Elon Musk: టెస్లా షేర్లను మళ్లీ అమ్మిన మస్క్, ఈసారి మొత్తం 4 బిలియన్ డాలర్లు
ఈ సంవత్సరంలోనే దాదాపు 20 బిలియన్ డాలర్ల (రూ. 1.63 లక్షల కోట్లు) టెస్లా కంపెనీ షేర్లను ఆఫ్‌లోడ్ చేశారు.
Elon Musk: గ్లోబల్ మైక్రో బ్లాగింగ్ ఫ్లాట్‌ఫామ్ ట్విట్టర్‌ను (Twitter) ఇటీవలే కొని, ఆ కంపెనీ CEO పరాగ్ అగర్వాల్ సహా భారీ సంఖ్యలో ఉద్యోగుల తొలగించి హెడ్ ట్వీట్‌గా మారి రచ్చ చేసిన ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్, ప్రతిరోజూ ప్రపంచ మీడియాలో హెడ్‌లైన్‌గా మారుతూనే ఉన్నారు. ఇప్పుడు మళ్లీ వార్తల్లోకి ఎక్కారు.
తాజా వార్త ట్విట్టర్‌కు సంబంధించింది కాదు, ఎలాన్ మస్క్‌కు చెందిన ఎలక్ట్రిక్ కార్ కంపెనీ టెస్లాకు (Tesla) సంబంధించింది. ప్రపంచంలోనే అత్యంత విలువైన ఎలక్ట్రిక్ కార్లను తయారు చేసి, అమ్ముతున్న టెస్లా షేర్లను ఎలాన్ మస్క్ మళ్లీ విక్రయించారు. ఈసారి దాదాపు 4 బిలియన్ డాలర్ల (రూపాయి ప్రస్తుత విలువ ప్రకారం రూ. 32.6 వేల కోట్లు) విలువైన షేర్లను అమ్మారు. మంగళవారం నాటి SEC ఫైలింగ్ ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
#UPDATE Tesla chief Elon Musk sells nearly $4 billion worth of shares in the electric car company, SEC filings show, more than a week after he closed his $44 billion acquisition of Twitter.
— AFP News Agency (@AFP) November 9, 2022
Musk financed much of his Twitter purchase with Tesla stock pic.twitter.com/G8N8ax7z4s
$20 బిలియన్ల షేర్ల ఆఫ్‌లోడ్
ఇంతకు ముందు, ఈ సంవత్సరంలోనే దాదాపు 20 బిలియన్ డాలర్ల (రూ. 1.63 లక్షల కోట్లు) టెస్లా కంపెనీ షేర్లను ఆఫ్‌లోడ్ చేశారు. ట్విట్టర్ కొనుగోలు కోసం $44 బిలియన్లను (రూ. 3.59 లక్షల కోట్లు) ఎలాన్ మస్క్ వెచ్చించారు. ఆ కొనుగోలు కోసమే టెస్లా షేర్ల భారీ మొత్తంలో మస్క్ అమ్మారని ప్రపంచం ఊహించింది. ఇప్పుడు, ట్విట్టర్ కొన్న వారం తర్వాత మరోమారు దాదాపు 4 బిలియన్ డాలర్ల విలువైన టెస్లా షేర్లను విక్రయించడం చర్చకు తెర లేపింది. పంతానికి పోయి ట్విట్టర్ కొన్న ఎలాన్ మస్క్, తాను ఏం కోల్పోతున్నారో అర్ధం చేసుకుంటున్నారా, లేదా అన్న ప్రశ్నలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ఈ ఏడాది ఏప్రిల్‌లో, 8.4 బిలియన్ డాలర్ల విలువైన టెస్లా షేర్లను ఎలాన్ మస్క్ విక్రయించారు. ఆ తర్వాత, ఇదే ఏడాది ఆగస్టులో మరో 6.9 బిలియన్ డాలర్ల విలువైన షేర్లను అమ్మేశారు. కంపెనీలో ఇకపై షేర్లను విక్రయించే ఆలోచన లేదని ఆ సమయంలో టెస్లా CEO (ఎలాన్ మస్క్) ట్వీట్ చేశారు. మాట మీద నిలబడితే మస్క్ కాదు అన్నట్లుగా, ఆగస్టు తర్వాత మరోమారు టెస్లా షేర్లను ఆఫ్‌లోడ్ చేశారు. ఈ విధంగా, ట్విట్టర్ కొనుగోలు కోసం పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేయాల్సి వచ్చింది. ఈ విక్రయ పరంపరకు ఇక్కడైనా ఫుల్‌స్టాప్ పడుతుందా అన్న ప్రశ్నకు ఎవరి దగ్గరా సమాధానం లేదు.
$200 బిలియన్ల దిగువకు
ఎలాన్ మస్క్ నికర విలువ $200 బిలియన్ల దిగువకు పడిపోయిందని రాయిటర్స్ (Reuters) రిపోర్ట్ చేసింది. టెస్లా టాప్ ఎగ్జిక్యూటివ్ అయిన మస్క్, ట్విట్టర్ పనుల్లో పడి టెస్లా నిర్వహణను సరిగా పట్టించుకుంటారో, లేదోనన్న భయంతో పెట్టుబడిదారులు టెస్లా షేర్లను భారీ స్థాయిలో అమ్మేస్తున్నారట. స్టాక్ మార్కెట్‌లో టెస్లా షేర్ల సరఫరా పెరగడంతో, డిమాండ్ తగ్గింది. ఆటోమేటిక్‌గా టెస్లా షేర్ ధర కూడా పడిపోయింది. దీంతో, మస్క్ నికర విలువ తగ్గిందని రాయిటర్స్ నివేదించింది.
Elon Musk's net worth dropped below $200 billion as investors dumped Tesla Inc (TSLA.O) shares on fears the top executive and largest shareholder of the world's most valuable electric-vehicle maker is more preoccupied with Twitter, reports Reuters pic.twitter.com/Aas4wz6c5L
— ANI (@ANI) November 9, 2022
2022 అక్టోబర్ 29న, ఎలోన్ మస్క్ అధికారికంగా ట్విట్టర్‌ని స్వాధీనం చేసుకున్నారు. అప్పటి నుంచి ఈ మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్‌లో ఒకదాని తర్వాత ఒకటిగా మార్పులు వచ్చాయి. ట్విట్టర్ గత CEO పరాగ్ అగర్వాల్ స్థానంలోకి ఎలాన్ మస్క్ వచ్చారు. ఆ తర్వాత డైరెక్టర్ల బోర్డును తొలగించారు. టాప్ లెవెల్ నుంచి కింది స్థాయి వరకు చాలా మందిని తీసేశారు. ట్విట్టర్ బ్లూ టిక్ కావాలంటే డబ్బు కట్టమంటున్నారు. అంతేకాదు, రానున్న రోజుల్లో ట్విటర్ రూల్స్‌లో మరికొన్ని మార్పులు చేయనున్నట్టు ఎలాన్ మస్క్ ఇప్పటికే ప్రకటించారు.