US Inflation: అమెరికాలోనూ తగ్గిన ద్రవ్యోల్బణం, ఇకనైనా ఫెడ్ దూకుడు తగ్గుతుందా?
భారత్ సహా ప్రపంచ స్టాక్ మార్కెట్లన్నింటికీ శుభ సూచన.
US Inflation: అమెరికాలో ద్రవ్యోల్బణం చల్లబడుతోంది. 2022 మధ్యలో గరిష్ట స్థాయికి చేరిన ఇన్‌ఫ్లేషన్ (US Inflation), ఆ తర్వాత వరుసగా ఆరో నెలలోనూ (డిసెంబర్) తగ్గింది. వడ్డీ రేట్లను యూఎస్ ఫెడరల్ రిజర్వ్ (US FED) దూకుడుగా పెంచడం, ఆర్థిక వ్యవస్థ కుదుట పడుతున్న సంకేతాలు కనిపిస్తుండడంతో.. అగ్రరాజ్యంలో ద్రవ్యోల్బణం దిగి వస్తోంది. ఇది, భారత్ సహా ప్రపంచ స్టాక్ మార్కెట్లన్నింటికీ శుభ సూచన.
వినియోగదారు ధరల సూచీ (consumer price index లేదా CPI) గత నెలలో 6.5%గా నమోదైంది, నవంబర్‌లోని 7.1% నుంచి ఇది తగ్గింది. 2022 జూన్‌లోని గరిష్ట స్థాయి 9.1% కంటే చాలా తక్కువగా ఉంది.
ఇంధనం, ఆహార ధరలను మినహాయించి లెక్కించే కోర్ CPI, గత సంవత్సరంతో పోలిస్తే డిసెంబర్‌లో 5.7% పెరిగింది. అయితే నవంబర్‌లోని 6% పెరుగుదలతో పోలిస్తే, ఇప్పుడు బెటర్‌గా ఉంది. మొత్తం CPI కన్నా కోర్ CPIలో పెరుగుదలనే భవిష్యత్ ద్రవ్యోల్బణం అంచనాల కోసం చాలామంది ఆర్థికవేత్తలు లెక్కలోకి తీసుకుంటారు. డిసెంబర్‌తో ముగిసిన మూడు నెలల్లో, కోర్ CPI ధరలు 3.1% వార్షిక రేటుతో పెరిగాయి. అయితే ఇది చాలా నెమ్మదైన పెరుగుదల. జూన్‌లోని 7.9% నుంచి కోర్ CPI తగ్గింది.
నెలవారీ ప్రాతిపదికన...
నవంబర్‌లో 0.1%, అక్టోబర్‌లో 0.4% పెరుగుదలతో పోలిస్తే డిసెంబర్‌లో ద్రవ్యోల్బణం 0.1% తగ్గింది. ఇంధన ధరలు బాగా తగ్గడం కలిసొచ్చింది. డిసెంబర్‌లో ఆహార ధరల పెరుగుదల కూడా మందగించింది. కోర్ CPI, నవంబర్‌లోని 0.2% పెరుగుదలతో పోలిస్తే డిసెంబరులో 0.3% పెరిగింది. అయితే... ఆగస్ట్ & సెప్టెంబర్ నెలల్లోని 0.6% పెరుగుదలతో పోలిస్తే ఇప్పుడు బాగా తగ్గింది.
గత ఏడాదిన్నర కాలంగా, అమెరికన్ ద్రవ్యోల్బణం రేట్‌లో కీలకంగా మారిన వస్తువుల (Goods) ధరలు వరుసగా మూడో నెల తగ్గాయి. ఆ దేశంలో వాహనాలు, కంప్యూటర్లు, క్రీడా వస్తువులు వంటి ఉత్పత్తుల ధరలు తగ్గడంతో గూడ్స్ ధరలు దిగి వచ్చాయి.
గత సంవత్సరం పెరుగుదల తర్వాత ద్రవ్యోల్బణం ఒక మూల మలుపు తిరుగుతుందనే సంకేతాలకు ఈ గణాంకాలు జోడించబడ్డాయి. డిసెంబరులో సగం శాతం పాయింట్ల పెరుగుదల నుండి ఫిబ్రవరి 1న ముగిసే వారి సమావేశంలో వడ్డీ-రేటు పెరుగుదల పరిమాణాన్ని పావు శాతం-పాయింట్‌కు తగ్గించడానికి వారు ఫెడ్‌ను ట్రాక్‌లో ఉంచుతారు.
ద్రవ్యోల్బణం శాంతించడంతో... US స్టాక్స్ గురువారం లాభపడ్డాయి. S&P 500 0.3% పెరగ్గా, డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ( Dow Jones Industrial Average) 0.6% లేదా 217 పాయింట్లు లాభపడింది. టెక్నాలజీ-హెవీ నాస్‌డాక్ కాంపోజిట్ (Nasdaq Composite) కూడా 0.6% పెరిగింది.
ఫెడ్ శాంతిస్తుందా?
అమెరికాలో ద్రవ్యోల్బణం కట్టడికి యూఎస్ ఫెడ్ కఠిన చర్యలు తీసుకుంది. గత ఏడాది కాలంగా వడ్డీ రేట్లను భారీగా పెంచుకుంటూ వెళ్లింది. 2022 డిసెంబర్‌లో జరిగిన చివరి మీటింగ్‌లోనూ 50 బేసిస్ పాయింట్లు లేదా అర శాతం మేర వడ్డీ రేటును పెంచింది. ప్రస్తుతం.. అగ్ర రాజ్యంలో వరుసగా ఆరో నెల కూడా అమెరికాలో ద్రవ్యోల్బణం తగ్గింది. ఈ నేపథ్యంలో, యూఎస్ ఫెడ్ కాస్త శాంతిస్తుందని, రేట్ల పెంపులో దూకుడు తగ్గిస్తుందని మార్కెట్ అంచనా వేస్తోంది.
2023 ఫిబ్రవరి 1న యూఎస్ ఫెడ్ తదుపరి సమావేశం ఉంది. అప్పుడు, 25 బేసిస్ పాయింట్లు లేదా పావు శాతం వడ్డీ రేటును మాత్రమే ఫెడ్ పెంచుతుందన్న అంచనాలు ఉన్నాయి.