LPG Rates: బడ్జెట్ ముందు తెరపైకి గ్యాస్ సిలిండర్లు - త్వరలో రేట్లు మారతాయా?
Budget 2024: చమురు మార్కెటింగ్ కంపెనీలు పంపిణీ చేస్తున్న మొత్తం గ్యాస్‌లో గృహ వినియోగ సిలిండర్లదే దాదాపు 90% వాటా. గ్యాస్ ధరలపై బడ్జెట్ ముుందు కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
LPG Prices: మోదీ 3.0 ప్రభుత్వంలో తొలి & పూర్తిస్థాయి పద్దుకు సమయం దగ్గర పడుతోంది. ఈ నెల మూడో వారంలో, ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ (Finance Minister Nirmala Sitharaman), పూర్తి స్థాయి కేంద్ర బడ్జెట్‌ను (Union Budget 2024) ప్రకటిస్తారు. ఆమె ప్రకటన కోసం దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు ఎదురుచూస్తున్నారు. 2024 పూర్తి స్థాయి బడ్జెట్‌లో కొన్ని ఉపశమనాలు, వరాలు ఉంటాయని భావిస్తున్నారు. ఆదాయపు పన్ను, పొదుపులు, పెట్టుబడులు, రుణాలకు సంబంధించిన కీలక మార్పులు ఉండొచ్చని లెక్కలు కడుతున్నారు.
బడ్జెట్ ముందు రేట్ల సవరణ
ఈ ఏడాది ఫిబ్రవరిలో, నిర్మల మేడమ్ మధ్యంతర పద్దుకు కొన్ని గంటల ముందు, చమురు మార్కెటింగ్ కంపెనీలు (OMCs) LPG రేట్లను సవరించాయి. 19 కేజీల సిలిండర్ ధరను రూ. 12 నుంచి రూ. 18 వరకు పెంచాయి. ఈసారి కూడా అలాంటిదే ఏదైనా జరగొచ్చని మార్కెట్ వర్గాలు అనుమానిస్తున్నాయి. ప్రస్తుత రేట్లు ఎక్కువగా/తక్కువగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం భావిస్తే, గ్యాస్ సిలిండర్లపై బడ్జెట్ ముందే ఒక నిర్ణయం ఉంటుందని అంచనా వేస్తున్నాయి.
2024 ప్రారంభం నుంచి ఇప్పటి వరకు, 19 కిలోల కమర్షియల్ ఎల్‌పీజీ ధరల్లో చాలా మార్పు వచ్చింది. వాస్తవానికి, ప్రతి నెల 01వ తేదీన ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు గ్యాస్ ధరలను సమీక్షించి కొత్త రేట్లు ప్రకటిస్తాయి. ఈ నెల ప్రారంభంలోనూ, దేశంలో కమర్షియల్ వంట గ్యాస్ ధరను ఒక్కో సిలిండర్‌కు రూ. 30 నుంచి రూ. 31 వరకు తగ్గించాయి. దీనికి ముందు మూడు నెలల్లోనూ రేట్లు తగ్గాయి. అయితే... ఇళ్లలో వంటకు వినియోగించే 14.2 కిలోలు, 5 కిలోల సిలిండర్ ధరలను మాత్రం కొన్ని నెలలుగా తగ్గించలేదు. చివరిసారిగా, 14.2 కిలోల సిలిండర్ ధరలను ఈ ఏడాది మార్చి 9న సవరించారు. అప్పటి నుంచి సామాన్య ప్రజలపై కరుణ చూపలేదు.
LPG సిలిండర్ కొత్త ధరలు:
19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర (19 KGs Commercial LPG Cylinder Price):
దేశంలోని మెట్రో నగరాలను పరిశీలిస్తే... దిల్లీలో 19 కిలోల సిలిండర్ ధర (రూ.30 తగ్గింపు తర్వాత) రూ.1646 గా ఉంది. కోల్‌కతాలో రూ. 31 తగ్గి రూ. 1756 కు చేరింది. ఆర్థిక రాజధాని ముంబైలో 19 కేజీల సిలిండర్ కొత్త ధర రూ. 1598 కు దిగి వచ్చింది. చెన్నైలో కమర్షియల్ సిలిండర్ కోసం అక్కడి ప్రజలు ఈ నెల నుంచి రూ. 1809.50 చెల్లిస్తున్నారు.
14.2 కేజీల గృహ వినియోగ సిలిండర్ ధర (14.2 KGs Domestic LPG Cylinder Price):
దేశ రాజధాని దిల్లీలో 14.2 కిలోల గృహావసర LPG సిలిండర్ రేటు జులై 1 నుంచి రూ.803 గా కొనసాగుతోంది. భారతదేశ ఆర్థిక కేంద్రం ముంబైలో రూ. 802.50, కోల్‌కతాలో రూ. 829, చెన్నైలో రూ. 818.50 కు LPG డొమెస్టిక్ సిలిండర్ లభిస్తోంది.
తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే... హైదరాబాద్‌లో 14.2 కిలోల సిలిండర్ ధర (14 KGs Gas Cylinder Price In Hyderabad) ఈ ఏడాది మార్చి నుంచి రూ. 855గా ఉంది. ఇదే సిలిండర్ ధర విజయవాడలో (14 KGs Gas Cylinder Price In Vijayawada) రూ. 855 గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని నగరాలు, పట్టణాల్లో దాదాపుగా ఇదే రేటు వర్తిస్తుంది.
ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు 7 రకాల పరిమాణాల్లో LPG సిలిండర్లను పంపిణీ చేస్తున్నాయి. వీటిలో.. 5 కిలోలు, 14.2 కిలోల సిలిండర్లు ఎక్కువగా గృహ వినియోగం కోసం ఉపయోగిస్తున్నారు. కొన్నాళ్ల క్రితం లాంచ్ చేసిన 5 కిలోలు, 10 కిలోల సిలిండర్లను ఫైబర్ మిశ్రమంతో తయారు చేశారు. గృహ వినియోగం కోసమే వీటిని రూపొందించారు. ఇవి కాకుండా... 19 కిలోలు, 47.5 కిలోలు, 425 కిలోల జంబో సిలిండర్లు పారిశ్రామిక & వాణిజ్య వినియోగం కోసం కేటాయించారు.
మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్, డీజిల్ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి