Venus Pipes Shares: నాలుగు నెలల్లోనే డబ్బులు డబుల్ చేసిన స్టాక్ ఇది
గత 5 రోజుల్లో దాదాపు 11 శాతం ర్యాలీ చేసిన ఈ స్క్రిప్, గత నెల రోజుల్లోనే 51 శాతం వరకు చెలరేగి పెరిగింది.
Venus Pipes Shares: 2021లో వచ్చిన ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్స్ (IPOs) స్టాక్ మార్కెట్‌ను కొల్లగొట్టాయి. వేల కోట్ల రూపాయలు పట్టుకెళ్లాయి. 2022లో ఆ ఊపు లేదు. ఐపీవోలన్నీ చప్పగా సాగాయి. గతేడాది లాభాలను దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది ఐపీవోల్లో పెట్టుబడులు పెట్టినవాళ్లు సొమ్ములు కోల్పోయారు. కేవలం రెండో, మూడో ఐపీవోలు మాత్రమే ఆశించిన లాభాలు అందించాయి. ఇలాంటి పరిస్థితుల్లో, నాలుగు నెలల కిందట వచ్చిన ఒక ఐపీవో మాత్రం ఇన్వెస్టర్ల డబ్బును దాదాపు రెట్టింపు చేసి పెట్టింది. అదే వీనస్ పైప్స్ అండ్ ట్యూబ్స్ లిమిటెడ్ (Venus Pipes and Tubes Ltd).
వీనస్ పైప్స్ అండ్ ట్యూబ్స్ (Venus Pipes and Tubes) ఐపీవో నాలుగు నెలల క్రితం మే 11-13 తేదీల్లో జరిగింది. ఇష్యూ ధర రూ.326. ఈ ఐపీవోకి బాగానే రెస్పాన్స్ వచ్చింది. రిటైల్ పోర్షన్ 19 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది. మిగిలిన విభాగాలను (QIB, NII) కూడా కలిపి చూస్తే, మొత్తంగా 16 రెట్ల స్పందన వచ్చింది. మే 24న ఇది మార్కెట్‌లో లిస్ట్ అయింది. కేవలం 4 శాతం ప్రీమియంతో రూ.337.50 రేటులో ఈ షేర్ లిస్ట్ అయింది.
జులై నుంచి టాప్ గేర్
జులై నెల మధ్య వరకు కూడా ఈ ధర దాదాపు ఫ్లాట్‌గానే ఉంది. అక్కడి నుంచి గేరు మారింది. మార్కెట్ ఒడిదొడుకులతో సంబంధం లేకుండా పెరిగింది. లిస్టింగ్ తేదీ నుంచి ఇప్పటివరకు ఈ నాలుగు నెలల్లోనే ఇది 92 శాతం పెరిగింది. అంటే, కేవలం నాలుగు నెలల్లోనే డబ్బును డబుల్ చేసింది.
గత 5 రోజుల్లో దాదాపు 11 శాతం ర్యాలీ చేసిన ఈ స్క్రిప్, గత నెల రోజుల్లోనే 51 శాతం వరకు చెలరేగి పెరిగింది. శుక్రవారం నాటి వీక్ మార్కెట్‌లోనూ ఇది పాజిటివ్‌గానే మూవ్ అయింది. ఆ రోజు బీఎస్ఈలో దాదాపు 2 శాతం లాభంతో రూ.625.75 దగ్గర ముగిసింది.
టార్గెట్ రూ.764
శుక్రవారం, తాజాగా 52 వారాల గరిష్ట స్థాయి రూ.652ని ఈ స్టాక్ టచ్ చేసింది. భవిష్యత్‌లోనూ ఇదే రేంజ్‌లో ఇది పరుగులు తీస్తుందని బ్రోకింగ్ హౌస్ సెంట్రమ్ అంచనా వేసింది. ఈ స్టాక్ కు రూ.764 స్థాయికి చేరుకోగలదని టార్గెట్ ఇచ్చి, బయ్ చేయవచ్చని సిఫార్సు చేసింది.
వ్యాపారం
గుజరాత్ కేంద్రంగా వీనస్ పైప్స్ & ట్యూబ్స్ పనిచేస్తోంది. స్టెయిన్‌లెస్ స్టీల్ పైప్స్, ట్యూబ్‌ల తయారీ, ఎగుమతి వ్యాపారం చేస్తోంది. కెమికల్స్, ఇంజినీరింగ్, ఫెర్టిలైజర్స్, ఫార్మాస్యూటికల్స్, పవర్, ఫుడ్ ప్రాసెసింగ్, పేపర్, ఆయిల్ & గ్యాస్ రంగాల్లోని కంపెనీల కోసం వీనస్ బ్రాండ్ పేరుతో ఉత్పత్తులను సరఫరా చేస్తోంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని 'ఏబీపీ దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.