన షేర్లను బైబ్యాక్ చేసింది.
మార్చి త్రైమాసికం ఫలితాలు
2022-23 మార్చి త్రైమాసికంలో రూ. 3075 కోట్ల నికర లాభాన్ని విప్రో ప్రకటించింది. అంతకుముందు సంవత్సరం ఇదే కాలంలోని లాభం రూ. 3,087.3 కోట్లతో పోలిస్తే ఇది 0.4% తక్కువ. ఆదాయం 11.17% వృద్ధితో రూ. 23,190.3 కోట్లకు పెరిగింది. 2022-23 పూర్తి ఆర్థిక సంవత్సరంలో లాభం 7.1% తగ్గి రూ. 11,350 కోట్లకు పరిమితమైంది. ఇదే కాలంలో ఆదాయం 14.4% వృద్ధితో రూ. 90,487.6 కోట్లకు చేరింది.
డిసెంబరు త్రైమాసికంతో పోలిస్తే, మార్చిలో సిబ్బంది వలసలు (అట్రిషన్) 330 bps తగ్గి 14.1 శాతానికి పరిమితమైంది. డిసెంబరు త్రైమాసికంలో కంపెనీలో ఉద్యోగుల మొత్తం సంఖ్య 2,58,744గా ఉండగా... మార్చి చివరి నాటికి 1,823 తగ్గి 2,56,921కి పరిమితమైంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.