Vijay Shekhar Sharma: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఛైర్మన్ పదవికి విజయ్ శేఖర్ శర్మ రాజీనామా
Vijay Shekhar Sharma Steps Down: ప్రముఖ డిజిటల్ పేమెంట్, ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ వన్97 కమ్యూనికేషన్స్‌కు చెందిన పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఛైర్మన్ పదవి నుంచి విజయ్ శేఖర్ శర్మ వైదొలిగారు.
Vijay Shekhar Sharma Paytm Payments Bank: ప్రముఖ డిజిటల్ పేమెంట్, ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ వన్97 కమ్యూనికేషన్స్‌కు చెందిన పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఛైర్మన్ పదవి నుంచి విజయ్ శేఖర్ శర్మ వైదొలిగారు. ప్రస్తుతం ఆయన నాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా ఉన్నారు. అలాగే- బోర్డు సభ్యుడిగానూ వ్యవహరిస్తున్నారు. పేటీఎం ఫౌండర్ (Paytm Founder) కూడా ఆయనే. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కార్యకలాపాలన్నీ కూడా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పర్యవేక్షణలోకి వెళ్తుందంటూ వార్తలు వస్తోన్న తరుణంలో విజయ్ శేఖర్ శర్మ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన Paytm Payments Bank ఛైర్మన్ పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా చేసిన అంశాన్ని రెగ్యులేటరీ సంస్థలకు తెలిపారు. ఇదిలా ఉండగా, పీపీబీఎల్ కు కొత్త చైర్మన్ ను నియమిస్తామని వన్97 కమ్యూనికేషన్స్ ఓ ప్రకటనలో తెలిపింది.
సుపరిపాలన నిబంధనలు, రెగ్యులేటరీ నిబంధనల అమలులో విఫలం కావడంతో ఆర్బీఐ నిషేధాన్ని ఎదుర్కొంటున్న ప్రముఖ ఫిన్ టెక్ సంస్థ పేటీఎం పేరెంట్ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ ఫౌండర్ విజయ్ శేఖర్ శర్మ కీలక నిర్ణయం తీసుకున్నారు. విజయ్ శేఖర్ శర్మతోపాటు పేటీఎం పేమెంట్స్ బ్యాంకింగ్ లిమిటెడ్ (పీపీబీఎల్)లో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ చైర్మన్ శ్రీనివాసన్ శ్రీధర్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దేవేంద్రనాథ్ సారంగి, బ్యాంక్ ఆఫ్ బరోడా మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అశోక్ కుమార్ గార్గ్, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ రజినీ శేఖ్రి సిబాల్ ఇండిపెండెంట్ డైరెక్టర్లుగా ఉన్నారు.
ఆర్థిక కార్యకలాపాలు, బ్యాంకింగ్ లావాదేవీలపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ మరోసారి స్పందించింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లావాదేవీలపై నిషేధం విధించిన అనంతరం ఆర్బీఐ స్పందించడం ఇదే రెండోసారి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ ప్రకటన తరువాత పేటీఎం షేర్లు దారుణంగా పతనమయ్యాయి. పాతాళానికి పడిపోయాయి. ఒకదశలో 52 వారాల్లో గరిష్ఠంగా 998 రూపాయల వరకు వెళ్లిన వాటి షేర్ ప్రైస్ ఒక్కసారిగా కూప్పకూలింది. 300 రూపాయలకు పడిపోయింది.
అయితే.. ఇలాంటి పరిస్థితుల్లోనూ పేటీఎం యాజమాన్యానికి రిజర్వు బ్యాంక్ ఊరటనిస్తూ.. ముఖ్య నిర్ణయం తీసుకుంది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కార్యకలాపాలపై విధించిన నిషేధాన్ని ఈ మేరకు సడలించింది. ఫిబ్రవరి 29 నుంచి అమలు కావాల్సిన నిషేధం గడువును మార్చి 15 వరకు పొడిగించింది. అంటే.. మార్చి 14 వరకూ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్, వ్యాలెట్, ఫాస్టాగ్ పని చేస్తాయి.
నిషేధం అమలు గడువును ఆర్బీఐ పొడిగించిన నేపథ్యంలో పేటీఎం షేర్ల ధరలు మళ్లీ పెరుగుదల బాట పట్టాయి. ఈ సడలింపు ప్రకటన వెలువడినప్పటి నుంచి ప్రతి రోజూ అప్పర్ సర్క్యుట్‌లో ట్రేడ్ అవుతూ వస్తోన్నాయి పేటీఎం షేర్ల ధరలు. అయిదు శాతం మేర పెరుగుతూ వస్తోన్నాయి. నేడు పేటీఎం ఒక్కో షేర్ ధర రూ.428.10 పైసల వద్ద ట్రేడ్ అయింది. అంతా సజావుగా సాగుతోందనుకున్న ఈ దశలో అనూహ్య సంఘటన చోటు చేసుకుంది.
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ మీద మనీ లాండరింగ్ ఆరోపణలు రావడంతో, PPBL బోర్డ్ నుంచి ఒక స్వతంత్ర డైరెక్టర్ వైదొలిగారు. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ స్వతంత్ర డైరెక్టర్ మంజు అగర్వాల్, తన వ్యక్తిగత కారణాల వల్ల 2024 ఫిబ్రవరి 01న బోర్డుకు రాజీనామా చేసినట్లు ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో పేటీఎం కూడా ప్రకటించింది.