(Source: ECI/ABP News/ABP Majha)
IT Notice: ద్యావుడా, రూ.46 కోట్లు కట్టాలట, ఐటీ నోటీస్‌తో ఆ విద్యార్థి మైండ్‌బ్లాంక్
ఏదో పొరపాటు జరిగి ఉండొచ్చని, ఆ రెండు డిపార్ట్‌మెంట్లు తనకు తప్పుగా నోటీసులు పంపాయని తొలుత భావించాడు.
Income Tax Department Notice To A Student: మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఒక కాలేజీ విద్యార్థికి ఆదాయ పన్ను విభాగం మామూలు షాక్ ఇవ్వలేదు. రూ. 46 కోట్ల పన్ను బకాయి ఉందని, వెంటనే ఆ డబ్బు కట్టమంటూ నోటీస్ (IT Notice) పంపింది. నోటీస్ అందుకున్న విద్యార్థి మైండ్‌బ్లాంక్ అయింది. కాలేజీ ఫీజ్ కట్టడానికే దిక్కు లేదు, రూ.46 కోట్ల ఆదాయ పన్ను ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలంటూ తల పట్టుకుని కూర్చున్నాడు. ఐటీ నోటీస్ విషయం తెలిసి ఊరంతా ఆశ్చపోయింది.
ఆ తర్వాత... ఐటీ నోటీస్ పట్టుకుని, ఆదాయ పన్ను వ్యవహారాలు తెలిసి వారి దగ్గరకు పరుగులు పెట్టాడా యువకుడు. అక్కడ తెలిసిన వివరాలను బట్టి, తన ఖాతా నుంచి తనకు తెలీకుండానే 46 కోట్ల రూపాయల మోసపూరిత లావాదేవీలు జరిగాయని అర్ధమైంది. అక్కడి నుంచి పోలీస్ట్ స్టేషన్ వెళ్లిన ఆ వ్యక్తి, జరిగిన విషయం గురించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
జరిగిన విషయం ఇదీ..
ప్రమోద్ కుమార్ దండోటియా అనే విద్యార్థి మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ నివాసి. అక్కడ ఎస్‌ఎల్‌పీ కళాశాలలో ఎంఏ ఇంగ్లిష్ చదువుతున్నాడు. ఆదాయపు పన్ను విభాగం (Income Tax Department ), జీఎస్టీ (GST Department) నుంచి రూ. 46 కోట్ల నోటీసు అందడంతో ప్రమోద్‌కు పెద్ద షాక్ తగిలింది. తన పాన్ కార్డ్ (PAN Card) నంబర్‌ను ఉపయోగించి, 2021 సంవత్సరంలో దిల్లీలో ఒకటి, ముంబైలో రెండు కంపెనీలు రిజిస్టర్ అయినట్లు రెండు విభాగాలు పంపిన నోటీసులో ఆ విద్యార్థికి తెలిసింది.
అంతేకాదు, ప్రమోద్ కుమార్ బ్యాంక్ ఖాతాను కూడా ఇందుకు వినియోగించారు. నోటీసు అందుకున్నాక నోట మాట రాని ప్రమోద్.. ఏదో పొరపాటు జరిగి ఉండొచ్చని, ఆ రెండు డిపార్ట్‌మెంట్లు తనకు తప్పుగా నోటీసులు పంపాయని తొలుత భావించాడు. కానీ, ఈ విషయాన్ని విచారించిన తర్వాత లోగుట్టంతా బయటపడింది. 2021 జనవరి నుంచి ఇప్పటి వరకు తన బ్యాంక్ ఖాతా ద్వారా రూ. 46 కోట్ల విలువైన లావాదేవీలు జరిగినట్లు తెలుసుకున్నాడు.
తాను ఎంతో కష్టపడి కాలేజీ ఫీజు కట్టగలుగుతున్నానంటున్న ప్రమోద్, ఇలాంటి పరిస్థితుల్లో ఇంత భారీ మొత్తంలో లావాదేవీలు ఎలా చేయగలనని ప్రశ్నించాడు. తన పాన్ కార్డ్ నంబర్‌ను దుర్వినియోగం చేసి నకిలీ కంపెనీల ప్రారంభించారని, తాను మోసపోయానని చెప్పాడు. ఈ విషయం గురించి ఆదాయ పన్ను అధికార్లతో మాట్లాడేందుకు ప్రయత్నించామని, అది కూడా ఫలితం ఇవ్వలేదని ప్రమోద్ తెలిపాడు. ఆ తర్వాత ఆ విద్యార్థి పోలీసులను ఆశ్రయించాడు.
నోటీసు అందుకున్న విద్యార్థి, ఈ విషయంలో క్రైమ్ బ్రాంచ్ అదనపు ఎస్పీ సాయం కోరాడు. సైబర్ సెల్‌లో ఫిర్యాదు చేయాలని అదనపు ఎస్పీ సియాజ్ విద్యార్థికి సూచించారు. FIR నమోదు చేసిన తర్వాత, ఆ కేసు కాపీని ఆదాయ పన్ను విభాగానికి, GST విభాగానికి సమర్పించాలని పోలీసులు ఆ విద్యార్థికి సూచించారు.
మరో ఆసక్తికర కథనం: ఎక్కువ ఆదాయం ఇచ్చే ఎస్‌బీఐ పథకం, ఆదివారంతో క్లోజ్, త్వరపడండి