Cyrus Mistry Profile: మిస్త్రీ అంటే యంగ్ & డైనమిక్! విజన్ ఉన్నా మిషన్ పరంగా టాటాతో విభేదాలు!!
Cyrus Mistry Demise: చిన్న వయసులోనే వ్యాపార ప్రపంచంలో అడుగుపెట్టారు. అనుకోని సవాళ్లు ఎన్నింటినో అలవోకగా అధిగమించారు. తన తెలివితేటలు, నైపుణ్యాలు, చాకచక్యంతో ఉద్దండుల ప్రశంసలు అందుకున్నారు. ఆయనే సైరస్ మిస్త్రీ!
Cyrus Mistry Profile: చిన్న వయసులోనే ఆయన వ్యాపార ప్రపంచంలో అడుగుపెట్టారు. అనుకోని సవాళ్లు ఎన్నింటినో అలవోకగా అధిగమించారు. తన తెలివితేటలు, నైపుణ్యాలు, చాకచక్యంతో ఉద్దండుల ప్రశంసలు అందుకున్నారు. తన దార్శనికతతో అందరినీ ఫిదా చేశారు. భవిష్యత్తు మార్గదర్శకుడిగా ఏకంగా టాటా గ్రూప్ ఛైర్మన్ పదవి చేపట్టారు. అనూహ్యంగా ఆ బాధ్యతల నుంచి తప్పుకోవాల్సి వచ్చినా వెరవలేదు. న్యాయపోరాటానికి దిగారు. ఆయనే సైరస్ మిస్త్రీ!
కలిచివేసిన హఠాన్మరణం
సైరస్ మిస్త్రీ ఆదివారం రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారని తెలియడంతో వ్యాపార ప్రపంచం ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది. ముంబయి సమీపంలోని పాల్ఘడ్‌లో ఆయన కారు ప్రమాదానికి గురైంది వెంటనే ఆయన్ను ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. మరణించారని వైద్యులు ధ్రువీకరించారు. అకాల మరణంతో ఈ లోకాన్ని వీడి వెళ్లిపోయిన మిస్త్రీ, ఆయన దార్శనికతను వ్యాపార ప్రపంచం కన్నీటితో తలుచుకుంటోంది.
లండన్‌లోనే విద్యాభ్యాసం
ముంబయిలోని పార్సీ కుటుంబంలో సైరస్ మిస్త్రీ జన్మించారు. పారిశ్రామికవేత్త పల్లోంజీ మిస్త్రీ చిన్న కుమారుడు ఆయన. నగరంలోని కేథడ్రల్, జాన్ కానన్ స్కూల్లో విద్యాభ్యాసం చేశారు. 1990 లో లండన్ విశ్వవిద్యాలయం నుంచి సివిల్ ఇంజనీరింగ్‌లో పట్టభద్రుడయ్యారు. 1996 లండన్ బిజినెస్ స్కూల్లో వ్యాపార విద్య అభ్యసించారు. సైరస్ మిస్త్రీ భార్య పేరు రోహికా చాగ్లా. వీరికి ఇద్దరు కుమారులు ఫిరోజ్ మిస్త్రీ, జహాన్ మిస్త్రీ.
చిన్న వయసులోనే టాటాసన్స్ ఛైర్మన్
సైరస్ మిస్త్రీ 2006లో టాటా గ్రూప్‌లో సభ్యుడిగా చేరారు. 2013లో 43 ఏళ్ల వయసులో టాటా గ్రూప్‌నకు చైర్మన్‌గా ఎంపికయ్యారు. 2016లో టాటా గ్రూప్ ఛైర్మన్ పదవి నుంచి ఆయన్ను తప్పించారు. టాటాల విశ్వసనీయతకు విరుద్ధంగా నష్టాల్లో ఉన్న విదేశీ కంపెనీల్లో వాటాలను విక్రయించారని ఆయనపై ఆరోపణలు వచ్చాయి. సైరస్ మిస్త్రీ, టాటా గ్రూపు మధ్య వివాదం కోర్టుకు చేరడం సంచలనంగా మారింది. షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్‌గా మిస్త్రీ పనిచేశారు. ముంబయి 26/11 దాడుల్లో చనిపోయిన, గాయపడిన వారికి టాటా గ్రూప్ భారీ సహాయాన్ని అందించడంలో సైరస్ కీలక పాత్ర పోషించారు.
టాటా ట్రస్టులో మిస్త్రీకి వాటా
సైరస్ మిస్త్రీ తాత షాపూర్జీ మిస్త్రీ 1930లలో కుటుంబ వ్యాపారం ఆరంభించారు. అదే సమయంలో ఆయన దొరాబ్జీ టాటా నుంచి టాటా గ్రూప్‌లో వాటా కొనుగోలు చేశారు. టాటా గ్రూప్‌లో 18.5 శాతం వాటా సొంతం చేసుకున్నారు. టాటా గ్రూప్‌లో మిస్త్రీ కుటుంబానికి మాత్రమే వాటా ఉంది. ఇది కాకుండా, 66 శాతం వాటాను టాటా గ్రూపులోని వివిధ ట్రస్టులు కలిగి ఉన్నాయి. టాటా గ్రూప్‌కి సైరస్ మిస్త్రీ ఆరో చైర్మన్.
మిస్త్రీ పరిధిలో ఎన్నో వ్యాపారాలు
పల్లోంజీ మిస్త్రీ గ్రూప్ అనేక వ్యాపారాలు చేపట్టింది. వస్త్రాల నుంచి రియల్ ఎస్టేట్, హాస్పిటాలిటీ, బిజినెస్ ఆటోమేషన్ వరకు విస్తరించింది. SPG గ్రూప్‌లో షాపూర్జీ పల్లోంజీ ఇంజనీరింగ్ & కన్‌స్ట్రక్షన్, ఆఫ్కాన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఫోర్బ్స్ టెక్స్‌టైల్స్, గోకాక్ టెక్స్‌టైల్స్, యురేకా ఫోర్బ్స్, ఫోర్బ్స్ & కో, SP కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ గ్రూప్, SP రియల్ ఎస్టేట్ మరియు నెక్స్ట్ జెన్ వంటి కంపెనీలు ఉన్నాయి.
సైరస్ మిస్త్రీని ఎందుకు తొలగించారు?
టాటా గ్రూప్ ఛైర్మన్‌గా మిస్త్రీని తొలగించడానికి అధికారిక కారణం ఏదీ తెలియదు. సైరస్ మిస్త్రీ ఛైర్మన్ అయ్యాక టాటా గ్రూప్ బోర్డు సభ్యులను సంప్రదించకుండానే నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. పైగా టాటా గ్రూప్ బోర్డు సభ్యులు నిర్దేశించుకున్న లక్ష్యం మేరకు వృద్ధిని సాధించలేకపోయింది. దాంతోనే ఆయన్ను పదవిలోంచి తొలగించారని అంటారు. ఏదేమైనా ఈ వ్యవహారంపై మిస్త్రీ న్యాయ పోరాటం చేస్తున్నారు.
Also Read: షాకింగ్ న్యూస్! ప్రమాదంలో టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ హఠాన్మరణం!