UBS - Credit Suisse: క్రెడిట్ సూయిస్‌ను కొనేసిన UBS, $3.25 బిలియన్లకు డీల్ క్లోజ్
తీవ్రమవుతున్న సంక్షోభాన్ని ముగించడానికి స్విస్ ఆర్థిక నియంత్రణ సంస్థలు చేసిన ఐదు రోజుల ప్రయత్నం తర్వాత ఈ ఒప్పందం కుదిరింది.
UBS Purchases Credit Suisse: స్విట్జర్ల్యాండ్‌కు చెందిన అతి పెద్ద బ్యాంక్ UBS, ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన స్విస్ బ్యాంక్ క్రెడిట్ సూయిస్ మధ్య డీల్ ఓకే అయింది. 3.25 బిలియన్ డాలర్లకు క్రెడిట్ సూయిస్‌ను UBS గ్రూప్ కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదిరింది. 167 ఏళ్ల నాటి బ్యాంక్ క్రెడిట్ సూయిస్‌ను కొనుగోలు చేస్తున్న విలువ, దాని వాస్తవ విలువ కంటే చాలా తక్కువగా ఉంది.
ఫలించిన 5 రోజుల ప్రయత్నాలు
అమెరికాకు చెందిన సిలికాన్ వ్యాలీ బ్యాంక్ రగిలించిన కార్చిచ్చు సిగ్నేచర్ బ్యాంక్, రిపబ్లిక్ బ్యాంక్‌కు అంటుకుంది. అక్కడి నుంచి విస్తరించిన సంక్షోభ కీలలు ఐరోపా బ్యాంకులనూ చుట్టుముట్టాయి. స్విట్జర్ల్యాండ్‌కు చెందిన క్రెడిట్ సూయిస్ కూడా మూతబడే ప్రమాదం అంచుకు చేరుకుంది. దీనిని నివారించడానికి, తమ దేశ బ్యాంకింగ్ రంగంలో సంక్షోభాన్ని చల్లబరచడానికి స్విట్జర్లాండ్ ప్రభుత్వం, ఆర్థిక నియంత్రణ సంస్థలు ప్రయత్నాలు చేశాయి. ఇందులో భాగంగానే, స్విస్ నేషనల్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ స్విట్జర్లాండ్, బ్యాంకింగ్ రెగ్యులేటర్ FINMA రంగంలోకి దిగాయి. UBS, క్రెడిట్ సూయిస్‌తో అవి విడివిడిగా చర్చలు నిర్వహించాయి. ఈ చర్చలు సాగుతుండగానే... 2023 మార్చి 18, శనివారం నాడు, క్రెడిట్ సూయిస్‌ను పూర్తిగా లేదా, దాని స్విట్జర్ల్యాండ్ విభాగాన్ని UBS కొనుగోలు చేయబోతున్నట్లు వార్తలు బయటకు వచ్చాయి.
స్విట్జర్ల్యాండ్‌లో రెండో అతి పెద్ద బ్యాంక్ అయిన క్రెడిట్ సూయిస్ పడిపోకుండా, తీవ్రమవుతున్న సంక్షోభాన్ని ముగించడానికి స్విస్ ఆర్థిక నియంత్రణ సంస్థలు చేసిన ఐదు రోజుల ప్రయత్నం తర్వాత ఈ ఒప్పందం కుదిరింది.
ప్రపంచ బ్యాంకింగ్ వ్యవస్థకు పెను ప్రమాదం
క్రెడిట్ సూయిస్ మూతబడితే.. ఆ సంక్షోభం కేవలం ఆ బ్యాంకు లేదా స్విట్జర్ల్యాండ్‌కు మాత్రమే పరిమితం కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న బ్యాంకింగ్ వ్యవస్థకు పెను సవాలుగా మారవచ్చు. ఎందుకంటే, ప్రపంచంలోని అతి పెద్ద సంపద నిర్వహణ సంస్థల్లో క్రెడిట్ సూయిస్ ఒకటి. 30 అతి పెద్ద గ్లోబల్ సిస్టమాటిక్ ఇంపార్టెంట్ బ్యాంక్‌ల లిస్ట్‌లో దీని పేరు ఉంది. ఈ బ్యాంక్ మునిగిపోతే, ఆ చెడు ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పడుతుంది. ముఖ్యంగా, బ్యాంకింగ్ రంగంపై ఖాదాదార్లు, డిపాజిట్‌దార్లలో నమ్మకం సన్నగిల్లుతుంది.
గత వారం క్రెడిట్ సూయిస్ షేర్లు భారీగా పతనం
స్విట్జర్లాండ్ సెంట్రల్ బ్యాంక్ నుంచి క్రెడిట్ సూయిస్ 54 బిలియన్ డాలర్ల ($ 54 బిలియన్లు) రుణం తీసుకుంటుందని గత వారంలో వార్తలు బయటకు వచ్చాయి. అంటే.. బ్యాంకు దగ్గర డబ్బు లేదని డిపాజిట్‌దార్లు కంగారు పడాల్సిన అవసరం లేకుండా, 54 బిలియన్ డాలర్ల నిధులు క్రెడిట్ సూయిస్‌లో అందుబాటులోకి వచ్చాయి. అయితే, క్రెడిట్ సూయిస్ ఆర్థిక పరిస్థితి క్షీణించడం వల్లే రుణం తీసుకోవాల్సి వచ్చిందన్న భావన అటు డిపాజిట్‌దార్లలో, ఇటు బ్యాంక్ షేర్‌హోల్డర్లలో బలంగా కనిపించింది. దీంతో, ఆ ప్రతికూల ప్రభావ భారాన్ని షేర్లు భరించవలసి వచ్చింది. క్రెడిట్ సూయిస్ షేర్లు శుక్రవారం 7 శాతం పడిపోయాయి, గత ట్రేడింగ్ వారంలో మొత్తంగా 24 శాతం క్షీణించాయి.