(Source: ECI/ABP News/ABP Majha)
Rs 2000 Notes: రూ.రెండు వేల నోట్లు డిపాజిట్ చేయాలా? ఈ ఒక్క రోజు ఆగండి
రూ.2 వేల నోట్ల డిపాజిట్లకు సంబంధించి ఆర్‌బీఐ ఒక ప్రకటన విడుదల చేసింది.
2000 Rupee Notes Update: రెండు వేల రూపాయల నోట్లను డిపాజిట్ చేయాలనుకున్నా, మార్చాలనుకున్నా ఈ ఒక్క రోజు (01 ఏప్రిల్ 2024) ఆగండి. పింక్ నోట్లకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక అప్‌డేట్ ఇచ్చింది. ఈ అప్‌డేట్ గురించి తెలుసుకుంటే మీకు టైమ్ సేవ్ అవుతుంది.
రూ.2,000 నోట్లను చలామణీ నుంచి ఉపసంహరించుకున్నప్పటికీ, ఇప్పటికీ వేల కోట్ల విలువైన పెద్ద నోట్లు ప్రజల దగ్గర ఉన్నాయని ఆర్‌బీఐ డేటాను బట్టి అర్ధం అవుతోంది. ఆ నోట్లను చలామణీ నుంచి వెనక్కు తీసుకోవడానికి, తన ప్రాంతీయ కార్యాలయాల్లో (RBI Regional Offices) రూ.2 వేల నోట్ల డిపాజిట్లు లేదా మార్పిడిని కేంద్ర బ్యాంక్ అనుమతిస్తోంది. తాజాగా, రూ.2 వేల నోట్ల డిపాజిట్లకు సంబంధించి ఆర్‌బీఐ ఒక ప్రకటన విడుదల చేసింది.
ఈ రోజు రూ.2,000 నోట్ల డిపాజిట్/మార్పిడికి అనుమతి లేదు
కొత్త ఆర్థిక సంవత్సరం తొలి రోజున, అంటే 01 ఏప్రిల్ 2024న, రూ.2000 నోట్ల మార్పిడి లేదా డిపాజిట్ సదుపాయం తన ప్రాంతీయ కార్యాలయాల్లో అందుబాటులో ఉండదని RBI ప్రకటించింది. ఏప్రిల్ 01న, తన 19 ఇష్యూ కార్యాలయాలు వార్షిక ఖాతాల ముగింపులో బిజీగా ఉంటాయని, ఆ రోజున రూ.2000 నోట్లను డిపాజిట్ చేయడం లేదా మార్చుకోవడం కుదరదని స్పష్టం చేసింది. రూ.2000 నోట్లను ఏప్రిల్ 02, 2024 నుంచి డిపాజిట్ చేసుకోవచ్చని లేదా మార్చుకోవచ్చని ప్రకటించింది. మార్చి 28న (గురువారం) RBI ఈ ప్రకటన విడుదల చేసింది.
ప్రజల దగ్గర రూ.8,470 కోట్లు
2023 మే 19న, మార్కెట్ నుంచి రూ.2000 నోట్ల ఉపసంహణ నిర్ణయాన్ని ఆర్‌బీఐ ప్రకటించింది. ఆ తేదీ నాటికి మార్కెట్‌లో దాదాపు రూ. 3.56 లక్షల కోట్ల విలువైన రూ. 2000 నోట్లు చలామణిలో ఉన్నాయి. RBI లెక్క ప్రకారం, 2024 ఫిబ్రవరి 29 నాటికి, ఈ మొత్తం రూ. 8,470 కోట్లకు తగ్గింది. అంటే, చలామణీలో ఉన్న మొత్తం రూ. 2000 నోట్లలో 97.62% RBI వద్దకు తిరిగి వచ్చింది. ఇంకా 2.38% నోట్లు ప్రజల దగ్గర ఉన్నాయి, వీటి విలువ రూ. 8,470 కోట్లు.
రూ. 2000 నోట్లను RBI వెనక్కు తీసుకుంది గానీ రద్దు చేయలేదు. అవి ఇప్పటికీ చెల్లుతాయి. 2000 రూపాయల నోట్లు చట్టబద్ధమైన టెండర్‌గా (Rs 2,000 notes are legal tender) కొనసాగుతాయని ఆర్‌బీఐ చాలాసార్లు స్పష్టం చేసింది.
ఆర్‌బీఐ చట్టం, 1934లోని సెక్షన్ 24(1) ప్రకారం రూ.2000 డినామినేషన్ బ్యాంక్ నోట్‌ను 2016 నవంబర్‌లో తీసుకొచ్చారు. దీనికిముందు, చలామణిలో ఉన్న మొత్తం రూ.500 & రూ.1000 నోట్ల చట్టబద్ధతను కేంద్ర రద్దు చేసింది. దీంతో, ఆర్థిక వ్యవస్థలో ఏర్పడిన నోట్ల కొరతను తీర్చడానికి రూ.2000 నోట్ల డినామినేషన్‌ను ఆర్‌బీఐ తీసుకువచ్చింది. ఇప్పుడు, ఇతర డినామినేషన్ల నోట్లు కూడా తగినన్ని అందుబాటులో ఉన్నాయి. 2000 రూపాయల నోట్లను ప్రవేశపెట్టిన లక్ష్యం నెరవేరింది. దీంతో, 2018-19లో 2000 రూపాయల నోట్ల ముద్రణను RBI నిలిపేసింది.
మరో ఆసక్తికర కథనం: ద్యావుడా, రూ.46 కోట్లు కట్టాలట, ఐటీ నోటీస్‌తో ఆ విద్యార్థి మైండ్‌బ్లాంక్