EPFO Wage Ceiling: వేతన జీవులకు త్వరలోనే కేంద్రం గుడ్ న్యూస్ - ఈపీఎఫ్ఓ పరిమితి రూ.21 వేలకు పెంపు!
EPFO: ఉద్యోగులకు కేంద్రం ప్రభుత్వం త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పనున్నట్లు తెలుస్తోంది. ఈపీఎఫ్ఏ వేతన పరిమితి పెంపుపై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.
Union Government Soon To Raise EPFO Wage Ceiling: వేతన జీవులకు కేంద్ర ప్రభుత్వం త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈపీఎఫ్ఓ (EPFO) వేతన పరిమితిని పెంచాలని యోచిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈపీఎఓ గరిష్ట వేతన పరిమితి రూ.15 వేలు ఉండగా.. దాన్ని రూ.21 వేలకు పెంచనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకుని వీలైనంత త్వరగా ప్రకటన చేయాలని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు పలు జాతీయ మీడియా కథనాలు విశ్వసనీయ వర్గాల సమాచారం ఆధారంగా వెల్లడించాయి. అలాగే, ఈపీఎఫ్ఓలో ఉద్యోగుల సంఖ్యను పట్టి కంపెనీల నమోదు తప్పనిసరిగా ఉంటుంది. ఇప్పుడు ఆ ఉద్యోగుల సంఖ్యపై పరిమితిని కూడా తగ్గించనున్నట్లు సమాచారం.
ప్రస్తుతం 20 అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులున్న కంపెనీలు తప్పనిసరిగా ఈపీఎఫ్ఓలో చేరాల్సి ఉండగా.. ఆ సంఖ్యను 10 - 15కు తగ్గించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ ప్రతిపాదనను చిన్న, మధ్య తరహా పరిశ్రమలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు కథనాలు పేర్కొంటున్నాయి. అయితే, వేతన పరిమితిని పెంచడం వల్ల ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ రంగంపైనా ఆ భారం పడుతుంది. కానీ, ఉద్యోగులకు మాత్రం మేలు జరుగుతుంది.
ఉద్యోగులకు ప్రయోజనం ఇలా..
కంపెనీలు ఉద్యోగుల బేసిక్ సాలరీ, డీఏ ఆధారంగా ప్రావిడెంట్ ఫండ్‌కు నగదు మొత్తాలను నెల నెలా జమ చేస్తాయనే విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఉద్యోగి జీతం నుంచి 12 శాతం, దీనికి సమానంగా యాజమాన్యం ద్వారా మరో 12 శాతం పీఎఫ్ ఖాతాకు వెళ్తుంది. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం వేతన పరిమితిని పెంచితే దాని వల్ల ఉద్యోగుల పీఎఫ్ ఖాతాకు జమ అయ్యే మొత్తం పెరగనుంది. దీనికి సంబంధించిన వేతన పరిమితే ప్రస్తుతం రూ.15 వేలుగా ఉంది. దీన్నే రూ.21 వేలకు పెంచాలని కేంద్రం యోచిస్తోంది. ఇదే పెరిగితే ఇప్పటివరకూ రూ.15 వేలు ప్రాతిపదికన పీఎఫ్ ఖాతాకు జమవుతున్న మొత్తాలు.. ఇకపై రూ.21 వేల ప్రాతిపదికన జమవుతాయి.
దీంతో ఉద్యోగి రిటైర్మెంట్ ఫండ్‌కు నిధులు పెరుగుతాయి. ఉద్యోగి పీఎఫ్ ఖాతాకు కంపెనీల ద్వారా వెళ్లే 12 శాతంలో 8.33 శాతం సొమ్ము సదరు ఉద్యోగి పెన్షన్ ఖాతాకు వెళ్తుంది. మిగతా 3.67 శాతం ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలో జమవుతుంది. ఉద్యోగి నుంచి తీసుకునే మొత్తాలు మాత్రం పూర్తిగా ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలోకే వెళ్తాయి. గరిష్ట వేతన పరిమితిని పెంచితే ఆ మేరకు ఉద్యోగి, యజమాని చెల్లించాల్సిన వాటా పెరుగుతుంది. దీంతో రిటైర్మెంట్ సమయానికి ఉద్యోగి తన భవిష్యనిధి నిల్వలను పెంచుకోవడానికి వీలు పడుతుంది. అలాగే, ప్రభుత్వం నుంచి కూడా 1.16 శాతం ఉద్యోగుల పెన్షన్ పథకంలోకి వచ్చి చేరుతుంది.
2014లో చివరిసారిగా పెంపు..
కాగా, కేంద్ర ప్రభుత్వం చివరిసారిగా 2014లో శాలరీ లిమిట్‌ను పెంచింది. రూ.6,500గా ఉన్న పరిమితిని రూ.15 వేలకు మార్చింది. 1952లో ఈ పథకం ప్రారంభించగా.. అప్పటి నుంచి ఇప్పటివరకూ మొత్తం ఎనిమిది సార్లు వేతన పరిమితిని పెంచారు.